కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న ఓ తండ్రి కన్నీటికి కరడుగట్టిన టెర్రరిజం సరెండరైన అరుదైన దృశ్యమిది. కన్నీళ్లకు టెర్రరిజం కరిగిపోతుందా? అనే ప్రశ్నకు ఆర్మీ విడుదల చేసిన వీడియోనే ప్రబల నిదర్శనం. ఈ ఎమోషనల్ సీన్ తిలకించే ముందు అసలు జరిగిందేమిటో వివరంగా తెలుసుకోవలసిందే మరి.
స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్పీవో)గా పనిచేసే వ్యక్తి ఒకరు ఈనెల 13వ తేదీన రెండు ఏకే-47 తుపాకులతో అదృశ్యమయ్యాడు. కాకతాళీయంగా ఈ ఘటన జరిగిన రోజునే జహంగీర్ భట్ అనే యువకుడు కూడా కనిపించకుండాపోయాడు. ఆ తర్వాత నుంచి జహంగీర్ కోసం అతని కుటుంబ సభ్యులు గాలిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే జమ్మూ-కశ్మీర్ లో శుక్రవారం నిర్వహించిన ఓ ఆపరేషన్ లో భద్రతా బలగాలు టెర్రరిస్టు ఒకన్ని రౌండప్ చేశాయి. అతన్ని కనిపించకుండాపోయిన జహంగీకర్ భట్ గా జవాన్లు గుర్తించారు. దీంతో జహంగీర్ తండ్రిని సైతం ఎన్కౌంటర్ ఘటనా స్థలానికి జవాన్లు తీసుకువచ్చారు. జహంగీర్ ను లొంగిపోవలసిందిగా అతని తండ్రిని భద్రతా బలగాలు కోరాయి.
తుపాకీ గుళ్లవర్షం కురుస్తున్న ఎన్కౌంటర్ స్థలంలో జహంగీర్ తండ్రి హృదయం కుమారుని ప్రాణం కోసం తల్లడిల్లింది. లొంగిపో బిడ్డా… అంటూ జహంగీర్ ను అతని తండ్రి అభ్యర్థించారు. కన్నీరు, మున్నీరుగా విలపించాడు. ఇదే దశలో జహంగీర్ ను కాల్చి చంపే అవకాశమున్నప్పటికీ భద్రతా బలగాలు కూడా లొంగిపోవాలని జహంగీర్ ను కోరాయి.
‘దేవుని మీదనే కాదు, నీ కుటుంబ సభ్యుల మీద ఒట్టేసి చెబుతున్నాం. నిన్నెవరూ కాల్చరు, నీకేం కాదు, రా జహంగీర్… వచ్చి లొంగిపో..’ అంటూ భద్రతా బలగాలు కోరాయి. జవాన్ల మాట మీద జహంగీర్ కు నమ్మకం కలిగింది. ప్రాణభయంతో వణికిపోతూ పొదలచాటున దాక్కున్న జహంగీర్ ఎట్టకేలకు బయటకు వచ్చాడు.
చేతిలోని తుపాకీని పక్కన పడేసి, చేతులెత్తి భద్రతా బలగాల వద్దకు చేరుకుని లొంగిపోయాడు. ఇచ్చిన మాటను జవాన్లు తప్పలేదు. జహంగీర్ కు తాగడానికి మంచినీళ్లిచ్చారు. పొరపాట్లు జరుతుంటాయ్… నీకేం కాదంటూ అతన్ని అనునయించారు. ప్రాణంపై భరోసా కల్పించారు.
మొత్తగా ఓ కన్నతండ్రి కన్నీళ్ల ముందు ‘టెర్రరిజం’ లొంగిపోయింది. జవాన్లు కల్పించిన భరోసా ఆ టెర్రరిస్టును సన్మార్గంలోకి నడిపించింది. తన కుమారున్ని టెర్రరిజం ఉచ్చు నుంచి కాపాడిన జవాన్లకు జహంగీర్ తండ్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎమోషనల్ సీన్ తాలూకు వీడియోను ఆర్మీ వర్గాలు స్వయంగా విడుదల చేశాయి. ఘటనా స్థలంలో ఏం జరిగిందో దిగువన గల వీడియోలో వీక్షించండి.