గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల తరహాలో సీఎం కేసీఆర్ రాజకీయంగా మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించబోతున్నారా? అనే ప్రశ్నలకు ఔననే విధంగా ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీదేవిని ప్రకటించి అనూహ్య విజయం సాధించిన విషయం విదితమే. ఇదే తరహాలో సాగర్ ఉప ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయనే చర్చ నల్లగొండ జిల్లాలో జరుగుతోంది. కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అనే అభ్యర్థి పేరు తాజాగా వార్తల్లోకి రావడమే ఇందుకు కారణం. అనూహ్యంగా తెరపైకి వచ్చిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మరెవరో కాదు. సినీ హీరో అల్లు అర్జున్ కు స్వయానా పిల్లనిచ్చిన మామ కావడం విశేషం. అంతేకాదు బడా పారిశ్రామికవేత్తగా, కేసీఆర్ ఫౌండేషన్ పేరున సేవా కార్యక్రమాలు నిర్వహించిన నేపథ్యం కంచర్లకు ఉంది. నాగార్జునసాగర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సొంత నియోజకవర్గం కూడా. తెలంగాణా ఉద్యమకాలం నుంచి కూడా చంద్రశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉంది. ప్రస్తుతం టీఆర్ఎస్ లో క్రియాశీలకంగానే ఉన్న కంచర్ల 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.
సాగర్ ఉప ఎన్నికల్లో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరు అనూహ్యంగా తెరపైకి రావడం వెనుక బలీయమైన కారణాలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీ ఇమేజికి, సినీ గ్లామర్ కూడా తోడవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు సౌమ్యునిగా, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకునిగా ప్రాచుర్యం పొందిన కంచర్లను అభ్యర్థిగా బరిలోకి దింపితే జనసేన సహా చిరంజీవి అభిమానుల మద్ధతు లభిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి సాగర్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఖరారు కోసం సీఎం కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి ఖరారుకాగా, బీజేపీ ఎవరికి టికెట్ ఇస్తుందనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ టికెట్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ లేదా శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి దక్కవచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి.
అయితే బీజేపీ ఏ సామాజికవర్గానికి టికెట్ ఇస్తుందనే అంశాన్ని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బీజేపీ రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే టీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికలో ప్రస్తుత ప్రచారానికి విరుద్ధంగా కేసీఆర్ నిర్ణయం ఉండవచ్చంటున్నారు. ఇదే దశలో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరును కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నారని, అభ్యర్థి ఎంపికలో ఆయన అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశాలను కొట్టిపారేయలేమని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇదే జరిగితే కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరు ఖరారైనా ఆశ్చర్యం లేదంటున్నారు. మొత్తంగా తాజా చర్చల్లో కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పేరు బహుళ ప్రాచుర్యంలోకి రావడం అసలు విశేషం. ఈనెల 29వ తేదీకల్లా సాగర్ ఉప ఎన్నిక అభ్యర్థిని సీఎం కేసీఆర్ ఖరారు చేస్తారని, 30న నేరుగా నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.