కరోనా వైద్య విధులకు వెడుతున్న వైద్యురాలిపై ఓ పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్లో బాధితురాలి ఫిర్యాదు. అనంతరం అనేక నాటకీయ పరిణామాలు. సదరు పోలీసు అధికారి తనకు క్షమాపణ చెప్పారని, ఫిర్యాదును వెనక్కి తీసుకున్నామని బాధిత వైద్యురాలి వెల్లడి. ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసు ఉన్నతాధికారులు సదరు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్న ఉదంతం కొద్ది రోజుల క్రితం ఖమ్మం నగరంలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.
రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం కలిగించిన ఈ సంఘటనను మరువకముందే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన మరో ఉదంతంలో ఏకంగా ఆసుపత్రిపైనే దాడి. గుండెపోటుతో కరోనా అనుమానిత రోగి మరణించిన ఘటనలో డాక్టర్ ను లక్ష్యంగా చేసుకుని సినీ ఫక్కీలో దాడి. ఆసుపత్రి ఫర్నీచర్ ను, అద్దాలను కరోనా అనుమానిత మృతుడి బంధువులు ధ్వంసం చేశారు.
ఈ రెండు ఘటనలపై తెలంగాణా ప్రజలు, కరోనా రోగులకు వైద్యం అందిస్తున్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లోనే మరో ఉదంతం. రాజధాని నగరంలోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి మృతి చెందడంతో, అదే వార్డులో చికిత్స తీసుకుంటున్న మృతుని సోదరునితోపాటు కరోనా వైరస్ సోకిన అతని కుటుంబ సభ్యులైన రోగులు వైద్యులపై, నర్సులపై విచక్షణారహితంగా దాడికి దిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ప్రాణభయంతో డాక్టర్లతోపాటు నర్సులు పరులంకించుకున్నారు.
ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. దాడికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి ఘటనలను సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి సైతం ప్రకటించారు.
కానీ ఇటువంటి వరుస సంఘటనలు వైద్య వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కుటుంబ సభ్యులను వదిలి, ప్రజల ప్రాణ రక్షణే ప్రధానంగా, ప్రాణాలకు తెగించి వైద్య సేవలందిస్తున్న తమకే రక్షణ లేకపోతే ఎలా? అని వైద్య వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మన వైద్యులను కాపాడుకోవలసిన అవసరముందని, బయట నుంచి డాక్టర్లెవరూ రారని సీఎం కేసీఆర్ గతనెల 24న మీడియా సమావేశంలో స్పష్టంగా ప్రకటించారు. ముప్పు ఉన్నా ముందుండి పనిచేస్తున్న డాక్టర్ల, ఇతర వైద్య సిబ్బంది గురించి ఆలోచించాలని, ఇతరుల ప్రాణరక్షణ కోసం పనిచేస్తున్న వైద్యుల కోసంప్రార్థించాలని దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి నుంచి ఒక్కో జీవితాన్ని కాపాడడానికి రేయింబవళ్లు ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బందిపై దాడులు జరిగితే ఉపేక్షించవద్దని కూడా ప్రధాని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.
కానీ తెలంగాణాలో వైద్యులపై దాడి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజల ప్రాణాలను కరోనా మహమ్మారి పొట్టను పెట్టుకోకుండా ఉండాలంటే, ముందు వైద్యులను దాడుల నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది. నిందితులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకోవలసి ఉంది. ఇందులో ఎటువంటి శషభిషలకు తావు కల్పించరాదని, ప్రస్తుత కరోనా ప్రమాదకర పరిస్థితుల్లో, ఇటువంటి దాడుల అంశంలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు పాలకులు తలొగ్గరాదన్నదే మెజారిటీ ప్రజల అభిప్రాయం.