తెలంగాణా సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితునిగా ప్రాచుర్యం పొందిన మైం హోం రామేశ్వర్ రావు రాజ్యసభకు వెళ్లనున్నారా? బీజేపీ తరపున ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైందనే సమాచారం తాజాగా అందుతోంది. ఇదేగనుక జరిగితే తెలంగాణా రాజకీయాల్లో పెనుమార్పులకు అస్కారం కలిగించే భారీ కుదుపుగా పరిశీకులు భావిస్తున్నారు. మైహోం వ్యాపార సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్ రావు సీఎం కేసీఆర్ కు మధ్య బలీయమైన స్నేహబంధం ఉండడమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. మైహోం గ్రూపు సంస్థలకు చెందిన 10 టీవీ న్యూస్ ఛానల్ ఇటీవలి కాలంలో ‘కాషాయ’ రంగును పులుముకున్న ఛాయలు కనిపిస్తున్నాయని మీడియా వర్గాలు కూడా విశ్లేషిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల అనంతరం 10 టీవీ న్యూస్ ఛానల్ బీజేపీ అనుకూల వార్త కథనాలను ఎక్కువగా ప్రసారం చేస్తోందనే వాదన వినిపిస్తుండడం ఈ సందర్భంగా గమనార్హం.
చినజీయర్ స్వామి ఆధ్యాత్మిక వ్యవస్థకు సంబంధించిన సంస్థలకు గల నలుగురు ‘మెయిన్ ట్రస్టీ’ల్లో మైహోం రామేశ్వర్ రావు కూడా ఒకరు. టీఆర్ఎస్ పార్టీకి ఆయన ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మైహోం రామేశ్వర్ రావుపై పలు ఆరోపణలు చేస్తూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు. నిరుడు జూలైలో మైహోం సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు కూడా జరిగిన సంగతి తెలిసిందే. మైహోం సంస్థలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కూడా పలు ఆరోపణలు చేశారు. రిజర్వు ఫారెస్ట్ లో మైహోం మైన్స్ కంపెనీ అక్రమ మైనింగ్ చేస్తోందని గత అక్టోబర్ 7వ తేదీన ఎంపీ అర్విద్ మీడియా సమావేశంలో ఆరోపించారు. దాదాపు పదేళ్లుగా నల్లగొండ జిల్లాలో జరుగుతున్న ఈ అక్రమ మైనింగ్ పై సీబీఐ విచారణ జరపాలని కూడా అర్వింద్ డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో మైహోం రామేశ్వర్ రావు బీజేపీకి చేరువయ్యారనే సారాంశంతో రెండు నెలల క్రితం వార్తలు కూడా వచ్చాయి.
ఇంకోవైపు చినజీయర్ స్వామి కూడా ఇటీవలి కాలంలో కేసీఆర్ వ్యవహార తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా భద్రాచలం ట్రస్ట్ బోర్డు చైర్మెన్ గా చినజీయర్ స్వామి సూచించిన ఓ వ్యక్తి విషయంలో సీఎం కేసీఆర్ సానుకూలం నిర్ణయం తీసుకోకపోవడం, భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు రూ. 100 కోట్ల కేటాయించకపోవడం వంటి అనేక అంశాలపై చినజీయర్ స్వామి అలక వహించారనే వార్తలు వస్తున్నాయి. భద్రాచలం ట్రస్ బోర్డ్ చైర్మెన్ పదవికి చినజీయర్ స్వామి సూచించినట్లు పేర్కొంటున్న ఆయా వ్యక్తి తాజాగా బీజేపీలో చేరడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే చినజీయర్ స్వామి సంస్థలకు గల నలుగురు ‘మెయిన్ ట్రస్టీ’ల్లో ఒకరైన మైహోం రామేశ్వర్ రావుకు బీజేపీతో నేతల ఫోల్డ్ లోకి వెళ్లారంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు, అంతకు ముందు జరిగిన అనేక ఐటీ దాడుల వంటి పరిణామాల పరంపరలో మైహోం రామేశ్వర్ రావు బీజేపీకి చెందిన కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకున్నారని, ఆయన నేరుగా పార్టీలో చేరుతారని కూడా వార్తలు వచ్చాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మైహోం రామేశ్వర్ రావును రాజ్యసభకు పంపేందుకు బీజేపీ కీలక నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వారం రోజుల క్రితమే రామేశ్వర్ రావుకు రాజ్యసభ బెర్త్ ఖరారైందని, ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఆయనకు ఈ ఛాన్స్ దక్కవచ్చంటున్నారు. మొత్తం పరిణామాల్లో చినజీయర్ స్వామి ప్రభావం తీవ్రంగా ఉందనే ప్రచారం జరుగుతుండడం విశేషం.