తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన పట్టణాల్లో ఎన్నికల్లో చైర్మెన్, వైస్ చైర్మెన్ల ఎంపికపై అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్, మున్సిపాల్టీల్లో చైర్మన్, వైస్ చైర్మెన్ ఎంపికకు సంబంధించి ‘సీల్డ్’ కవర్ ప్రయోగం చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయా పదవులకు అర్హులుగా భావించినవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారు.
ప్రక్రియలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అర్హులైన వారి జాబితాను సీం కేసీఆర్ కు అందజేస్తారు. కేసీఆర్ ఆమోద ముద్ర వేశాక, ఎంపిక చేసినవారి పేర్లను సీల్డ్ కవర్లలో మున్సిపాలిటీల పరిధి గల స్థానిక ఎమ్మెల్యేలకు పంపిస్తారు. ఈనెల 27 జరిగే ఎన్నికకు గంట ముందు సీల్డ్ కవర్లలో వచ్చిన పేర్లను సంబంధిత కార్పొరేటర్ల, కౌన్సిలర్ల ముందు ఎమ్మెల్యేలు బహిర్గతం చేస్తారు. అధిష్టానం నుంచి వచ్చిన సీల్డ్ కవర్లలోని పేర్లు గల వారిని చైర్మెన్, వైస్ చైర్మెన్ పదవులకు పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మిగతా సభ్యులు ఎన్నుకోవలసి ఉంటుంది.
అయితే ఇందులో అసలు విశేషమేంటంటే ‘సీల్డ్’ కవర్ ప్రక్రియ ఓ లాంఛనప్రాయం మాత్రమేనని తాజా సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం… చైర్మెన్, వైస్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానిక ఎమ్మెల్యేల సిఫారసులనే పార్టీ ప్రామాణికంగా తీసుకున్నట్లు తెలిసింది. ఆయా పదవుల్లో కౌన్సిలర్ల ఎంపికకు సంబంధించి పార్టీ పరంగా ఎమ్మెల్యేలకు స్థానికంగా అసమ్మతి సెగ తగలకుండా, తిరుగుబాటు దృశ్యాలు చోటు చేసుకోకుండా ఉండేందుకే సీల్డ్ కవర్ ప్రక్రియను తెరపైకి తీసుకువచ్చినట్లు తెలిసింది. ఎంపిక ప్రక్రియను అధిష్టానం భుజస్కంధాలపై వేసుకోవడం ఇందులో భాగమేనట. స్థానిక ఎమ్మెల్యేలను ఈమేరకు అభిప్రాయం కోరడం, ఫలానా వారు చైర్మన్, వైస్ చైర్మెన్లుగా ఉంటే బాగుంటుందని వారు పేర్లను పార్టీ అధిష్టానానికి నివేదించడం కూడా జరిగిపోయిందట. ఆయా పేర్లను పార్టీ రేపు ఉదయం 10 గంటలకల్లా బహిర్గతం చేయడం కేవలం లాంఛనమేనట. అదీ సీల్డ్ కవర్ ప్రక్రియలోని అసలు రహస్యం. అయితే… కౌన్ బనేగా…బల్దియా చైర్మెన్.. అంటారా? టిక్…టిక్…టిక్… గంట గంటకూ ఉత్కంఠ.. సోమవారం ఉదయం 10 గంటల వరకు మాత్రమే.