తెలంగాణాలో అధికార పత్రికగా ప్రాచుర్యం పొందిన ‘నమస్తే’ తెలంగాణా పత్రికలో పనిచేసే జర్నలిస్టులకు, ఇతర సిబ్బందికి ఉద్యోగపరంగా అభద్రతా పరిస్థితులు నెలకొంటున్నాయా? కరోనా పరిణామాల్లో అనేక రకాలుగా ఖర్చుపై కట్టడి చర్యలు తీసుకుంటున్న తెలుగు మీడియాలోని పలు పత్రికల దారిలోనే నమస్తే తెలంగాణా యాజమాన్యం కూడా పయనించే అవకాశాలున్నాయా? ‘సెల్ఫ్ అప్రయిజల్’ పేరుతో నమస్తే తెలంగాణా యాజమాన్యం అందులో పనిచేసే జర్నలిస్టులకు పంపిన ఓ ప్రొఫార్మా ఇవే సందేహాలను రేకెత్తిస్తోంది.

పేరు, హోదా, అనుభవం, ఐడీ నెంబర్, చేరిన తేదీ, హోదా వంటి వివరాలతోపాటు మరో ఎనిమిది ప్రశ్నలకు సంస్థ యాజమాన్యం అందులో పనిచేసే విలేకరుల నుంచి స్వయం ప్రకటిత విషయాలను (సెల్ఫ్ అప్రయిజల్) కోరింది. ప్రతి రోజు చేేసే పనులేమిటి? రోజుకు ఎన్ని వార్తలు రాస్తారు? మెయిన్ ఎడిషన్లో సగటున నెలలో పబ్లిష్ అయిన వార్తల సంఖ్య ఎంత? నెలలో సగటున ఎన్ని వార్తా కథనాలు రాస్తారు? ఓ నెలలో మీరు కంట్రిబ్యూటర్ కు ఐడియాలు ఇచ్చి రాయించిన స్టోరీలెన్ని? గడచిన మూడు నెలల కాలంలో ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ వార్తల సంఖ్య ఎంత? మీ పనిలో వాల్యూ ఆడిషన్ కి చేస్తున్న ప్రత్యేక కృషి ఏమిటి? మీకు ఎక్కువ నైపుణ్యం ఉన్న రంగం ఏమిటి? మరేదైనా విభాగంలో పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నారా? వంటి ప్రశ్నలతో ప్రొఫార్మాను రూపొందించి రిపోర్టర్ల నుంచి జవాబులను కోరారు.

‘నమస్తే తెలంగాణా’ యాజమాన్యం ఇచ్చిన ప్రొఫార్మా ఇదే!

అయితే ఇన్నేళ్లుగా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను ఎన్నడూ లేని విధంగా ‘సెల్ఫ్ అప్రయిజల్’ కోరడంలో అర్థం ఏమిటో తెలియక నమస్తే తెలంగాణాలో పనిచేసే జర్నలిస్టులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్, ప్రింట్ మీడియా ఎదుర్కుంటున్న తాజా పరిస్థితులే వారి ఆందోళనకు ప్రధాన కారణం. పలు పత్రికల్లో ఉద్యోగుల సంఖ్యను కుదించడం, లాంగ్ లీవ్ లో వెళ్లాలని, సగం, పావు జీతం ఇస్తామని కొన్ని సంస్థల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వారిలో ఆందోళనకు దోహదపడుతున్నాయి.

ప్రయివేట్ సంస్థల్లో ఉద్యోగులను తొలగించవద్దని, పూర్తి వేతనం ఇవ్వాలనే సారాంశంతో మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటన చేసిన నేపథ్యాన్ని నమస్తే తెలంగాణా ఉద్యోగ వర్గాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘సెల్ఫ్ అప్రయిజల్’ ప్రొఫార్మా కారణంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్న నమస్తే తెలంగాణా ఉద్యోగులకు, ముఖ్యంగా జర్నలిస్టులకు ఉద్యోగ భద్రతపై భరోసా కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యానిదే. ప్రస్తుతం ప్రింట్ మీడియా ఎదుర్కుంటున్న ప్రతికూల పరిస్థితుల్లో విలేకరుల నుంచి కోరిన ‘సెల్ఫ్ అప్రయిజల్’ అసలు అర్థమేమిటో బోధించాల్సిన అవశ్యకత అనివార్యం కూడా.

Comments are closed.

Exit mobile version