సరిగ్గా 26 ఏళ్ల క్రితం… అంటే 1994 ఎన్నికల సందర్భం. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీస్తున్న సమయం. అప్పటి ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలోని 294 స్థానాల్లో 216 సీట్లను టీడీపీ గెల్చుకున్న చారిత్రక నేపథ్యం. కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలకే పరిమితమైన దుస్థితి. టీడీపీకి వీచిన అంతటి ప్రభంజన సమయంలోనూ నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుడొకరు తెలుగుదేశం పార్టీకి ఓ సంచలన సవాల్ విసిరారు. తాను ఎన్నికల్లో ప్రచారం కూడా చేయనని, దమ్ముంటే తనను ఓడించాలని టీడీపీ నాయకత్వానికి సవాల్ చేశారు. ఇప్పటి అనేక మంది నాయకుల్లాగా సవాల్ చేసి ఆయనేమీ జారుకోలేదు. చెప్పిన మాట, చేసిన సవాల్ ప్రకారం ఆయన తన నామినేషన్ దాఖలు చేసి ఇంట్లోనే కూర్చున్నారు. కనీసం గడపదాటి బయటకు రాలేదు. చివరికి పోల్ చీటీలు కూడా పంచలేదు. ఏం జరిగిందో తెలుసా…? ఓట్ల వివరాలు అందుబాటులో లేవుగాని, అత్యంత స్వల్ప ఓట్ల తేడాతోనే టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ చేతిలో ఆ కాంగ్రెస్ నేత ఓటమి చెందారు. అప్పటి ఎన్నికల్లో ఆయా విధంగా సవాల్ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరెవరో కాదు. కుందూరు జానారెడ్డి. ఈ సంచలన ‘సీన్’ చోటుచేసుకుంది అప్పటి చలకుర్తి, ఇప్పటి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో. అప్పటి ఆ ఎన్నికల్లో జానారెడ్డి నామినేషన్ దాఖలు అనంతరం కనీసం ఒక్కసారి బయట ప్రజలకు కనిపించినా గెలిచేవారనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ఆ నియోజకవర్గ ప్రజల్లో గల ‘పట్టు’కు ఈ ఘటన ఓ ప్రబల నిదర్శనం.
కాంగ్రెస్ రాజకీయాల్లోనే కాదు, తెలుగు రాజకీయాల్లోనూ జానారెడ్డిది విలక్షణ శైలి. కాంగ్రెస్ పార్టీలోకి రాక ముందు జానారెడ్డి 1983 ఎన్నికల్లో, 1985 మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు. చలకుర్తి నియోజకవర్గం ఏర్పడిన 1962 నుంచి ఇప్పటి వరకు 12సార్లు ఎన్నికలు జరగగా, అందులో ఏడుసార్లు జానారెడ్డి గెలుపొందారు. చలకుర్తి నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ‘నాగార్జునసాగర్’గా పేరు మారిందే తప్ప, నియోజకవర్గ స్వరూపంలో పెద్దగా వచ్చిన మార్పులేమీ లేవు. ఆ తర్వాత 2009, 2014లోనూ జరిగిన ఎన్నికల్లో జానారెడ్డి వరుస విజయాలు సాధించారు. గత ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్యపై ఓటమి చెందారు. ఇప్పుడీ ప్రస్తావనంతా దేనికంటే… తెలంగాణా రాజకీయాలు తాజాగా నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వైపు మళ్లాయి.
‘సాగర్’ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నోముల నర్సింహయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. కొద్దిరోజుల్లోనే నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై ప్రధాన రాజకీయ పక్షాలు దృష్టి సారించాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణికి టికెట్ ఇచ్చినప్పటికీ అధికార పార్టీ చేదు ఫలితాన్ని చవి చూసింది. ఆ తర్వాత తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఈ పరిస్థితుల్లో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక విషయంలో దుబ్బాకకు భిన్నంగా వ్యవహరించవచ్చనే వాదన వినిపిస్తోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనంలో మాత్రమే నోముల నర్సింహయ్య విజయం సాధించారని, వాస్తవానికి నాగార్జునసాగర్ నియోజకవర్గం ‘రెడ్డి’ సామాజికవర్గం ప్రాబల్యాన్ని కలిగి ఉందనే విశ్లేషణలు కూడా అనేకం ఉన్నాయి. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల పరిణామాల్లో అధికార పార్టీకి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు అనివార్యంగా భావిస్తున్నారు. అందువల్లే అధికార పార్టీ కాంగ్రెస్ నేత జానారెడ్డివైపు చూస్తోందనే ప్రచారం జరుగుతోంది.
ఇదే దశలో బీజేపీ కూడా నాగార్జునసాగర్ విషయంలో జాగ్రత్తగా పావులు కదుపుతోంది. కేడర్ పరంగా ‘సాగర్’లో బీజేపీకి పెద్దగా పట్టు లేకపోయినా, జానారెడ్డి వంటి నాయకున్ని తమ పార్టీవైపు ఆకర్షించడం ద్వారా, ఆయనకు నియోజకవర్గంలో గల పట్టు ద్వారా అక్కడా గెలుపొంది తన విజయ ప్రస్థానాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో కాషాయ పార్టీ నేతలు ఉన్నట్లు సమాచారం. ఓవైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ నాయకత్వాలు జానారెడ్డిని తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ అప్రమత్తం కావడం గమనార్హం. అయితే తనను ఏ పార్టీ సంప్రదించలేదని, తన స్థాయి వ్యక్తిపై ఇటువంటి ప్రచారం చేయడం తగదని జానారెడ్డి అంటున్నారు. సాగర్ లో ఎవరు పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుందని జానారెడ్డి నిన్న వ్యాఖ్యానించారు. మొత్తంగా చెప్పొచ్చేదేమిటంటే… నాగార్జునసాగర్ లో గట్టి రాజకీయ పట్టుగల జానారెడ్డి ద్వారా మాత్రమే ఉప ఎన్నికల విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఉవ్విళ్లూరుతున్నట్లు స్పష్టమవుతోంది. అదీ అసలు సంగతి.