అటవీ అధికారులపై యుద్ధానికి సిద్ధం కావాలంటూ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇచ్చిన పిలుపు వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ విప్ హోదాలో కాంతారావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు కూడా దారి తీశాయి. తాను హైదరాబాద్ నుంచి రాగానే ఫారెస్ట్ అధికారులతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధం కావాలని కూడా ప్రజలకు, పార్టీ కేడర్ కు ఆయన పిలుపునిచ్చారు. పోడు భూముల అంశాన్ని ప్రస్తావిస్తూ కాంతారావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అధికార వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రేగా కాంతారావు చేసిన ఆయా పిలుపుపై ఒకప్పటి అజ్ఞాత నక్సల్ నాయకుడు, న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆవునూరి మధు స్పందించారు. ఎమ్మెల్యే కాంతారావు ఆదివాసీల తరపున నిలబడతారా? కలబడతారా? ఆచరణలో నిజాయితీని నిరూపించుకోగలరా? అని మధు ప్రశ్నించారు. రేగా కాంతారావు యుద్ధం ప్రకటించాల్సింది అటవీ అధికారులపై కాదని, సీఎం కేసీఆర్ పై ప్రకటించాలని మధు సూచించారు. రేగా కాంతారావు ఇచ్చిన పిలుపునకు సంబంధించి ఆవునూరి మధు సోషల్ మీడియా వేదికగా జారీ చేసిన ప్రకటనను ఉన్నది ఉన్నట్లుగా దిగువన చదవవచ్చు.
‘‘ఎమ్మెల్యే రేగా కాంతారావు గారు ప్రకటించిన మాటపై నిలబడాలి.
తరతరాలుగా అడవి ఆదివాసీలకు అన్నం పెట్టింది. ఆకలి తీర్చింది. నీడనిచ్చింది. నిలబెట్టింది. బతుకు నిచ్చింది. బ్రతకడం నేర్పింది. అటువంటి ఆదివాసీలకు అండగా అడవి అన్నలు నిలిచారు. వారి ఆకలి సమస్యను తీర్చారు. ఈ పోడు భూమి ద్వారానే బుక్కెడు బువ్వ తింటున్నారు. అడవిలో అవసరం కోసం సేద్యం చేసుకోవడం తప్ప విధ్వంసం వీరికి తెలియదు. మనిషి అవసరాల స్థానంలో పెట్టుబడి అవసరాలు కార్పొరేట్ శక్తుల అవసరాలు పెరిగిన తర్వాత మాత్రమే అడవులు విధ్వంసమయ్యాయి. అభివృద్ధి పేరుతో ప్రాజెక్టుల పేరుతో అడవులను ధ్వంసం చేస్తున్నారు. విధ్వంసమే కాదు ఆదివాసీలను నిర్వాసితులను చేస్తున్నారు. మన దేశంలో 80 శాతం సహజ సంపద వనరులు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నాయి. దీన్నంతా సామ్రాజ్యవాద సంస్థలకు, కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, అటవీ శాఖ పోలీసులు, రెవిన్యూ ఈ మూడు శాఖలు సమన్వయంతో ఆదివాసీల పోడుభూములను ఆక్రమిస్తున్నారు. ఇది సరికాదన్న ఆదివాసీలపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారు. జలగలంచ నుండి మీ నియోజకవర్గం పినపాక వరకు ఎన్ని ఆకృత్యాలు జరిగాయో. ఇవన్నీ హరితహారం పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రోత్సాహంతో జరుగుచున్నవి. ఆదివాసీలకు జీవనాధారమైన భూములను చట్టవిరుద్ధంగా ఆక్రమిస్తున్నారు. ఈవిషయం నీకు తెలియంది కాదు. ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగేది అంతకన్నా కాదు. మీరు ఇప్పటికైనా దీన్ని గ్రహించాలి. మీరు నిన్న చేసిన ప్రకటన ప్రకారం ఆదివాసీల తరుపున నిలబడతారా? కలబడతారా? రేపు ఆచరణలో మీరు మీ నిజాయితీ నిరూపించుకోగలరా? అప్పుడు మాత్రమే ఆదివాసీలు మీకు అండగా ఉంటారు. మీరు చేసిన ప్రకటనకు స్వాగతం పలుకుతారు. ఇప్పటికైనా దీనిపై మీరు తగిన విధంగా వ్యవహరించండి. ఫారెస్ట్ వారిపై కాదు మీ యుద్ధం. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రకటించాలి. ఆదివాసీ ప్రజలారా ఈబూర్జువా బూటకపు న్యాయస్థానం తీర్పులకు వ్యతిరేకంగా మన కొమరం భీమ్, రాజ్గొండ్, సోయం గంగులు, బిర్సా ముండా, సమ్మక్క, సారక్క, మన కోటన్న, బాటన్న నేటి లింగన్న విప్లవ పోరాట స్ఫూర్తితో మన పోడు భూముల రక్షణ కోసం జల్, జంగిల్, జమీన్, కోసం ఏజెన్సీలో స్వయం పాలన కోసం పోరాడుదాం…
అడవి ఆదివాసీలదేనని ప్రకటించాలి. అడవి నుండి ఆదివాసీలను వెళ్ళగొట్టే కుట్రలను తిప్పికొట్టాలి.
ధరకాస్తు చేసుకున్న ప్రతి ఆదివాసి గిరిజన రైతులకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలి.
‘ఆదివాసీ మేలుకో ఏజెన్సీని ఏలుకో…’
బూర్జువా ప్రజా ప్రతినిధులు చెప్పే మాటల్లో అంతర్యాన్ని గ్రహించి మెలకువగా వ్యవహరించు.’’
విప్లవాభివందనాలతో..??
ఆవునూరి మధు.
సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ
రాష్ట్ర నాయకులు