తెలంగాణాలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీతో పొత్తు దిశగా వామపక్ష పార్టీలు పయనిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ తో పొత్తుకు సీపీఐ జిల్లా కార్యవర్గం ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుండగా, సీపీఎం మాత్రం భిన్నాభిప్రాయాల వద్దే తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు సహా మరికొన్ని మున్సిపాల్టీలకు జరిగే ఎన్నికలకు సంబంధించి కొద్దిరోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో ఈ అంశం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఖమ్మం నగర పాలక సంస్థలో గతంలో 50 డివిజన్లు ఉండగా, పునర్విభజన అనంతరం ఈ సంఖ్య 60కి పెరిగింది. డీలిమిటేషన్ అనంతరం అదనంగా పెరిగిన 10 డివిజన్ల సంఖ్య వరకు మాత్రమే వామపక్షాలకు కేటాయించాలని టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆరు సీపీఎంకు, నాలుగు సీపీఐ పార్టీలకు కేటాయించాలని అధికార పార్టీ ముఖ్యులు నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారపు సారాంశం. ఇదే దశలో తమ బలం ప్రాతిపదికగా డివిజన్లు కేటాయించాలని వామపక్ష పార్టీలు ఆశిస్తున్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీతో పొత్తు గురించి సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు ts29తో మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు అంశం స్థానిక కమిటీల అభిప్రాయం మేరకు జరుగుతుందన్నారు. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, తమ పార్టీ సమావేశాల్లో విషయాన్ని చర్చిస్తున్నట్లు చెప్పారు. స్థానిక కమిటీల అభిప్రాయం మేరకు నిర్ణయం ఉండే అవకాశం ఉందన్నారు. అయితే స్థానిక ఎన్నికల్లో ఉభయ వామపక్షాలు కలిసి నడవాలన్నది తమ అభిమతమని, కానీ ఈ విషయంలో సీపీఐ విషయాన్ని దాటవేస్తోందని నున్నా నాగేశ్వర్ రావు అన్నారు.
కాగా సీపీఐ రాష్ట్ర నాయకుడు భాగం హేమంతరావు మాట్లాడుతూ, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో తమకు పొత్తు ఉంటుందని చెప్పారు. తమ పార్టీ జిల్లా కార్యవర్గంలో ఈమేరకు నిర్ణయం కూడా తీసుకున్నట్లు చెప్పారు. తాము ఏడు డివిజన్లను కోరుతున్నామని, చర్చల అనంతరం సీట్ల కేటాయింపు కొలిక్కి వచ్చే అవకాశాలున్నట్లు చెప్పారు. మొత్తంగా ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు అధికార పార్టీతో పొత్తుకు కుదుర్చుకునే దిశగానే అడుగులు పడుతున్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.