ఈ ఫొటో గుర్తుంది కదా? ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పాదాల వద్ద ప్రణమిల్లి తన కొంగుచాచి మరీ ఓయువతి అర్ధిస్తున్న దృశ్యమిది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలానికి చెందిన కృష్ణవేణి అనే ఈ యువతి ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసేవారు. కొంత కాలం క్రితం ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఉపాధి లేకుండా పోయిందని, జీవితం దుర్భరంగా మారిందని ఈ యువతి రాజేశ్వర్ రెడ్డి పాదాల చెంత వాపోయారు. ప్రయివేట్ సంస్థల్లోని ఉద్యోగాలను సైతం తమ ఘనతగానే తమ అధికార పత్రికలో వ్యాసరూపంలో ప్రకటించుకున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ యువతికి ఎటువంటి హామీ ఇచ్చారనే అంశంపై ఇప్పటికీ స్పష్టత లేదు. సరిగ్గా నెల రోజుల క్రితం జరిగిన ఘటన ఇది.
ఈ ఫొటో గురించి కూడా తెలుసుగా? నాలుగు రోజుల క్రితం… గత నెల 28న వరంగల్ మహానగరంలోని దేశాయిపేటలో గల సీకేఎం కళాశాలలో నిర్వహించిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారసభకు సంబంధించిన చిత్రమిది. అదేం సిత్రమోగాని అధికార పార్టీ అభ్యర్థి నిర్వహించిన ఈ సభకు ‘భారీ’గా తరలివచ్చిన గ్రాడ్యుయేట్లతో సభ ‘కళకళ’లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న ఈ ‘సీన్’ను పల్లా రాజేశ్వర్ రెడ్డి అద్భుత మీటింగ్ గా అభివర్ణిస్తూ సంతృప్తిని వ్యక్తం చేయడం కూడా మరో విశేషం. ఇప్పుడు ముచ్చటగా మూడో సీన్ లోకి వెడదాం.
నిన్నగాక మొన్నటి ఘటన బాపతు వీడియో ఇది. సూర్యాపేట జిల్లా కోదాడలో మంగళవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలోనూ పల్లా రాజేశ్వర్ రెడ్డికి రివర్స్ షాక్ తగిలింది. చిలుకూరు మండల టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు వట్టికూటి నాగయ్య సభా వేదికపైనే గల పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని నిర్మొహమాటంగా నిలదీశారు. ‘ఆరేండ్ల కింద పట్టభద్రుల ఎన్నికల్లో గెలిచి, ఆ తర్వాత ఎవర్నీ పట్టించుకోలేదు. మళ్లీ ఇప్పుడు వచ్చి గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఇలా మాట ఇచ్చి ఓటర్లను మేం మోసం చేయలేం’ అంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ విషయంలో పూర్తి బాధ్యతలను కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ తీసుకుంటే తప్ప. తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసేది లేదన్నారు. అయితే తన వ్యాఖ్యల ఉద్దేశం అది కాదని నాగయ్య ఆ తర్వాత వివరణ ఇచ్చారనేది వేరే విషయం.
ఈ నేపథ్యంలో వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎదురుగాలి వీస్తున్నదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా మూడు ‘సన్నివేశాలు’ కూడా ఎమ్మెల్సీ స్థానంతో కూడిన ఉమ్మడి జిల్లాల్లోనే జరగడం గమనార్హం. ప్రచారం ఊపందుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘పల్లా’ పరిస్థితిని అంచనా వేస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఎస్కే జకీర్ ఓ విశ్లేషణాత్మక కథనాన్ని తన ఫేస్ బుక్ వాల్ పై రాశారు. ఈ అంచనా కథనంలో ప్రస్తావించిన అంశం నిజమవుతుందా? లేదా అనే సంగతి ఎలా ఉన్నప్పటికీ, ప్రచారంలో ‘పల్లా’ రాజేశ్వర్ రెడ్డికి ఎదురవుతున్న వరుస ఘటనలు సహజంగానే ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇక జకీర్ రాసిన కథనాన్ని దిగువన ఉన్నది ఉన్నట్లుగానే చదివేయండి.
