జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని లోక్ సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు అన్నారు. దేశంలో24 గంటలపాటు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ గా ఆయన అభివర్ణించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మియాపూర్, జయప్రకాష్ నగర్ కాలనీల్లో 108వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్ గెలుపును కాంక్షింస్తూ నిర్వహించిన సన్నాహక సమావేశంలో నామ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నగరం ప్రథమ స్థానంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ ఆరేండ్లలో హైదరాబాద్ లో 68 వేల కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు. అంతేగాక 24 గంటలు కరెంటుతోపాటు ముఖ్యమంత్రి కేసిఆర్ అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ కార్యక్రమాలు జీహెఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయన్నారు. శాంతి భద్రతల విషయంలో ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తుందన్నారు.
కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు విషయం గురించి పలుమార్లు పార్లమెంటులో ప్రస్తావించటంతో పాటు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిన వాటితో పాటుగా విభజన చట్టంలో పొందుపర్చిన హామీలు నేటి వరకు నేరవేర్చలేదన్నారు. నగరంలోని 108 డివిజన్లో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీకాంత్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నామ నాగేశ్వరరావు కోరారు. హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసిన ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కసి, పట్టుదలతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో అందరం కలిసి, కష్టపడి పని చేద్దామని, మీకు అండగా నేను ఉంటానని, ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా దక్కవని నామ స్పష్టం చేశారు. ఇంకా అభివృద్ధి జరగటానికి రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీ గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ , టీడీపీలకు చెందిన పలువురు నాయకులు ఎంపీ నామ, ఎమ్మెల్యే అరికపూడి గాంధీల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.