బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పదవులు ఇచ్చిన లీడర్లలో చాలా మంది ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?
కేసీఆర్ కళ్లప్పగించి చూస్తుండగానే తాను ఏరికోరి పదవులు కట్టబెట్టినవారిలో చాలా మంది పార్టీ కండువాలు మార్చేస్తున్నారు.
ఈ అంశంలో వాళ్లూ, వీళ్లూ అనే తేడా ఏమీ లేదు. రాజ్యసభ సభ్యుల నుంచి ఎంపీల వరకు, ఎమ్మెల్యేల నుంచి ఎంపీటీసీల వరకు… అనేక మంది బడా, ఛోటా లీడర్లు గులాబీ కండువాలను విసిరేసి కాంగ్రెస్, బీజేపీ కండువాలను మెడలో వేసుకుంటున్నారు.
ఇంకొందరైతే తమ వారసులకు ఎంపీ టికెట్లు ఇచ్చినా సరే.. ఎహె పో.. నీ టికెట్టు ఎవడికి కావాలంటూ రాజీనామా కాగితాన్ని విసిరేసి మరీ పక్క పార్టీ టికెట్లతో ఎన్నికల గోదాలోకి దిగారు.
ఇవన్నీ కళ్ల ముందు చూస్తున్న ఘటనలే కదా..? అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ కు ఇంకా వినయ, విధేయతతో కూడుకున్న లీడర్లు కొందరు పార్టీలో మిగిలే ఉన్నారు.
ఇలా మిగిలినవారిలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తాజా రాజకీయ అడుగులు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. పార్టీలో దశాబ్ధకాలంపాటు పదవులు అనుభవించిన నాయకుల తీరుకు విరుద్ధంగా వద్దిరాజు వ్యవహరిస్తుండడమే ఇందుకు కారణం.
వద్దిరాజు రవిచంద్ర వ్యవహారశైలి పొలిటికల్ సర్కిళ్లలో తీవ్ర చర్చకు దారి తీయడానికి గల అసలు కారణాల్లోకి వెడితే.. ఖమ్మం పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వర్ రావు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో, ముఖ్యంగా కాంగ్రెస్ అడ్డాగా మొన్నటి ఎన్నికల్లో మరోసారి రుజువైన ఖమ్మం గడ్డపై నామ నాగేశ్వర్ రావు ఈసారి ఇష్టపూర్వకంగానే బరిలోకి దిగారా? లేదా? అనే అంశంపై పార్టీ వర్గాల్లో భిన్న చర్చ జరుగుతోంది. పార్టీ చీఫ్ కేసీఆర్ ఆదేశాన్ని తిరస్కరించలేక మాత్రమే ఈసారి నామ అనివార్యంగా ఎన్నికల గోదాలోకి దిగారనే వ్యాఖ్యల నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తానే అభ్యర్థిననే తరహాలో ప్రచార సరళిలో చెమటోడుస్తుండడం గమనార్హం.
ఇటు ఖమ్మం, అటు మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి వద్దిరాజు రవిచంద్ర తీరిక లేకుండా శ్రమిస్తున్న తీరుపై పార్టీ కేడర్ లోనూ భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పదవులు అనుభవించి, గుట్టలుగా కరెన్సీ కట్టలను వెనకేస్తున్నట్లు ప్రాచుర్యంలో గల నాయకులు కొందరు నామా గెలుపు విషయంలో నామ మాత్రంగా వ్యవహరిస్తున్నారట. కానీ వద్దిరాజు మాత్రం ఇటు ఖమ్మం, అటు మహబూబాబాద్ స్థానాల పరిధిలో పార్టీ అభ్యర్థుల విజయానికి క్షణం తీరిక లేకుండా వ్యూహ రచన చేస్తుండడం విశేషం. తనకు గట్టి పట్టుగల తన సామాజికవర్గమైన మున్నూరు కాపులను పెద్ద ఎత్తున సమీకరించి ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగా నామినేషన్ల గడువుకు ముందే ఖమ్మం పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓ రౌండ్ ప్రచారాన్ని రవిచంద్ర ముగించడం గమనార్హం. ఈ ప్రచారంలో వద్దిరాజు రవిచంద్ర పదే పదే ప్రస్తావిస్తున్న అంశాలను ఓసారి పరిశీలిస్తే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పట్ల ఆయన ప్రదర్శిస్తున్న విధేయత బోధపడుతుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇంతకీ వద్దిరాజు ఏమంటున్నారంటే..
