దారిన పోయే కొందరు లారీ డ్రైవర్ల, క్లీనర్ల అరాచకాలు, అత్యాచారాలు, దిశ నిందితుల ఎన్కౌంటర్, సమత ఘటనలో వివక్ష వివాదం తదితర అంశాలన్నీ ఈ తాజా వార్త ముందు దిగదుడుపే. ఓట్ల పండుగ సమయంలో విదిల్చే కరెన్సీ నోట్లకు కక్కుర్తి పడి మనం ఎన్నుకున్న నాయకుల్లోనే ఎంత మంది ప్రజాప్రతినిధులు ఎటువంటి ఆరోపణలు ఎదుర్కుంటున్నారో మీరే చదవండి. వీరి బారిన పడినవారిలో అనేక మంది దిశలు, సమతలు, నిర్భయలు ఉండి ఉండవచ్చు. కానీ ఈ నిందితులు దిశ ఘటనలో ఎన్కౌంటర్ కు గురైన లారీ డ్రైవర్లు, క్లీనర్ల వంటి సామాన్యులు కాదు. సాక్షాత్తూ చట్ట సభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 76 మంది. వీరంతా ఎంపీలు, ఎమ్మెల్యేలే.
ఈ గణాంక వివరాలు ఎవరో అందిస్తున్నవి కాదు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ ప్రకటించింది. మహిళలపై నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చి, కేసులు ఎదుర్కుంటున్న 76 మంది ఎంపీ, ఎమ్మెల్యేల చిట్టాను పార్టీల వారీగా ఏడీఆర్ సంస్థ విశదీకరించింది. ఈ కేసులను ఎదుర్కుంటున్న మొత్తం సంఖ్యలో బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధుల అంకె ఎక్కువగా ఉండడం గమనార్హం. ఈ పార్టీకి చెందిన నేతలు మొత్తం 21 సంఖ్యతో తొలి స్థానాన్ని ఆక్రమించగా, ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ (16), వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (7) లు ఉన్నాయి.
గడచిన అయిదేళ్లలో అంటే 2014-2019 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో అన్ని పార్టీల్లో, అన్ని రాష్ట్రాల్లో కలిపి స్వతంత్రులు సహా ఇలాంటి కేసులు గల ఎంపీలు, ఎమ్మెల్యేల గణాంక వివరాలను ఏడీఆర్ సంస్థ పూసగుచ్చినట్లు వివరించింది. ఎన్నికల సమయంలో ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వయంగా సమర్పించిన అఫిడవిట్లను పరిశీలించిన తర్వాతే ఏడీఆర్ సంస్థ ఈ నివేదికను విడుదల చేయడం విశేషం. క్లుప్తంగా ఏడీఆర్ నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా ఉండగా, ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఒడిశా, మహారాష్ట్రలు ఉన్నాయి. గత ఐదేళ్లలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల్లో కలిపి మహిళలపై నేరాల కేసులను ఎదుర్కొంటున్న 572 మంది పోటీ చేశారు. పార్టీల వారీగా వీరిలో బీజేపీ 66, కాంగ్రెస్ 46, బీఎస్పీ 40 మంది అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయించాయి. అదేవిధంగా ముగ్గురు ఎంపీలు, ఆరుగురు ఎమ్మెల్యేలు అత్యాచారం కేసులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా 41 మంది అత్యాచార కేసులున్న వారికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇచ్చినట్లు ఏడీఆర్ సంస్థ నివేదిక వెల్లడించింది. అంతే కాదండోయ్.. మహిళా నేతలు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్, బీఎస్పీ, తృణమూల్ వంటి పార్టీలు కూడా మహిళలపై నేరాల కేసులను ఎదుర్కొంటున్నవారికి టిక్కెట్లు ఇవ్వడం మరో విశేషం. ఏడీఆర్ సంస్థ విడుదల చేసిన ఈ నివేదిక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
దిశ ఘటనలో నలుగురు
నిందితుల ఎన్కౌంటర్, నిర్భయ దోషులకు ఉరి తాళ్లు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో చట్ట
సభలకు ఎన్నికైన ఆయా ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు, న్యాయం తదితర అంశాలపై
భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దిశకు ఓ న్యాయం, సమతకు మరో న్యాయమా? అని
ప్రశ్నిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గట్టి పోరాటమే
చేస్తున్నారు. దిశ నిందితులకు ‘తూటా తీర్పు‘ తరహా న్యాయాన్ని ఆరోపణలు, కేసులు
ఎదుర్కుంటున్న ఆయా ప్రజాప్రతినిధుల విషయంలోనూ ప్రజలు కోరుకుంటే…? అర్జంటుగా
ఎన్ని తుపాకీ తూటాలు కావాలి? మరెంత మంది సజ్జన్నార్లు రావాలి? అయినా అత్యాశ
కాకపోతే సీన్ రీ-కన్ స్ట్రక్షన్ కోసం ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆయా నాయకులను చిమ్మ చీకటి
వేళ తీసుకువచ్చే పోలీసుల ధైర్యానికి పాలకుల ఆమోదం కూడా లభించాలి కదా!