‘పల్లా’కు ఎదురుగాలి!
అటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత,ఇటు అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత వెరసి ‘పల్లా’ను కష్టాల కొలిమిలో పడవేశాయి. ఖమ్మం,వరంగల్,నల్లగొండ గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో TRS అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి ఎదురు గాలి వీస్తున్నది. ఈ పరిస్థితి పూర్తిగా ఆయన స్వయంకృతాపరాధమని TRS కార్యకర్తలు చెబుతున్నారు. MLC గా గెలిచిన తర్వాత ‘పల్లా’ ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు,ఇతర వర్గాలకు చెందిన ఓటర్ల(గ్రాడ్యుయేట్లు)ను కలుసుకున్న దాఖలాలు లేవు. కనీసం ‘కృతజ్ఞత’సభలు కూడా నిర్వహించలేదు. ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ‘అత్యంత సమీపవ్యక్తి’ లా సంచరిస్తూ తన గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ప్రజల్ని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలు ఉన్నవి. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో ‘పల్లా’ ముద్ర లేనే లేదు. ఆయన చొరవతో ఏ సమస్యనూ పరిష్కరించలేదు. ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలల సంఘం బాధ్యునిగా ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర పైరవీలు చేసుకుంటూ తన పబ్బం గడుపుకుంటూ ఉండడం మినహా ఇతర ప్రయివేటు కళాశాలలకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని కొన్ని ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆరోపిస్తున్నవి. ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలను తన గుప్పిట్లో పెట్టుకున్నట్టు కొన్ని ఆరోపణలు ఉన్నవి. ప్రయివేటు యూనివర్సిటీలకు తెలంగాణ ప్రభుత్వం తలుపులు తెరవగానే ‘పల్లా’తన పరపతి ఉపయోగించుకొని ‘అనురాగ్ యూనివర్సిటీ’ని తెచ్చుకున్నట్టు విమర్శలు వచ్చిపడుతున్నవి. ప్రయివేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించిన గొడవలు, పంచాయతీలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు ‘పల్లా’పై విమర్శలు ఉన్నవి. ఇక ఈ గ్రాడ్యుయేట్ MLC నియోజకవర్గ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సత్సంబంధాలు లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్ పాయింట్. ఖమ్మంలో మాజీమంత్రి తుమ్మల, ప్రస్తుత మంత్రి పువ్వాడతో విబేధాలు ఉన్నవి. ముఖ్యమంత్రి కేసీఆర్ చుట్టూ ప్రతిక్షణం తిరుగుతూ తమకు ‘ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని, తమపై చాడీలు చెబుతున్నార’ని ఎమ్మెల్యేలు ‘పల్లా’ పై తీవ్ర ఆగ్రహంతో, అసంతృప్తితో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ మూడు జిల్లాలు తనవేనని,తాను కేసీఆర్ కు ఎంత చెబితే అంతేనని ప్రచారం చేసుకునే ‘పల్లా’ పట్ల అధికార పార్టీ నాయకులు గరం, గరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు ఆదేశించినందున ఏదో ‘మొక్కుబడిగా’ పల్లా తరపున ప్రచారం చేస్తున్నారని, వాస్తవంగా ఆయన ‘ఓటమి’నే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు TRS శ్రేణులలో ఒక ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజముంటే ‘పల్లా’ కు ప్రమాదమే. ‘పల్లా ఓడిపోయే అవకాశం ఉందం’టూ NEGATIVE TALK ఎమ్మెల్యేల నుంచే వచ్చిందని వరంగల్, ఖమ్మం జిల్లాల్లో TRS కార్యకర్తలు అనుమానిస్తున్నారు.
