ఆయనో ఐపీఎస్ అధికారి. ఉమ్మడి  ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర తెలంగాణాలో ఓ జిల్లాకు రెండు దశాబ్ధాల క్రితం ఎస్పీ. నక్సలైట్ల అణచివేతలో బాగా పేరున్న ఆఫీసర్. కొందరు ముఖ్యమంత్రులు ఆయనను కొన్ని పోస్టుల్లో ప్రత్యేకంగా నియమించేవారు. ఎందుకంటే అక్కడి అవసరాలు, పరిస్థితులను బట్టి ఆయన పనితీరుకు ప్రాధాన్యతనిచ్చేవారు.

ఈ ఎస్పీ హయాంలో అనేక మంది రాష్ట్ర స్థాయి నక్సల్ లీడర్లు ఎన్కౌంటర్ అయ్యారు. అదే సమయంలో మరికొన్ని ఎన్కౌంటర్లు కూడా జరిగాయి. ఈ రెండో రకం ఎన్కౌంటర్లలో ఎక్కువగా దొంగలు, బందిపోట్లు చనిపోతుండేవారు. కాకపోతే నక్సలైట్ల ఎన్కౌంటర్, దోపిడీ దొంగల ఎన్కౌంటర్లకు దారి తీసిన ఘటనా పూర్వాపరాలు మాత్రం వేర్వేరుగా ఉండేవి. నక్సల్స్ ఎన్కౌంటర్ల గురించి పోలీసులు చెప్పే వివరణలు తెలిసిందే. దొంగల విషయంలోనే కాస్త ఆసక్తికరంగా ఉండేవి. ఎక్కడైతే నేరం జరుగుతుందో, ఎక్కువగా అదే ప్రాంతాల్లో దొంగలు, బందిపోట్లు ఎన్కౌంటర్లకు గురయ్యేవారు. గతంలో జరిగిన దోపిడీలు, దొంగతనాలకు సంబంధించి అరెస్ట్ చేసిన నిందితులను తీసుకువెళ్లి ‘అఫెన్స్ రీ-కన్స్ ట్రక్షన్’ లో భాగంగా విచారణ జరుపుతుండగా, వాళ్లు తుపాకులు గుంజుకుని పోలీసులపై తిరగబడేవారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే తేరుకుని ఆత్మరక్షణకోసం జరిపిన ఎదురుకాల్పుల్లో దొంగలు, బందిపోట్లు మరణించేవారు. ఒక్కోసారి దొంగలను, బందిపోట్లను కోర్టుకు తీసుకువచ్చి, మళ్లీ జైలుకు తీసుకువెళ్లే సమయంలోనూ కొన్ని ఎన్కౌంటర్లు జరిగేవి. దారి మధ్యలో పోలీసు వాహనాల టైర్లు పంక్చర్ కావడం, స్టెపిన్ టైర్ మారుస్తుండగా దొంగలు తిరగబడడం, ఆత్మరక్షణకోసం పోలీసులు కాల్పులు జరపడం, దొంగలు చనిపోవడంవంటి ఘటనలు కూడా జరిగేవి. కోర్టు విచారణలో గల నిందితులైన దొంగలు సైతం ఈ ఎన్కౌంటర్లలో చనిపోయేవారు. ఆ తర్వాత అటు పోలీసులు, ఇటు బాధితులు ఊపిరి పీల్చుకునేవారు.

జర్నలిస్టుగా జిల్లా స్థాయికి ఎదిగిన కొత్తలో ఇటువంటి ఎన్కౌంటర్లపై ఓ రోజు విలేకరుల సమావేశంలోనే నేను ఆ ఎస్పీని ప్రశ్నించాను. ‘దొంగలు’ ఎన్కౌంటర్ కావడమేమిటి సర్? అని నిలదీశాను. ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిశాక నీకు సమాధానం చెబుతానంటూ ఆ ఎస్పీ బదులిచ్చారు. అనంతరం నాకు మాత్రమే ‘ఆఫ్ ది రికార్డు’గా ఆ ఎస్పీ చెప్పిన సమాధానం ఏమిటో  తెలుసా?

‘ఇళ్లల్లో చొరబడి దొంగలు డబ్బు, నగలు, ఇరత్రతా వస్తువులను ఎత్తుకుపోతే ఏమీ కాదు. వాటిని కష్టపడి మళ్లీ సంపాదించుకోవచ్చు. లేదంటే రికవరీ అయినపుడు ఎవరి సొత్తు వారికి మేమే అప్పగిస్తాం. కానీ దొంగతనాలకు వెళ్లిన వ్యక్తులు డబ్బు, నగలతోపాటు ఆ ఇంటిలోని మహిళల శీలాన్ని కూడా దోచుకుంటే? పశువుల్లా వారిపై అత్యాచారాలకు పాల్పడితే? భర్తలను కట్టేసి, భార్యలపై అఘాయిత్యాలకు పాల్పడితే? బతికినంత కాలం ఆ మహిళ కుంగి, కృషించి జీవించాల్సిందే. ఆ ఘోరం గుర్తుకు వచ్చినప్పుడల్లా బాధిత మహిళలు లోలోన రోదించాల్సిందే. వారి కుటుంబాలు కూడా విలవిలలాడాల్సిందే. ఇటువంటి దొంగలను యధేచ్ఛగా వదిలేస్తే మరికొందరు మహిళలు కూడా వీరి బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని ఎన్కౌంటర్లు అక్కడ చోటు చేసుకునే పరిణామాలను బట్టి అనివార్యమవుతుంటాయి.’ అని ఆ ఎస్పీ సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

ఇది సినిమా ‘కత’ కాదు….వండి, వార్చిన అక్షర మాయ అంతకన్నా కాదు. అక్షరాల జరిగిన అనేక ఘటనలు. కొందరు ఐపీఎస్ అధికారులు కొన్ని ఎన్కౌంటర్ ఘటనల్లో ఎందుకలా వ్యవహరించేవారో లోతుగా పరిశీలించినపుడు మాత్రమే అసలు విషయం బోధపడుతుంది. ఆ అధికారుల వ్యవహార తీరులో సమాజ హితం కనిపిస్తుంది. మళ్లీ ఘోరం జరగకుండా చూడాలనే తపన ఉంటుంది. అటువంటి నేరం చేయడానికి సాహసించేవారిలో ప్రాణభయం కలిగించే లక్ష్యం ఉంటుంది. ఇటువంటి ఘటనల్లో మానవ హక్కులు, తొక్కా, తోలు వంటి అంశాలకు ప్రాధాన్యతకన్నా, సమాజ క్షేమమే, మహిళల రక్షణే అసలు హక్కుగా భావించవలసి ఉంటుంది. అందుకే ఆ అధికారులు ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నారు. ఈ తరహా ఎన్కౌంటర్లకు ప్రాచుర్యం పొందిన సదరు ఐపీఎస్ అధికారి పేరు సజ్జన్నార్ కాదు. ప్రస్తుతం ఆయన తెలంగాణా రాష్ట్ర సర్వీసులో కూడా లేరు.

Comments are closed.

Exit mobile version