బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వర్ రావు టీడీపీ అభిమానుల ఓట్ల కోసం భారీ స్కెచ్ గీస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన టీడీపీ అభిమానుల జపం చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అరెస్ట్ అనంతరం హైదరాబాద్ లో ఆందోళనకు దిగిన టీడీపీ అభిమానులను ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల ఫలితం గత ఎన్నికల్లో తెలిసిందే. ఇదే దశలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటికీ తన ప్రభావాన్ని చూపుతున్న టీడీపీ ఓట్ల సంఖ్యపై భిన్న వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకి మళ్లిందనేందుకు ఫలితాలే నిదర్శమని పరిశీలకులు చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీతో తనకు గల అనుంబంధాన్ని మననం చేస్తూ ఎంపీ నామ నాగేశ్వర్ రావు ప్రచార సరళి సాగుతుండడం గమనార్హం. ఇందుకు సంబంధించి ఎంపీ నామ నాగేశ్వర్ రావు కార్యాలయం నుంచి వెలువడిన ఓ ప్రకటన సారాంశాన్ని దిగువన చూడవచ్చు.
ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా నేతలతో ఎంతో అనుబంధం ఉంది. మొదట తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ ఎన్ టి రామారావు అంటే ఎంతో ఇష్టపడే నామ, అన్న ఎన్టీఆర్ ఇచ్చిన స్ఫూర్తితోనే రాజకీయ రంగప్రవేశం తెలుగుదేశం పార్టీతో చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను అమలు చేయడమే లక్ష్యంగా నాడు ఖమ్మం ఎంపీగా, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఖమ్మంతోపాటు తెలంగాణ కోసం విశిష్ఠ సేవలందించారు.
నాడు ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో నామకు ఏర్పడిన సన్నిహిత అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఖమ్మం సిట్టింగ్ ఎంపీగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా టీడీపీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చారు. పార్లమెంటులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు పోరాడిన నామ, ఖమ్మం జిల్లాలోనూ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో ఎన్టీఆర్ ప్రారంభించిన బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ట్రస్టు బోర్డు సభ్యుడిగా పేద రోగులకు, ఖమ్మం ప్రజలకు సేవలందించి టీడీపీ క్యాడరులో చెరిగని ముద్ర వేశారు. ఎన్టీఆర్ అంటే ప్రేమతోనే నామ ఇప్పటికీ టీడీపీ క్యాడర్ అంటే ఎంతో ప్రాధాన్యమిచ్చి పనులు చేస్తుంటారు. పార్టీలకు అతీతంగా విశిష్ఠ సేవలందిస్తున్న మన నామ నాగేశ్వరరావు ఈ పార్లమెంటు ఎన్నికల్లో మద్ధతు ఇస్తామని ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథంను గురువారం సాయంత్రం మధిరలోని ఆయన నివాసంలో నామ నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ నామ మాట్లాడుతూ, జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించాలని డా. వాసిరెడ్డి రామనాథంను కోరారు. అలాగే టీడీపీ పార్టీతో ఉన్న జ్ఞాపకాలను ఆయన అక్కడ ఉన్న టీడీపీ నేతలతో మాట్లాడుతూ గుర్తు చేసుకున్నారు. అనంతరం ఎంపీ నామను డా వాసిరెడ్డి రామనాథం శాలువాతో ఘనంగా సత్కరించారు.