అధికార పార్టీ నాయకులు పల్లా అభ్యర్థిత్వంపై భిన్నా భిప్రాయాలు మొదటి నుంచీ ఉన్నవే. పల్లా స్థానంలో వేరొకరు ఉంటే ‘ఇంటి పార్టీ’లో ఇంత వ్యతిరేకత వుండేది కాదేమో. అధికార పార్టీ అభ్యర్థి పల్లాపై వ్యతిరేకత బహిరంగంగా వినిపిస్తున్నది. ఆ వ్యతిరేకతను బయటకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నా సాధ్యం కావడం లేదు. ఓ వర్గం పని గట్టుకొని చాప కింద నీరులా వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారని తెలుస్తోంది. ప్రత్యర్థులు ‘పల్లా ‘పై కావల్సినంత బురద చల్లుతున్నారు. ఈ విమర్శలను గట్టిగా తిప్పికొట్టడంలో పార్టీ విఫలమైంది. ‘పల్లా’ను కెసిఆర్ గుమస్తా అని, పాలేరు అని ఆరోపించినా TRS వైపు నుంచి బలమైన స్పందనలేదు. మేధావులంతా ప్రొఫెసర్ కోదండరాం వైపు మొగ్గు చూపుతున్నారన్నది సత్యం. సౌమ్యుడు, మేధావి,ఎమ్మెల్సీ పదవికి అర్హుడు అనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. ఉద్యోగులంతా కోదండరామ్ వైపు మొగ్గు చూపుతున్నారు. నిరుద్యోగుల్లోనూ అలాంటి స్పందనే కనిపిస్తోంది. నోట్లను గుమ్మరించి ఓట్లు సంపాదించే వ్యూహం ఫలించకపోవచ్చు. ఎవరికి మొదటి ఓటు వేసినా రెండో ప్రాధాన్యత ఓటు మాత్రం ప్రొఫెసర్ కోదండరాం కు పడే అవకాశాలే ఎక్కువ వున్నవి. ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మేధావి వర్గపు ఓట్లు గుండు గుత్తగా ప్రొఫెసర్ సొంతం చేసుకోవచ్చు. ఇక తీన్మార్ మల్లన్న, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మొదటి ప్రాధాన్యపు ఓట్లు పడ్డప్పటికీ, రెండో ప్రాధాన్యత మాత్రం ప్రొఫెసర్ కోదండరాం వైపే మరలవచ్చునని తెలుస్తోంది. కమ్యూనిస్టులు బలపరుస్తున్న విజయ సారధిరెడ్డికి ఆయా పార్టీలు ఏ మేరకు సహకరిస్తాయన్నది చూడాలి.లెఫ్ట్ పార్టీల క్యాడర్ లో చాలా మంది కోదండరాంకు ఓటు వేయడానికి ఇష్టపడుతున్నట్టు ఖమ్మం, ఇల్లేందు, మణుగూరు, కొత్తగూడెంలలో వినబడుతున్న విషయం. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీల రెండో ప్రాధాన్యతపై చర్చ ఉన్నది. CPIML న్యూడెమోక్రసీ పార్టీ ఇప్పటికే ప్రొఫెసర్ కు మద్దతు ఇస్తోంది. చెరుకు సుధాకర్ వంటి స్వతంత్ర అభ్యర్థులు పెద్దగా ఓట్లు చీల్చే అవకాశం లేదు. రాణి రుద్రమ వరంగల్ లో కొన్ని ప్రాంతాలలోనే ప్రభావం చూపనుంది. ఆమెకు మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసేవారు ‘ రెండో ఓటు’ కోదండరాంకు వేసే సంకేతాలు ఉన్నవి. రాణి రుద్రమ, కోదండరాం, సారధి ఒకే సామజిక వర్గం అని ప్రచారం సాగుతున్నా కోదండరాం ముప్పై ఏళ్ళ క్రితం తన ‘రెడ్డి’ తోకను తొలగించుకున్నారు. అయినప్పటికీ ఓట్లపై సామజికవర్గ సమీకరణాలు పనిచేసే అవకాశం తక్కువ.