చదివారు కదా పోస్టర్…? తెల్ల పేపర్. ఎర్ర రాతలు. అన్నల పేరుతో హెచ్చరిక లాంటి వినతి. ఇంతకీ ఈ ‘మల్లన్న’ ఏమంటున్నాడంటే…? వీఆర్వోలను, జూనియర్ అసిస్టెంట్లను కలెక్టర్ అనుమతి లేకుండా లోనికి రానివ్వరాదని కోరుతున్నాడు. పార్టీ అనేది ప్రజాశక్తి రెవెన్యూతోనే స్టార్ట్ అవుతుంది అంటున్నాడు. న్యాయం జరిగేలా చూడాలని, ‘పరినామాలు’ కఠినంగా ఉంటాయని కూడా మల్లన్న పేర్కొన్నారు.
ఈ మల్లన్న ఎవరంటే… తనకు తాను దళ కమాండర్ గా పోస్టర్ లో ప్రకటించుకున్నాడు. ఏ పార్టీ దళం అంటే… రెవెన్యూతోనే స్టార్ట్ అవుతుందంటున్నాడు. ప్రజాశక్తి దళ కమాండర్ అని కూడా దాదాపు దస్కత్ చేసినట్లు రాశాడు ఎవరోగాని ఈ ‘కొత్త’ అన్న. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల ఎమ్మార్వో ఆఫీసు గోడకు ఈ పోస్టర్ అంటించి ఉంది. ఎర్ర సిరాతో కనిపించే అన్నల పోస్టర్లంటే సహజంగానే భీతి, ఆందోళన కలుగుతుంది. వాటితోపాటే చర్చ కూడా జరుగుతుంది. ఈ పోస్టర్ కూడా అదే తోవలో కాస్త కలకలం కలిగించిందన్నమాట.
కాకపోతే ‘అన్న’ల పేరుతో బెదిరించాలని చూసిన ఈ తమ్ముడికి తీవ్రవాద భాషపై పెద్దగా పట్టు సంగతేమోగాని, పరిచయం ఉన్నట్లు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే… అధికారులను అన్నలు ‘గౌరవనీయులైన’ అనే పదంతో సంబోధించిన దాఖలాలు లేవు. పరిణామాలు కఠినంగా ఉంటాయి వంటి వాక్యాలు కూడా అన్నల పరిభాష కానేకాదు. అక్కడే ఈ ‘కొత్త అన్న… మల్లన్న’ తీరుపై పోలీసులు సందేహిస్తున్నారట. అసలు ఈ పోస్టర్ ఏమిటో, దాని కథేమిటో, కమామిషేమిటో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారట. తెలంగాణాలో ప్రస్తుతం అన్నల అలికిడి వినిపిస్తోంది కదా? అందుకే ఈ ‘మల్ల+అన్న= మల్లన్న ఎర్ర రాతలతో ఏదో చేయాలనుకున్నాడు. కాకపోతే తొలి ప్రయత్నంలోనే బొక్కబోర్లా పడినట్లు కనిపించడం లేదూ!