‘నువ్వు మనిషివేనా?’ అని పాలకుడు అడుగుతాడు. బాధపడకు. వెంటనే మీ ఊర్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి నీ పేరు, ఇంటిపేరు, తండ్రి లేక భర్త పేరు, నీ ఊరు, వయసు తదితర వివరాలు ఇచ్చి సదరు అధికారి ఇచ్చే NPR (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్) కాగితం తెచ్చుకో.
‘నువ్వు పౌరుడివేనా?’ అని కూడా పాలకుడు అడుగుతాడు. అయినా బాధ పడకు. వెంటనే మీ ఊర్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి నీ పేరు, ఇంటిపేరు, ఊరు, వయసు, మీ తండ్రి పుట్టిన తేది, తండ్రి పుట్టిన ఊరు, తల్లి పుట్టిన తేదీ, తల్లి పుట్టిన ఊరు, తదితర వివరాలు ఇచ్చి సదరు అధికారి ఇచ్చే NRC (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్) కాగితం తెచ్చుకో.
‘నువ్వు భారతీయుడవేనా?’ అని సైతం పాలకుడు అడుగుతాడు. అయినప్పటికీ బాధ పడకు. వెంటనే మీ ఊర్లోనో, మరోచోటో, అధికారులు చెప్పే ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి నీ పేరు, ఇంటిపేరు, ఊరు, వయసు, మీ తండ్రి పుట్టిన తేది, తండ్రి పుట్టిన ఊరు, తల్లి పుట్టిన తేదీ, తల్లి పుట్టిన ఊరు, తాత పేరు, ముత్తాత పేరు, వారు పుట్టి పెరిగిన ఊర్లు, మీ నాయనమ్మ పేరు, ముది నాయనమ్మ పేరు, పుట్టి పెరిగిన ఊరు తదితర వివరాలు ఇచ్చి సదరు అధికారి ఇచ్చే CAA (Citizenship (Amendment) Act) కాగితం తెచ్చుకో. బాధ వద్దు. కోపం వద్దు.
‘నువ్వు మనిషివేనా?’ అని పాలకుణ్ణి అడగకు, అరెస్టు చేయిస్తాడు.
‘నువ్వు మంత్రివేనా?’ అని కేంద్ర హోం మంత్రిని అడగకు, జైలుకు పంపుతాడు.
‘నువ్వు ప్రధానివేనా?’ అని పెద్దాయన్ను అడక్కు, దేశద్రోహి అని ఉరి తీస్తారు.
ఓటేశాం… గెలిపించాం… అనుభవిద్దాం… అడగడం మానేద్దాం… అలా బతికేద్దాం…
-దారా గోపి @fb