ములుగు జిల్లా పరిషత్ చైర్మెన్ కుసుమ జగదీష్ అలియాస్ జేడీ పేరున సోషల్ మీడియాలో తిరుగుతున్న పోస్ట్ ఇది. ముందు దీన్ని చదవండి. తర్వాత అసలు విషయంలోకి వెడదాం.
గులాబీ శ్రేణులకు మీ కుసుమ జగదీశ్ విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులకు నమస్కారాలు.
గులాబీ కార్యకర్తలు, క్రమశిక్షణకు, మంచితనానికి,
మానవత్వనికి, మారు పేరుగా కేసీఆర్ గారి అడుగులో అడుగు వేస్తూ అన్ని కష్ట నష్టాలను ఓర్చు కొని తెలంగాణ సాదించుకొని బంగారు తెలంగాణ రాష్ట్ర సాధనలో మంచి సైనికులుగా ముందు సాగుతున్నాం.
కరోన సమయంలో కూడా ప్రజల మధ్యలో ఉంటు సాధ్యమైనంత వరకు ప్రజల కష్టాల్లో బాగ్యాస్వాము అవుతున్న. ఈ తరుణంలో మీరు నాకు అందిస్తున్న సహకారం గొప్పది. ఇదే ప్రణాళికలతో ముందుకు సాగుదాం మనవి చేస్తున్న..
ఈయొక్క కరోన కష్టకాలంలో ఇతర వ్యక్తులను కానీ రాజకీయ పార్టీలను కానీ వారు చేసే ఏ విధమైన కార్యక్రమల గురించి మనం సోషల్ మీడియాలో కానీ బహిరంగంగా కానీ తప్పుడు ప్రచారాలు చెయ్యొద్దు అని మనవి చేస్తున్న..
క్రమశిక్షణ గల కేసీఆర్ సైన్యంగా మనం ముందుకు సాగుదాం.
దయచేసి నాకు,పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా ప్రవర్తించొద్దు అని గులాబీ కార్యకర్తలకు పేరు పేరు నా విజ్ఞప్తి చేస్తున్న …
మీ
కుసుమ జగదీశ్ (జేడీ)
ములుగు జిల్లా పరిషత్ చైర్మన్
తెలంగాణ రాష్ట్ర సమితి
ములుగు నియోజకవర్గ ఇంచార్జ్
విషయమేమిటంటే… ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క తెలుసు కదా? కాంగ్రెస్ పార్టీ తరపున గత ఎన్నికల్లో విజయం సాధించిన సీతక్క ప్రస్తుతం జాతీయ మీడియాలోనూ వార్తల్లో వ్యక్తిగా మారారు. కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో చెట్టుకొకకరు, పుట్టకొకరుగా అడవుల్లో తిండిలేక అలమటిస్తున్న ఆదివాసీలను సీతక్క అలుపెరుగకుండా ఆదుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాళ్లు, రప్పలు, వాగులు, వంకలు, కొండలు, కోనలు అనే తేడా లేకుండా ‘బాట’కూడా సరిగ్గా లేని మార్గాల్లో కాలినడకనే పయనిస్తున్నారు. ఆదివాసీ గిరిజన గూడేల్లో నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. గడచిన యాభై రోజులుగా ములుగు సెగ్మెంట్లో సీతక్క తిరగని ఆదివాసీ పల్లె లేదందే ఆశ్చర్యం కాదు. ఓ రకంగా చెప్పాలంటే కరోనా లాక్ డౌన్ సేవల్లో సీతక్క కష్టానికి సరితూగే నేతలు ప్రస్తుతానికి లేరంటే అతిశయోక్తి కూడా కాదు.
ఈ నేపథ్యంలోనే మన తెలుగు మీడియాకు చెందిన ప్రముఖ సంస్థలే కాదు జాతీయ స్థాయిలోనూ ప్రసార మాధ్యమాలు సీతక్క సేవలను ఆకాశానికెత్తుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. సీతక్కకు ఇంతగా పేరు, ప్రఖ్యాతులు రావడాన్ని ములుగు నియోజకవర్గంలో గులాబీ శ్రేణులు జీర్ణించుకుంటున్నట్లు లేదు. అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే కార్యకర్తల సంఖ్య ఎక్కువ కదా? అందుకే కాబోలు నియంత్రణ లేని విధంగా సీతక్క సేవలపై సోషల్ మీడియాలో గులాబీ కార్యకర్తలు విమర్శల దాడి ప్రారంభించారు. అసలు సీతక్క వెంట ప్రభుత్వ అధికారులు వెళ్ళడమేంటి? వారికేం సంబంధం? అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో విమర్శలకు దిగారు. అంతేకాదు సీతక్క సేవల ఫొటోలపైనా ‘ట్రోలింగ్’కు దిగారు.
ఆయా పరిణామాలపై కాంగ్రెస్ శ్రేణులు ‘రివర్స్ అటాక్’ ప్రారంభించాయి. ‘మీకు చేతనైతే సాయం చేయండి. లేదంటే గమ్మున ఉండండి. అంతేగాని మీ రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం సంస్కారం కాదు’ అంటూ కాంగ్రెస్ కేడర్ అదే స్థాయిలో సోషల్ మీడియాలో యుద్ధాన్ని తీవ్రతరం చేసింది. దీంతో పరిస్థితి మరో రకమైన పరిణామాలకు దారి తీస్తోందని గులాబీ పార్టీ నేతలు గ్రహించినట్లున్నారు. అందుకే కాబోలు నష్టనివారణ చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే ‘మనం తప్పుడు ప్రచారాలు చేయొద్దు’ అంటూ పార్టీ కేడర్ కు హతబోధ చేస్తున్నారు. సీతక్కపై విమర్శలు తప్పుడు ప్రచారంగానే పరోక్షంగా ‘అడ్మిట్’ అవుతున్నట్లే కనిపిస్తోంది. ములుగు జెడ్పీ చైర్మెన్ జగదీష్ తాజా ప్రకటనలోని సారాంశం దాదాపు ఇదే. కాకపోతే ప్రకటనలో ఎక్కడా సీతక్క పేరును ప్రస్తావించలేదు. కానీ అందులోని ఆంతర్యం బోధపడినట్లే కదా! అర్థం కాకుంటే జగదీష్ ప్రకటనను మళ్లీ ఓసారి చదవండి.
ఇదీ చదవండి: అడవిలో ‘మాజీ’ అక్క… భళా… ఎమ్మెల్యే సీతక్క!