కొత్త రెవెన్యూ చట్టంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. అసెంబ్లీలో రెవెన్యూ చట్టంపై రైతుల పక్షాన తనకు మాట్లాడే అవకాశం కల్పించకపోవడం బాధ కలిగించిందన్నారు. ఈ సందర్భంగా తాను కొన్ని కొన్ని ప్రశ్నలు మీతో పంచుకుంటున్నానని ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాదు ఇదే అంశంపై తన ఫేస్ బుక్ పేజీలో దాదాపు 10 నిమిషాల నిడివిగల వీడియోను కూడా విడుదల చేశారు. కొత్త రెవెన్యూ చట్టంపై ఎమ్మెల్యే సీతక్క కేసీఆర్ ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నల్లో ఏమంటున్నారో దిగువన ఆమె మాటల్లోనే చదవండి.
– వీఆర్వోలు అవినీతిపరులైనప్పుడు వారు గుర్తించిన 57 లక్షల మంది రైతులకు మీరు రైతుబంధు ఇస్తున్నారు, అయితే దాంట్లో ఎంతమంది నిజమైన రైతులు? రైతులు కానీ వాళ్లకు కూడా రైతుబంధు లభిస్తుంది కదా? గొప్పలు ముఖ్యమంత్రికి అవినీతి ఉద్యోగులకు..!
– సెక్షన్ 5 ప్రకారం రైతులు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేస్తారు? మరలా మధ్యవర్తులు ఏర్పడతారు కదా? వాళ్లు అవినీతి చేయరా?
– ఎమ్మార్వో గాని, అధికారపక్షంలో ఉండే నాయకులుగాని రైతులను బెదిరించరా… తమ స్వార్థం కోసం భూమి వేరే పేరు మీద ఎక్కి ఇస్తామని? ఒకవేళ ఎక్కిస్తే సెక్షన్ 9 ప్రకారం రైతుల కోర్టుకు పోయే అధికారం కూడా లేదు కదా…?
– ఆన్లైన్ మీద పని చేసేది కూడా మనుషులే దేవుడు కాదు….
ఇదే టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి భూ ప్రక్షాళన చట్టం వచ్చినప్పుడు అద్భుతం, మహా అద్భుతం అన్నారు. దానికి నిదర్శనమే ఇవాళ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ భారత దేశంలోనే మొదటి స్థానంలో ఉంది అవినీతిలో….
– అవును వీఆర్వోల్లో కొందరు అవినీతి పరులు ఉన్నారు. వాళ్లను శిక్షించరా? వేరే డిపార్ట్మెంట్ లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ అవినీతి చేయరని గ్యారెంటీ ఏంటి?