తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ నక్సల్స్ అలజడి మొదలైనట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు సహజంగానే పోలీసుల విధినిర్వహణపై వత్తిడి పెంచుతున్నాయని చెప్పక తప్పదు. తెలంగాణాలో తీవ్రవాద కార్యకలాపాలను పూర్తి స్థాయిలో నిర్మూలించినట్లు పాలక వర్గాలు గతంలో ప్రకటించడం ఈ సందర్భంగా గమనార్హం.
దశాబ్ధాలపాటు ఉమ్మడి రాష్ట్రంలోని తమ ప్రాబల్య ప్రాంతాాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన నక్సల్ గ్రూపులు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలోనూ పూర్వవైభవం కోసం పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఓవైపు మావోయిస్టు పార్టీ, మరోవైపు జనశక్తి నక్సల్ కార్యకలాపాలు వేళ్లూనుకుంటున్నట్లు తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
ఈనెల 6వ తేదీన సిరిసిల్ల నియోకవర్గంలో ఆరుగురు జనశక్తి నక్సల్స్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రామచంద్రన్ గ్రూపు పేరుతో వేళ్లూనుకునేందుకు ప్రయత్నించిన జనశక్తి నక్సల్స్ నుంచి రెండు దేశవాళీ తుపాకులను, ఇతర సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజాగా ఒకేరోజు జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లోనూ మావోయిస్టు పార్టీ నక్సల్స్ తో పోలీసులకు ఎదురుకాల్పులు జరిగాయి. కుమ్రంభీం జిల్లా మంగీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక అడవుల్లో పోలీసులకు, మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు మధ్య బుధవారం ఎన్కౌంటర్ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.
వేర్వేరుగా జరిగిన ఈ రెండు ఘటనల్లోనూ మావోయిస్టులు పెద్ద సంఖ్యలోనే పోలీసులకు తారసపడినట్లు వార్తల సారాంశం. తెలంగాణా రాష్ట్ర కమిటీ ముఖ్యనేత మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ తోపాటు మరో నలుగురు నాయకులు కూడా ఉన్నట్లు సమాచారం.
తెలంగాణాలో మళ్లీ మావోయిస్టులు పాగా వేయడానికి ప్రయత్నించడం వెనుక బలమైన కారణాలున్నట్లు పోలీసు నిఘా వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణాకు చెందిన అనేక మంది నక్సల్స్ స్థానిక పరిస్థితుల కారణంగా పొరుగున గల ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి వెళ్లిపోయారని ఇన్నాళ్లపాటు భావించారు.
అయితే ఇటీవల జరిగిన మావోయిస్టు పార్టీ ముఖ్య సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఏ రాష్ట్రానికి చెందిన నక్సల్స్ అదే ప్రాంతంలో పార్టీ బలోపేతానికి పాటుపడాలని మావోయిస్టు పార్టీ అగ్ర నాయకత్వం నిర్దేశించిందంటున్నారు.
ఇందులో భాగంగానే గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు మావోయిస్టు నక్సల్స్ పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. కుమ్రం భీం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో నక్సల్స్ కదలికలు ఇందులో భాగంగానే విశ్లేషిస్తున్నారు.