తెలంగాణాలోని ఓ ఎమ్మెల్యే కూతురుకు గన్ మెన్లతో వీఐపీ సెక్యూరిటీ ఇచ్చారా? అనే ప్రశ్న రేకెత్తుతోంది. ఇందుకు దారి తీసిన పరిస్థితులేమిటి? అనే అంశంపైనా భిన్న చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కుమార్తె అనన్యరెడ్డి గన్ మెన్ల రక్షణలో కార్ల కాన్వాయ్ తో ప్రయాణించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నర్సంపేట ఎమ్మెల్యే ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే విమర్శల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోకు ట్యాగ్ చేసి ఉండడం గమనార్హం. నర్సంపేటకు ఎమ్మెల్యే మాధవరెడ్డా? లేక ఆయన కూతురా? అంటూ ఇదే వీడియో ద్వారా ప్రశ్నల వ్యాఖ్యలు ఉన్నాయి. ఎమ్మెల్యేకు తప్ప ఆయన కుటుంబ సభ్యులకు ప్రత్యేక గన్ మెన్ల కేటాయింపు ఉండదని ఓ పోలీసు అధికారి ఈ సందర్భంగా చెప్పారు.
కాగా దసరా పండుగ సందర్భంగా వరంగల్ భద్రాకాళి అమ్మవారి దేవస్థానంలో పూజల నిర్వహణకు వెళ్లినపుడు ఎమ్మెల్యే మాధవరెడ్డి కూతురు గన్ మెన్ల రక్షణలో ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీసిన వీడియో ఇప్పుడు వివాదంగా మారింది. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు ఓ అస్త్రంగా వీడియో లభించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కూతురుకు వీఐపీ సెక్యూరిటీ అంటూ సోషల్ మీడియాలో తిరుగుతున్న వీడియోను దిగువన చూడవచ్చు…