మధుకాన్ కంపెనీ లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్వహిస్తున్నవిచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని లోక్ సభలో టీఆర్ఎస్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. ఈడీ విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. న్యాయవ్యవస్థపై తమకు నమ్మకముందన్నారు. రాజ్యాంగపై విశ్వాసముందన్నారు. కంపెనీకి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈడీ విచారణకు సంబంధించిన అంశాల్లో కంపెనీ, డైరెక్టర్లు, బోర్డు మాత్రమే బాధ్యులవుతారని, తాను కంపెనీకి సంబంధించిన ఏ హోదాలోనూ లేనని చెప్పారు. టీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టినా, తనను ఇబ్బంది పెట్టినా తాను మాత్రం తమ నాయకుడి వెంటే ఉంటానని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కేసీఆర్ వెంటే ఉంటానని నామ నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు. మధుకాన్ సంస్థల ఆఫీసుల్లో, తన నివాసంలో ఈడీ తనిఖీలు జరపడం, ఈనెల 25న విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
ఈడీ విచారణ జరుపుతున్న ప్రాజెక్టుకు సంబంధించిన వ్యవహారంలో నిధులు మళ్లించే అవకాశమే లేదన్నారు. బిల్లుల ప్రకారమే ముగ్గురు కన్సల్టెంట్లు పరిశీలించి ఆమోదిస్తే తప్ప నిధులను బ్యాంకు మంజూరు చేయదని, కాంట్రాక్టుకు సంబంధించిన ఆస్తి తమది కాదని, అది నేషనల్ హైవేదిగా చెప్పారు. తమ డబ్బు, నేషనల్ హైవే డబ్బు కూడా బ్యాంకులోనే ఉంటుందని, ‘ఎస్క్రో’ అకౌంట్ ద్వారా మాత్రమే కాంట్రాక్టుకు సంబంధించిన పనుల నిర్వహణ జరుగుతుందన్నారు. రెండు దశాబ్ధాలుగా ప్రజా జీవితంలో ఉండడం వల్ల 40 ఏళ్ల క్రితం స్థాపించిన మధుకాన్ సంస్థను తన తర్వాత తరమైన సోదరులకు అప్పగించినట్లు నామ చెప్పారు. ఎంతో శ్రమించి ఇటుక మీద ఇటుక పేర్చినట్లు సంస్థను డెవలప్ చేశానన్నారు. దేశంలోనే అతిపెద్ద రైల్వే లైన్ కొంకణ్ ప్రాజెక్టులో 6 శాతం తమ కంపెనీ పూర్తి చేసిందని ప్రస్తావించారు. ఇప్పుడు జరుగుతున్న ప్రాజెక్టు చైనా సరిహద్దుల్లో, క్లిష్ట పరిస్థితుల్లోనూ ఈ కంపెనీ నిర్వహిస్తోందన్నారు. రెండుసార్లు ప్రజలు ఆశీర్వదించి తనను పార్లమెంట్ కు పంపారని, దీంతో తన సోదరులకు కంపెనీ బాధ్యతలను అప్పగించానని పేర్కొన్నారు.
మధుకాన్ సంస్థలకు చెందిన ఏ కంపెనీలోనూ తాను ప్రస్తుతం ఎటువంటి హోదాలో లేనని, మరే ఇతర కార్యకలాపాలు నిర్వహించడం లేదన్నారు. రాంచీ ఎక్స్ ప్రెస్ వే బీవోటీ పద్ధతిలో నిర్వహిస్తున్న ప్రాజెక్టుగా చెప్పారు. దాదాపు 163 కి.మీ మేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును 30 శాతం ఈక్విటీతో 2011లో ప్రారంభమైందన్నారు. ఎన్నో కారణాల వల్ల నేషనల్ హైవే సైట్ ఇవ్వలేకపోయిందని, నిర్దేశిత సమయానికి 80 శాతం బదులు 21 శాతమే సైట్ ఇచ్చిందన్నారు. నిర్దేశిత 90 రోజుల్లో ఇవ్వాల్సిన సైటును ఏడేళ్లలోనూ ఇవ్వలేకపోయిందన్నారు. ఇచ్చిన సైటు కూడా ముక్కలు చెక్కలుగా ఇచ్చారన్నారు. దాని ప్రకారం వర్క్ ప్రారంభమైందని, 60.24 శాతం పని పూర్తయిందని, 50.24 శాతం పని మెజర్ మెంట్ కూడా ముగిసిందన్నారు. మొత్తం రూ. 1,655 కోట్ల ప్రాజెక్టుగా చెబుతూ, రూ. 463 కోట్లు కంపెనీ, బ్యాంకర్ రూ. 1,190 కోట్ల చొప్పున వ్యయం చేయాలన్నారు. పనుల నిర్వహణ ఎస్క్రో ఎకౌంట్ ద్వారా మాత్రమే జరుగుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణపు పనులకు సంబందించి కంపెనీ పెట్టే డబ్బు కూడా ఇదే అకౌంట్లో వేయాలని, రూ. 652 కోట్లు మాత్రమే బ్యాంకు వ్యయం చేసిందని, వివిధ కారణాలవల్ల 2011 నుంచి ఏడేళ్లుగా సైట్ లేనందువల్ల వడ్డీగా రూ. 378 కోట్లు బ్యాంకు తీసుకుందన్నారు. మొత్తం రూ. 1,030 కోట్లలో 652 కోట్ల మొత్తాన్ని ప్రాజెక్టుకు బ్యాంకు విడుదల చేసిందన్నారు.
ఈ తరుణంలో ఇంకా సైట్, ఇతరత్రా క్లియరెన్స్ లేకపోవడం వల్ల ప్రాజెక్టు టర్మినేట్ అయ్యిందని చెప్పారు. ఎస్క్రో ఎకౌంట్ పవర్ బ్యాంకుకే ఉంటుందని, కంపెనీకి ఎటువంటి చెక్ పవర్ కూడా లేదన్నారు. నేషనల్ హైవే తప్పిదాల వల్లే ప్రాజెక్టు ఆలస్యమైందని, కంపెనీ అనేక ఇబ్బందులను ఎదుర్కుందన్నారు. ఇందుకు సంబంధించిన వివాదం ట్రిబ్యునల్ విచారణలో ఉందని, ఇంతకన్నా ఎక్కువ విషయాలు వెల్లడించలేనని నామ నాగేశ్వర్ రావు వివరించారు.