బెదిరింపులతో బీఆర్ఎస్ నాయకులను అధికార పార్టీ లీడర్లు లొంగదీసుకోలేరని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, చింతకాని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యపై అక్రమంగా కేసు పెట్టి, అరెస్టు చేయడం ద్వారా అధికార పార్టీ నేతలు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని రవిచంద్ర ఆరోపించారు. ఇలాంటి బెదిరింపు చర్యలతో బీఆర్ఎస్ నేతలను, కార్యకర్తలను లొంగదీసుకోలేరని ఆయన పేర్కొన్నారు. పుల్లయ్యను అన్యాయంగా అరెస్టు చేసి, జైల్లో నిర్బంధించారని, ఈ చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంపీ రవిచంద్ర అన్నారు.
పుల్లయ్య అరెస్టు రాజకీయ ప్రేరేపిత చర్యగా స్పష్టం అవుతోందని, ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలను, న్యాయ వ్యవస్థను దెబ్బతీసేందుకు దోహదపడతాయని, ప్రజాస్వామ్య వ్యవస్థలో వీటిని ప్రజలు ఏ మాత్రం హర్షించరని రవిచంద్ర అన్నారు. అరెస్టు సందర్భంగా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వైరా పోలీసు అధికారులపై చట్టపరంగా చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పుల్లయ్య అరెస్టును తట్టుకోలేక ఆయన భార్య గుండెపోటుతో కుప్ప కూలినా, అధికార పార్టీ నేతలు మానవతా విలువలను మరిచారని విమర్శించారు. ప్రజల మద్దతుతో ఇలాంటి చర్యలకు గుణపాఠం చెబుతామన్నారు. పుల్లయ్య పై పెట్టిన తప్పుడు కేసు ఉపసంహరించుకుని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కోరారు.