కొందరు మంత్రులకు సంబంధించిన వార్తల విషయంలో అధికార పార్టీ కరదీపిక ‘నమస్తే తెలంగాణా’ పత్రిక వివక్ష చూపుతోందా? విపక్షాలు చేసే విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే విషయంలో అధికార పార్టీ పత్రిక కూడా ఆశించిన స్థాయిలో పట్టించుకోకుంటే ఆ మంత్రులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలి? ఇవీ టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల తాజా సందేహాలు.
విషయమేమిటంటే… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొన్నటి ఖమ్మం పర్యటనలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే కదా! మంత్రి కుటుంబానికి చెందిన మమత మెడికల్ కళాశాలను, ఎన్నెస్పీ కాల్వ భూముల క్రమబద్ధీకరణ, కాంట్రాక్టులు, పార్టీల మార్పు, అవినీతి, అక్రమాలు, విచారణ, జైలు… అంటూ భారీ ఎత్తున ఆరోపణలను గుప్పించారు. తరుముకొస్తున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సంజయ్ ఖమ్మంలో పర్యటించడం, ముఖ్యంగా మంత్రినే టార్గెట్ చేస్తూ సంజయ్ ఆరోపణలకు దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రిపై సంజయ్ చేసిన ఆయా ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగానూ కలకలానికి దారి తీశాయి కూడా. ఈ ఆరోపణలను, విమర్శలను ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, హరిప్రియ తదితర నేతలు ప్రెస్ మీట్ పెట్టి ఖండించారనేది వేరే విషయం.
ఈ నేపథ్యంలోనే తనను టార్గెట్ చేస్తూ సంజయ్ చేసిన ఆరోపణలపై మంత్రి పువ్వాడ అజయ్ నిన్న నేరుగా స్పందించారు. తనపై సంజయ్ చేసిన అవినీతి, అక్రమాల ఆరోపణలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ, ‘ఎప్పుడో 2023 వరకు దేనికి? కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉందిగా? దమ్ముంటే విచారణ జరిపించు? నువ్వో బత్తాయివి. నీదో అంటు రోగం పార్టీ’ అంటూ మంత్రి పువ్వాడ ఉద్వేగంగా మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. మంత్రి స్పందించిన తీరుపై ఆంధ్రజ్యోతి వంటి ప్రముఖ పత్రిక కూడా ప్రాధాన్యతనిస్తూ మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీలో వార్తను ప్రచురించింది. సవాళ్ల మీద సవాళ్లను విసురుతున్న బీజేపీ నేత సంజయ్ ఆరోపణలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీటుగా జవాబిస్తే అధికార పార్టీ కరదీపిక ‘నమస్తే తెలంగాణా’ పత్రిక భారీగా స్పందిస్తుందని, పెద్ద ఎత్తును కవరేజీ ఇస్తుందని టీఆర్ఎస్ వర్గాలు ఆశించడం సహజం. కానీ అందుకు విరుద్ధంగా ‘నమస్తే తెలంగాణా’ పత్రిక వ్యవహరించడమే అసలు విషాదం.
మంత్రి పువ్వాడ ఉద్వేగపూరిత మాటలను ఆ పత్రిక జిల్లా ఎడిషన్ కే పరిమితం చేసింది. మెయిన్ ఎడిషన్ లోని ప్రతి పేజీని ఒకటికి, రెండుసార్లు బూతద్దం పెట్టి పరిశీలనగా చూసినప్పటికీ మంత్రి అజయ్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ కు ధీటుగా జవాబిచ్చిన మాటలకు సంబంధించి అక్షరం ముక్క ప్రచురించిన దాఖలా కనిపించలేదు. దీంతో ఇది మంత్రి బాధే తప్ప ‘నమస్తే తెలంగాణా బాధ కాదా’ అని టీఆర్ఎస్ వర్గాలు మథనపడుతున్నాయి. అయితే వేర్వేరు అంశాలపై ఇతర మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావులకు సంబంధించిన వార్తలకు మాత్రం నమస్తే తెలంగాణా మెయిన్ ఎడిషన్ లో స్థానం లభించడం ఈ సందర్భంగా గమనార్హం.