కేవలం పది నిమిషాల వ్యవధిలో జరిగినట్లు భావిస్తున్న ఓ హత్యోదంతంలో కరీంనగర్ పోలీసులు నగదు బహుమతిని ప్రకటించారు. ఇందుకు సంబంధించి కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటన జారీ చేశారు. ఆయన కథనం ప్రకారం ఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.
ఆదివారం తెల్లవారుజామున 04:50 నుండి 05 గంటల మధ్య కేవలం 10 నిమిషాల వ్యవధిలో కరీంనగర్ లోని ఆటోనగర్ వద్ద ఓ హత్య జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి అనుమానితులను వీడియోల ద్వారా గుర్తించి సమాచారం అందించిన వారికి పోలీస్ శాఖ నగదు పారితోషికం ప్రకటించింది.
జీవనోపాధికోసం తిమ్మాపూర్ మండలం పచ్చునూరు సమీప గ్రామానికి చెందిన ఇరుకుల్ల నర్సయ్య ( 42) గత కొంతకాలంగా కరీంనగర్లో నివసిస్తున్నాడు. అతడికి ఉన్న ట్రాక్టర్ ద్వారా ఇసుక రవాణా చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. నర్సయ్య కడుబీద కుటుంబానికి చెందిన వాడు కావడంతో ట్రాక్టర్ నడపడంతో పాటు ఇసుకను కూడా లోడ్ చేస్తూ ఎక్కువ డబ్బుల కోసం పని చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే ఆదివారం తెల్లవారుజాము 04:50 నుండి 05.00 గంటల మధ్య కేవలం 10 నిమిషాల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులు వచ్చి అతడిని హత్య చేసినట్లు సీసీ కెమెరాల్లోని ఫుటేజీల ద్వారా తెలుస్తున్నది. ఇసుక లోడ్ చేసేందుకు నర్సయ్య ఒక్కడే వచ్చాడా? లేదా ఇంకో ఏ వ్యక్తి ఎవరినైనా తోడు తీసుకొని వచ్చాడా? అనేది తేలాల్సి ఉంది. సంఘటనా స్థలంలో రెండు ఇసుకను తీసే పారలు ఉన్నాయి. దీన్నిబట్టి వెంట మరో వ్యక్తి వచ్చి ఉంటాడనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
వీడియో ఫుటేజీల్లో ముగ్గురు వ్యక్తులు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వీడియోలోని వ్యక్తుల పై ఎలాంటి సమాచారం ఉన్నా 9440795111, 440795121, 9440795104, 9440795153, 94409 00973 నెంబర్లకు అందించవచ్చని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి కోరారు. సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచడంతో పాటు వారికి నగదు పారితోషికాన్ని అందిస్తామని కూడా ఆయన చెప్పారు.