దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో అపూర్వ ఘట్టంగా నిలిచిపోతుందని ఆ పార్టీ లోక్ సభా పక్షనేత , ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో నిర్మిస్తున్న తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ గురువారం భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. తెలంగాణ భవన్ భూమిపూజలో సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఎంపీ నామ నాగేశ్వర్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ప్రజల చిరకాల ఆకాంక్షను నేరవేర్చడం కోసం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ఏడేళ్ల పరిపాలనలో ఎన్నో అద్భుతాలను సృష్టించారన్నారు. కేసీఆర్ ప్రారంభించిన పథకాలు యావత్తు దేశాన్ని ఆకర్షిస్తున్నాయని కొనియాడారు. తెలంగాణలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేవనన్నారు. ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి అనేక పథకాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు.

అదేవిధంగా ఎస్సీల జీవితాల్లో ఆర్ధిక వెలుగులు నింపడం కోసం దళిత బంధును అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణ ధాన్యాగారంగా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుంటోందన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఢిల్లీలో తెలంగాణ భవన్ ను నిర్మించబోతుండడం గర్వంగా ఉందన్నారు.

భవిష్యత్తులో తెలంగాణ భవన్ జాతీయ రాజకీయాలకు వేదిక కాబోతున్నదన్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఢిల్లీలో సొంత భవనాన్ని నిర్మిస్తున్న టీఆర్ఎస్ మొదటి పార్టీగా చెప్పారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ భవన్ నిలువబోతుందన్నారు. తెలంగాణ భవన్ శంకుస్థాపన మహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ నామ పేర్కొన్నారు.

Comments are closed.

Exit mobile version