రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆది, సోమవారాల్లో ఖమ్మంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనారోగ్యానికి గురైన పలువురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను అందించారు. బుర్హాన్ పురంలోని తన క్యాంపు కార్యాలయంలో బాధితులకు ఈ చెక్కులను అందించారు.
అదేవిధంగా ఖమ్మం వీడీవోస్ కాలనీలో అయ్యప్ప స్వాముల అన్నప్రసాదం వితరణ కార్యక్రమంలో రవిచంద్ర పాల్గొన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరై అయ్యప్పస్వామికి భక్తి ప్రపత్తులతో హారతి ఇచ్చారు. ఆ తర్వాత అయ్యప్ప స్వాములతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించారు.
సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కుమారుడు భార్గవ్- చిద్విత సాయిల రిసెప్షన్ కు హాజరయ్యారు. ఖమ్మంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్స్ ఫంక్షన్ హాలులో ఆదివారం ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబసభ్యులతో కలిసి హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు తన సతీమణి విజయలక్ష్మీ, పెద్దన్న వద్దిరాజు కిషన్, కుమారుడు నాగరాజులతో కలిసి నూతన వధూవరులు భార్గవ్-చిద్విత సాయిలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానంతరం ఖమ్మం గ్రానైట్ స్లాబ్ ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. నగరంలోని ఏస్ ఆర్ గార్డెన్స్ లో ఆదివారం రాత్రి ఘనంగా జరిగిన కార్యక్రమంలో వద్దిరాజు మాట్లాడుతూ, గ్రానైట్ ఇండస్ట్రీకి ఖమ్మం జిల్లా నెలవు కావడం మనందరికి కూడా గర్వకారణమన్నారు. ఇక్కడ లభించే గ్రానైట్ చాలా నాణ్యతతో కూడుకున్నదని, దీనికి దేశ, విదేశాలలో కూడా మంచి గుర్తింపు ఉందన్నారు.
ఢిల్లీలోని పోలీస్ అకాడమీకి 380 టన్నులు, ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఈ జిల్లాకు చెందిన గ్రానైట్ నే ఉపయోగించిన విషయాన్ని వద్దిరాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది మనకెంతో గర్వ కారణమన్నారు. గ్రానైట్ ఇండస్ట్రీ కారణంగా ఎటువంటి వాతావరణ కాలుష్యం ఉత్పన్నం కాదని, మరిన్ని రాయితీలు కల్పించి దీనిని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉందన్నారు.