ఖమ్మం నగర ప్రజలను మున్నేరు నది మళ్లీ భయపెడుతోంది. దీంతో అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది. వరద ముంపు మరోసారి ముంచెత్తే అవకాశం ఉందనే అంచనాతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం త్రీ టౌన్ ఏరియాలో ఈ ఉదయం మున్నేరు ప్రవాహం 15.75 ఫీట్లు కాగా, 16.00 ఫీట్లకు మొదటి ప్రమాద హెచ్చరిక, 24.00 ఫీట్లకు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ప్రస్తుతం వరద తీవ్రత కొనసాగుతోంది.
ఎగువన గల మహబూబాబాద్ జిల్లాలోనేగాక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో మున్నేరు వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మం శివారు ధంసలాపురం న్యూ కాలనీలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ స్వంగా ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రానికి తరలించారు.
భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నుంచి ఈ ఉదయం హుటాహుటిన ఖమ్మం బయలుదేరారు. ఐదు రోజుల జిల్లా పర్యటనను ముగించుకుని శుక్రవారం సాయంత్రమే హైదరాబాద్ వెళ్లిన మంత్రి పొంగులేటి శనివారం సాయంత్రం నుంచి మళ్ళీ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఖమ్మం బయలు దేరారు. మున్నేరుకు ముంపు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన తరుణంలో ఆయన ఖమ్మం వస్తున్నారు. జిల్లా కలెక్టర్ , సీపీ సహా పాలేరు నియోజక వర్గంలోని ఆయా మండలాల అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అవసరం అయితే అర్థరాత్రి కూడా పరిస్థితి పై సమీక్ష ఉంటుందని కావున అధికారులందరూ అలర్ట్ గా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా మున్నేరు వరద ముంపు బాధితుల కోసం ధంసలాపురం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్ తో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గత రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ముంపు బాధితులకు ప్రభుత్వం చేపడుతున్న పునరావాస చర్యలపై ఆరా తీశారు. ముఖ్యంగా ముంపు బాధితులకి సమయానికి ఆహారం, అనారోగ్యం ఏర్పడితే అందిస్తున్న వైద్య సేవల గురించి బాధితులతో మాట్లాడారు. ఈ సమయంలో బాధితులు మాట్లాడుతూ, తమకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారాలపై డిప్యూటీ సీఎంకి వివరించారు.
మున్నేరు ప్రవాహంపై మంత్రి తుమ్మల కూడా స్పందించారు. మహబూబాబాద్, గార్ల, బయ్యారం తదితర మండలాల్లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం మున్నేరు పరివాహక ప్రాంతాల్లోనే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న సాయంత్రం జిల్లా కలెక్టర్ ముజిమిల్ ఖాన్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలను ఆదేశించారు.