నక్సల్ ఉద్యమ చరిత్రలో అరుదైన ఉదంతమే కాదు… బహుషా తొలి ఘటన కూడా కావచ్చు. తుపాకులతో ప్రభుత్వానికి లొంగిపోయిన నక్సల్ నేతలను చూశాం. కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా సహచరులను కాల్చి చంపి పోలీసులకు లొంగిపోయిన నక్సలైట్లనూ చూశాం. కానీ మావోయిస్టు పార్టీ ఉద్యమ చరిత్రలోనే కాదు… బహుషా నక్సల్ ఉద్యమ చారిత్రక నేపథ్యంలోనే ఇటువంటి ఘటన జరిగి ఉండకపోవచ్చు. మధ్యప్రదేశ్ లో మావోయిస్టు పార్టీకి చెందిన నక్సల్ నేత ఒకరు రూ. 10.00 లక్షల నగదుతో పోలీసులకు లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు మరో 400 తుపాకీ తూటాలలను కూడా అతను పోలీసులకు అప్పగించాడు. ఇదే సందర్భంగా వాకీ టాకీలను, ఇతరత్రా సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మధ్యప్రదేశ్ లో మావోయిస్టు పార్టీ ఎక్స్టెన్షన్ ప్లాటూన్ కమాండర్ దివాకర్ అలియాస్ కిషన్, భొరమ్ దేవ్ డివిజన్ కమిటీకి చెందిన మహిళా నక్సల్ నేత కవర్ధ ఎస్పీ శాలబ్ సిన్హా ఎదుట బుధవారం లొంగిపోయారు. ఈ సందర్భంగా రూ. 10.00 లక్షల నగదును, 400 తుపాకీ తూటాలను ఆయా నక్సల్ నేతలు పోలీసులకు అప్పగించారు. ఇదిలా ఉండగా నగదుతో నక్సలైట్లు పోలీసులకు లొంగిపోయిన ఘటనలు ఇప్పటి వరకు జరగలేదని మావోయిస్టు పార్టీకి చెందిన మాజీ నాయకుడొకరు ఈ సందర్భంగా చెప్పారు. పార్టీకి చెందిన నగదును కొందరు దాచుకోవడమో, కుటుంబ సభ్యులకు రహస్యంగా పంపుకోవడమే వంటి ఉదంతాలు ఉండవచ్చని, కానీ పోలీసులకు నగదు అప్పగిస్తూ లొంగిపోయిన సంఘటన ఇదే ప్రథమమని కూడా విప్లవోద్యమంలో సుదీర్ఘ అనుభవం గల ఆయా నాయకుడు స్పష్టం చేవారు. ఈ లొంగుబాటుకు సంబంధించిన మరికొన్ని దృశ్యాలను దిగువన చూడవచ్చు.