తెలంగాణాలో అధికార పార్టీ కరదీపికగా భావిస్తున్న ‘నమస్తే తెలంగాణా’ పత్రికకు చెందిన జర్నలిస్ట్ ఒకరు రాసిన బహిరంగ లేఖ ఒకటి పాత్రికేయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. అధికార పార్టీ పత్రికలో జర్నలిస్టుల దైన్యస్థితికి ఈ లేఖ నిలువుటద్దంగా నిలుస్తోందనే వ్యాఖ్యలు ఈ సందర్భంగా పలువురి నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే నిర్మల్, మంచిర్యాల, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లోని స్టాఫ్ రిపోర్టర్లను అకారణంగా ఇంటికి పంపారని ఆ పత్రిక ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. వివిధ స్థాయిల్లో గల సుమారు 200 మంది నమస్తే తెలంగాణా పత్రిక నుంచి ఉద్వాసనకు గురయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ హరీష్ తన తొలగింపు తీరుపై ఆవేదనను, ఆందోళనను వ్యక్తం చేస్తూ ఓ బహిరంగ లేఖను రాశారు. ‘ఎన్ టి డిస్ట్ ఇంచార్జెస్’ పేరుతో గల ఆ పత్రిక అధికారిక వాట్సప్ గ్రూపులోనే హరీష్ తన లేఖను పోస్ట్ చేశారు. అధికార పార్టీకి చెందిన పత్రిక స్టాఫ్ రిపోర్టర్ రాసిన ఆయా లేఖను దిగువన ఉన్నది ఉన్నట్లుగానే చదవవచ్చు.
గౌరవనీయులైన…….
నమస్తే తెలంగాణ ఎండీ గారితో పాటు సంస్థను నడిపిస్తున్న పెద్దలకు మరియు బ్యూరో ఇంచార్జీ లకు… స్టాఫ్ రిపోర్టర్ లకు ప్రతి ఒక్కరికి నమస్కారం….
నేను గత ఎనిమిది సంవత్సరాలుగా మన సంస్థలో పనిచేస్తూ రిపోర్టర్ స్థాయి నుండి స్టాఫ్ రిపోర్టర్ గా ఎదిగి మన సంస్థ అభివృద్ధికై పనిచేస్తూ వస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు మన సంస్థలో పనిచేసే అవకాశం కల్పించి ఆదరించిన మన సంస్థకు మరియు ఎం. డి గారికి, సహకరించిన పెద్దలకు పేరు పేరునా కృతజ్ఞుడను.. నా ఈ ఎనిమిదేండ్ల ప్రస్థానంలో ఏ ఒక్కరోజు కూడా మన సంస్థ అభివృద్ది విషయంలో నేను రాజీ పడలేదు.. వార్తల సేకరణ విషయంలో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. అవినీతికి కూడా ఎక్కడా కూడా అవకాశం ఇవ్వలేదు.. నీతి, నిజాయితీ మరియు నిబద్దతతో మన సంస్థ పటిష్టత కోసం పనిచేస్తూ వచ్చాను.. ఈ కారణంగానే నేను రిపోర్టర్ స్థాయి నుండి స్టాఫ్ రిపోర్టర్ గా ఎదిగాను అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈ పరిస్థితులల్లో గత రెండు రోజుల క్రితం నన్ను తొలగిస్తున్నట్లు మన స్టేట్ హెచ్ ఆర్ గారు ఫోన్ చేసి చెప్పారు. కారణం ఏంటి సార్ అని అడిగితే ఎడిటర్ గారి ఆదేశం అని చెప్పారు. గత నెల 24 వ తేదీన నన్ను హైదరాబాద్ హెడ్ ఆఫీసుకు పిలిపించిన సంస్థ ఉన్నతాధికారి గారు ఒకరు ( ఎలాంటి కారణం లేకుండానే ) నన్ను తన ఇస్టాను సారంగా మాట్లాడారు. అప్పుడు నేను చేసిన తప్పేంటి సార్ అని అడిగితే సరైన సమాధానం చెప్పకుండా ఆకాశ రామన్న ఉత్తరాలు ఉన్నాయని, నన్ను దబాయించి నీకు మూడు నెలల గడువు ఇస్తున్న నీ యొక్క పనితీరు చూసి నీపై నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి తొమ్మిది రోజుల్లో హడావిడిగా నన్ను తొలగించారు. నేను చేసిన తప్పిదాలు ఏంటో, నన్ను సంస్థ నుండి తొలగించే అంత పెద్ద తప్పిదాలు ఉన్నాయా? అని నేను ఎంత ఆలోచించినా నాకు అంతుచిక్కడం లేదు. నేను పనిచేసిన మహబూబాబాద్, ఖమ్మం , కొత్తగూడెం జిల్లాల్లో సంస్థ పేరు కోసమే పని చేస్తూ వచ్చినాను. కానీ నాపై గత సంవత్సర కాలంగా కక్ష పూరిత వైఖరి అవలంబిస్తూ వస్తూ ప్రస్తుత ఉమ్మడి ఖమ్మం జిల్లా బాధ్యుడు ఆధ్వర్యంలో తప్పుడు ఉత్తరాలు రాయిస్తూ.. వార్తల సేకరణలో అడ్డంకులు సృష్టిస్తూ మానసికంగా వేధింపులకు పాల్పడిన ప్రతీ సంఘటనకు ఎవరు సారథ్యం వహిస్తున్నారు అనేది నాకు తెలియనిది కాదు. నన్ను మనస్పూర్తిగా పని చేయనియకుండా… నా దగ్గర పనిచేసే రిపోర్టర్ల ఎదుటే బ్యూరో ఇంఛార్జి నన్ను లెక్క లేకుం డా మాట్లాడితే… ఆకాశ రామన్న ఉత్తరాలు పంపిస్తే ఎటువంటి విచారణ చేయకుండానే.. నాకు వర్గాలని ఆపాదించి కుట్ర పూరితం గా బయటికి పంపడం ఉన్నత స్థాయిలో ఉన్న వారికి సమంజసం కాదనేది నా అభిప్రాయం. ప్రతిభ గురించి మాట్లాడుతూ… అసమర్ధులకు కనీస అర్హతలు లేని వారికి బాధ్యతలు అప్పగించడం వెనుక ఎవరి స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయో మన సంస్థ ప్రతినిధులు దయచేసి ఆలోచించండి. మన పత్రిక ఉద్యమ కాలంనుండి ఉరకలు వేస్తూ ఉద్యమాన్ని వికసింపచేసి ప్రత్యేక రాష్ట్రం రావడంలో తన వంతు పాత్ర పోషించింది. పత్రిక ఇలాంటి స్వార్థపూరిత చర్యలవలన తిరోగమనంలో పయనిస్తదేమో అని నాకు బాధగా ఉన్నది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారి సారధ్యంలో ఎన్నెన్నో అద్భుత విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన మన పత్రిక గత ఏడాదికాలంగా తప్పుడు నిర్ణయాలతో ఆ తరహా పాత్రని పోషించడంలో విఫలం అవుతున్నది అనేది జగమెరిగిన సత్యం…అన్నం పెడుతున్న మన ఈ సంస్థను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన వారు అనుభవజ్ఞులైన వారందరినీ తప్పుడు ఆరోపణలు సృష్టించి తొలగిస్తూ తన ఆధిపత్య ధోరణిని చాటుకోవడం దేనికో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని నా విజ్ఞప్తి … ఇంత పెద్ద పత్రికని కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం, వారి ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటం కోసం సంస్థ మూలాలను దెబ్బతీస్తున్నారు. నేను పోయినా పత్రిక మిగలాలి అనేది నా ప్రగాఢ ఆకాంక్ష. కానీ కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇలానే ప్రవర్తిస్తూ పోతే మన సంస్ధ మనుగడే ప్రశ్నార్థకం అయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి విషయాలపై యాజమాన్యం దృష్టి పెట్టకపోతే .. “నమస్తే తెలంగాణ” అనే బ్రాండ్ మన కళ్లముందే కనుమరుగ వుతుందేమో అనే బాధతో నా ఈ ఆవేదనను పెద్దల ముందు ఉంచదలుచుకున్నాను. ఒక వర్గం తన గ్రూపును పెంచుకునే ప్రయత్నం
కరోనా కష్టకాలంలో సైతం వార్తలను సకాలంలో అందించి మహమ్మారి బారినపడి హైదరాబాద్ మాదాపూర్ సిగ్మా ఆసుపత్రిలో చికిత్స పొంది సుమారు 3 లక్షలు ఖర్చు పెట్టుకొని బ్రతికి బట్టకట్టాను. ఆ సందర్భంలో కూడా ఏ ఒక్కరూ సంస్థ తరుపున నా బాగోగుల గురించి మాట్లాడింది లేదు. అయినా కొంతకాలం విశ్రాంతి తీసుకొని వార్తల సేకరణలో నిమగ్నమై నెలకు సరాసరి 20 స్టోరీలను ఇస్తూ మంచి ఎడిషన్ అందించడంలో కీలకపాత్ర పోషించాను.
పెద్దలకు
కృతజ్ఞతా భివందనాలతో
హరీష్….
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…