బీజాపూర్ ఎన్కౌంటర్ ఘటన
‘యు’ సేఫ్ పద్ధతిలో మెరుపు దాడి
రెండు గుట్టలపై ‘అంబుష్’ నిర్మాణం
ఎనిమిదికి పెరిగిన జవాన్ల మృతి సంఖ్య
మరో 21 మంది జవాన్ల మిస్సింగ్
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అడవుల్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. సాధారణంగా ఇటువంటి ఎన్కౌంటర్ సమయాల్లో అటు పోలీసులుగాని, ఇటు నక్సలైట్లుగాని తుపాకులతో మాత్రమే పరస్పరం తలపడుతుంటారు. ఏకే-47, ఎస్ఎల్ఆర్ వంటి అధునాతన ఆయుధాలను ఉపయోగిస్తుంటారు. కానీ బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని తొర్రెం అడవుల్లో నిన్నటి ఎన్కౌంటర్ ఘటనలో ఇందుకు విరుద్ధంగా నక్సల్స్ జవాన్లపై విరుచుకుపడినట్లు అధికార వర్గాలే చెబుతున్నాయి. మరోవైపు ఎన్కౌంటర్ లో చనిపోయిన పోలీసుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. నిన్నటి వరకు ఐదుగురు జవాన్లు మరణించగా, చికిత్స పొందుతూ మరో ముగ్గురు జవాన్లు తుదిశ్వాస విడిచినట్లు తాజా సమాచారం. ఇంకో 24 మందికిపైగా జవాన్లు గాయపడిన ఎన్కౌంటర్ సంఘటనలో దాదాపు 21 మంది పోలీసుల ఆచూకీ లభ్యం కావడం లేదనే వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్కౌంటర్ సందర్భంగా ఈ జవాన్లు కాల్పులు జరుపుతూ చెల్లచెదురుగా విడిపోయారా? లేక నక్సల్స్ చేతిలో చిక్కారా? అనే అంశంపై స్పష్టత రావడం లేదు.
పోలీసులను పెద్ద ఎత్తున ప్రాణనష్టానికి గురి చేసిన ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు నక్సల్స్ ‘మోర్టార్ లాంఛర్ల’ను వినియోగించారు. ఫలితంగానే పోలీసులకు భారీ ప్రాణనష్టం వాటిల్లందంటున్నారు. నక్సలైట్లు మోర్టార్ లాంఛర్లను ఉపయోగించారని ఛత్తీస్ గఢ్ హోం మంత్రి తమరాధ్వాజ్ సాహు స్వయంగా ప్రకటించారు. తమను భారీ ప్రాణ నష్టానికి గురిచేసిన నక్సలైట్లు మోర్టార్ లాంఛర్లను వినియోగించడం ఆందోళనకర పరిణామంగానే పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఇంతకీ ఏమిటీ మోర్టార్ లాంఛర్ల స్థితి? అనే ప్రశ్నకు వస్తే, సాధారణంగా ప్రత్యర్థులపై గ్రెనేడ్ల వంటి పేలుడు పదార్థాలను చేతిలో విసిరితే, దాన్ని ఉపయోగించే వ్యక్తి చేతిలోని శక్తి వరకు మాత్రమే అది లక్ష్యాన్ని చేరుకుంటుంది. కానీ మోర్టార్ లాంఛర్ ద్వారా గ్రెనేడ్ ను ఉపయోగిస్తే గరిష్టంగా 250 గజాల (పావు కిలోమీటర్) దూరాన్ని ఛేదిస్తుంది. మోర్టార్ లాంఛర్ ద్వారా లక్ష్యాన్ని చేరుకున్న ‘పేలుడు పదార్థం’ అక్కడి భౌతికి స్థితిని బట్టి ప్రాణనష్టాన్ని కలిగిస్తుంది. తొర్రెం అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ సందర్భంగా నక్సలైట్లు మోర్టార్ లాంఛర్లను వినియోగించినట్లు స్వయంగా ఛత్తీస్ గఢ్ హో మంత్రి ప్రకటించడం గమనార్హం.
కాగా ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో కనీసం 600 మంది నక్సలైట్లు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. మావోయిస్టు బెటాలియన్ కమాండెంట్ హిడ్మా నాయకత్వంలో అధునాతన ఆయుధాలతోనేగాక మోర్టార్ లాంఛర్లతో పోలీసులపై విరుచుకుపడినట్లు తెలుస్తోంది. నక్సల్స్ ‘యు’ సేఫ్ పద్థతిలో మెరుపుదాడి ద్వారా జవాన్లను ఇరికించినట్లు సమాచారం. అడవుల్లోని రెండు గుట్టలపై మావోలు ‘అంబుష్’ దాడిని నిర్మించారని, జవాన్లు అప్రమత్తమయ్యేలోపే విరుచుకుపడినట్లు ఛత్తీస్ గఢ్ మీడియా నివేదించింది. ఇదిలా ఉండగా ఈ ఎన్కౌంటర్ ఉదంతలో తొమ్మిది మంది నక్సలైట్లు కూడా మరణించారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటించారు.
ఫీచర్డ్ ఇమేజ్: ప్రతీకాత్మక చిత్రం