‘రాజకీయాలలో జీరోగా ఉన్న నన్ను మహానేత కేసీఆర్ హీరో స్థాయికి తీసుకెళ్లారు.
దేశంలోనే అత్యున్నత చట్టసభ అయిన పెద్దల సభ రాజ్యసభకు పంపారు.
ఇచ్చిన మాట ప్రకారం రెన్యూవల్ కూడా చేశారు, పార్లమెంట్ ప్రాంగణంలో ఈనెల 4వతేదీన ప్రమాణ స్వీకారం చేశాను.
ఇతర పార్టీల కన్నా కూడా బీసీలకు ఎక్కువ అవకాశాలు,చట్టసభలలో సీట్లు కేటాయించింది బీఆర్ఎస్సే.
రాష్ట్ర జనాభాలో మున్నూరుకాపులం 18% ఉన్నాం.
ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనారిటీలను కలిసికట్టుగా ముందుకు సాగుతూ రాజ్యాధికారం వైపు పయనిద్దాం.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, పార్లమెంటులో తెలంగాణ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడే నామ నాగేశ్వరరావుకు సంపూర్ణ మద్దతునిచ్చి ఘన విజయం చేకూర్చుదాం.
తెలంగాణ ప్రజల గొంతుకను పార్లమెంటులో బలంగా వినిపించిన బీఆర్ఎస్ పక్ష నేత, పార్టీ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు తిరిగి విజయం సాధించడం ఖాయం.
మహానేత కేసీఆర్ నిన్న రాత్రి టీ ఛానెల్ ద్వారా ప్రజలకు గొప్ప సందేశమిచ్చారు.
ఇక కాంగ్రెస్ కౌంట్ డౌన్ ఊపందుకుంది
కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం రెండు పిల్లర్లు కుంగితే నీళ్లను సముద్రం పాల్జేసీ రేవంత్ రెడ్డి కృత్రిమ కరువు తెచ్చారు.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి నెత్తిమీద కుంపటి పెట్టుకున్నామని ప్రజలు బాధపడుతున్నరు.
పాత స్కీంలను అమలు చేయకపోగా, ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ పాలకులు నెరవేర్చడం లేదు.
ఆ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నరు
తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి ఏది సాధించాలన్నా కూడా అది బీఆర్ఎస్ ఎంపీలతోనే అవుతుంది
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిలదీయడం వల్ల బీఆర్ఎస్ ఎంపీలం సభ నుంచి పలుమార్లు సస్పెండ్ కావడం జరిగింది.
ఈ ఎన్నికలలో మనమందరం కలిసికట్టుగా ముందుకు సాగుతూ తిరిగి నామ నాగేశ్వరరావు గెలిపించుకోవడం ద్వారా తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కుల్ని సాధించుకుందాం.’
ఇదీ ఎన్నికల ప్రచారంలో వద్దిరాజు రవిచంద్ర శైలి. ఎవరు కలిసొచ్చినా, రాకున్నా తనదైన శైలిలో పార్టీ విజయం కోసం రవిచంద్ర సాగిస్తున్న ప్రచారాన్ని ఎలా నిలువరించాలనే అంశంపై ప్రత్యర్థి పార్టీల నాయకులు దృష్టి కేంద్రీకరించడం కొసమెరుపు.