ఫొటోలోని నిర్మాణం చూస్తుంటే రాచరికపు ఆనవాళ్లు కనిపిస్తున్నాయ్ కదూ! ఎక్కడో చూసినట్లు ఉందా? ఔను… ఇది అందుకు సంబంధించిన చారిత్రక కట్టడమే. నూజివీడు చరిత్రకు సాక్షీభూతం. ఎప్పుడో 1565-70 ప్రాంతంలో నూజివీడు పట్టణం నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అప్పటి రాచరిక నేపథ్యానికి నిలువుటద్దంగా ఈ కోటకు కుక్కలగేటు, గుర్రం గేటు అనే ద్వారాలు ఉన్నాయి. దాదాపు 200 సంవత్సరాల క్రితం వీటిని నిర్మించారట. రాజులు, రాజ్యాలు, రాచరికాలు ఎప్పుడో పోయాయి. ఇది ప్రజాస్వామ్యం… అయితే ఏంటి అంటే…?
మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తెలుసుగా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నూజివీడు ఎమ్మెల్యే. నూజివీడు జమీందార్ రంగాయప్పారావు, విజయరాయ అప్పారావుల వంశానికి చెందిన వారే ఎమ్మెల్యే ఎంవీపీ అప్పారావు… అంటే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు. అప్పటి కోట, రాచరికపు ఆనవాళ్లకు ఎమ్మెల్యే సరికొత్త శోభను అద్దిన చిత్రాలివి. కోటకు గల గేట్లకు ఆకర్షణీయ రంగులు వేయడమే కాదు, తమ వంశపు జమీందార్లు రంగాయప్పారావు, విజయరాయ అప్పారావుల విగ్రహాలను కోట దక్షిణ, ఉత్తర ద్వారాలపై ఏర్పాటు చేశారు.
నక్సలైట్ల భయానికి తెలంగాణాలోని ‘దొరల, దేశ్ ముఖ్’ల గడీలు పాడుబడ్డ బూత్ బంగ్లాలుగా మారాయిగాని, లేకుంటే ఇంతకన్నా జిగేల్ మనే విధంగా గడీలు అనబడే దొరతనపు రాచరికపు కోటలు మరింత శోభాయమానంగా వర్ధిల్లేవి. ఆ మధ్య తెలంగాణా దొరల, దేశ్ ముఖ్ లకు సంబంధించిన గడీలను పర్యాటక ప్రాంతాలుగా మార్చనున్నారనే వార్తలు కూడా వచ్చాయి. ఎందుకోగాని ఆ ప్రతిపాదనలు అచరణ రూపం దాల్చలేదు.