ఒక్కోసారి మనం పోలీసులను అనవసరంగా ఆడిపోసుకుంటాం గాని, ఇదిగో… ఇటువంటి స్వాముల రూపంలో గల సన్నాసుల ‘ధీమా’ వ్యాఖ్యలు విన్నాక మాత్రం అభిప్రాయం మార్చుకోవలసి ఉంటుంది. పోలీసు శాఖకు మచ్చ తీసుకువచ్చే వాళ్లు కొందరు ఉంటే ఉండవచ్చు, అది వేరే విషయం. కానీ అనేక సందర్భాల్లో, సమయాల్లో, సంఘటనల్లో పోలీసుల ‘రియాక్షన్’ ను మనం అభినందించవలసిందే. దిశ హత్యోదంతంలో తెలంగాణా పోలీసుల పని తీరుకు దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. ఎన్కౌంటర్ జరిగాక చట్ట ప్రకారం జరగాల్సిన వ్యవహారాలన్నీ జరుగుతూనే ఉంటాయి. ఎన్కౌంటర్ తర్వాత ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ప్రస్తుతం ప్రశంసల వర్షంలో తడిసి ముద్దవుతున్న తెలంగాణా పోలీసులకు తెలియనిదేమీ కాదు.

ఇక అసలు విషయానికి వద్దాం. నిత్యానందస్వామి అనే ఓ సాములోరు ఉన్నాడు తెలుసు కదా? ఆయనేననండీ… ఆ మధ్య ఓ సినిమా నటితో చిందులేస్తూ మాంచి రొమాంటిక్ డాన్స్ చేసిన సాములోరే. ఈయనను ఆధ్యాత్మిక గురువు అని కూడా కొందరు వ్యవహరిస్తుంటారు. అత్యాచారం ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన ఈ నిత్యానంద స్వామి ఇప్పుడు ప్రవచిస్తున్న వ్యాఖ్యలు వింటే ఎవరికైనా ఆగ్రహం రాక మానదు. ఆయనేమంటున్నారో తెలుసా?

‘ఏ వెదవ కోర్టూ నన్ను  ఏమీ చేయలేదు, నన్నెవరూ ముట్టుకోలేరు, నేనే పరమ శివుడిని, ఈ నిజాన్నిప్రకటించినందుకు ఏ వెదవ కోర్టు నన్ను విచారించలేదు, నేనే పరమ శివుడిని, నేను గ్యారంటీ, మీకెవరికీ మరణం లేదు’ అని ప్రవచించిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి నిత్యానందులవారు విడుదల చేశారట. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడ చిత్రీకరించారో కూడా ఆనవాళ్లు సైతం కనిపించని ఈ వీడియోను గుర్తు తెలియని ప్రాంతం నుంచి విడుదల చేశారట. అయితే నిత్యానంత స్వామి అంశంలో అన్ని దేశాల్లోని కార్యాలయాలను అలర్ట్ చేశామని, అతని ఆచూకీ గురించి కాస్త చెప్పాలని స్థానిక ప్రభుత్వాలకు కూడా స్పష్టం చేసినట్లు దేశ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ప్రకటించడం గమనార్హం.

భారతీయ చట్టాలను, వ్యవస్థనే సవాల్ చేసే విధంగా ఉన్నటువంటి ఈ నిత్యానంత సాములోరి ‘సన్నాసి చేష్ట’ల వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశం విడిచి పారిపోకముందు తెలంగాణా గడ్డ మీదకు వచ్చి ఇటువంటి వ్యాఖ్యల వీడియో విడుదల చేస్తే నిత్యానందుడికి అసలు సినిమా ఏమిటో కనిపించేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కుంటున్న ఈ నిత్యానందుడు తెలంగాణా పోలీసులకు చిక్కితే? సీన్ రీ-కన్ స్ట్రక్షన్ చేస్తుంటే? సాములోరు తన సన్నాసి చేష్టల్లో భాగంగా పోలీసులపై తిరగబడి వారి చేతుల్లోని తుపాకీ లాక్కుని కాల్పులు ప్రారంభిస్తే? తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే? ఆత్మ రక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపితే? తాను అదేదో దీవిలో సృష్టించుకున్న కైలాసం ఏం ఖర్మ? ఏకంగా అసలు కైలాసమే ‘దివి’ లో కనిపించేది. మీకూ అనిపిస్తోంది కదూ? అత్యాచార ఆరోపణలతో పారిపోయి అడ్డగోలు కామెంట్లు చేస్తున్న ఇటువంటి సన్నాసులకు ఐపీఎస్ సజ్జన్నార్ సారే కరెక్ట్… అని.

Comments are closed.

Exit mobile version