పై ఫొటోను నిశితంగా పరిశీలించండి. తెల్ల చొక్కా ధరించి, గడ్డంతో ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీకి చెందిన కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్. ఎంపీ చెంపకు సమీపాన చేయి లేపిన వ్యక్తి ఓ పోలీసు ఉన్నతాధికారి. ఆర్టీసీ డ్రైవర్ నగునూరి బాబు అంత్యక్రియల సందర్భంగా కరీంనగర్ లో చోటు చేసుకున్నఘటనలకు సంబంధించి పోలీసులకు, ఎంపీ బండి సంజయ్ ల మధ్య ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతున్నది. పార్లమెంట్ సభ్యుడైన సంజయ్ విషయంలో పోలీసులు అనుసరించిన వైఖరి దురుసు ప్రవర్తనగా ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులను తెలంగాణా సీం కేసీఆర్ గులాం గిరీలుగా ఎంపీ అభివర్ణిస్తుండగా, తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని కరీంనగర్ ఇంచార్జి పోలీసు కమిషనర్ సత్యనారాయణ చెబుతున్నారు. పోలీసుల దురుసు ప్రవర్తనను విడిచిపెట్టే ప్రసక్తే లేదని, పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోజన్ ను ప్రవేశపెట్టనున్నట్లు ఎంపీ సంజయ్ ప్రకటించారు. రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తున్నదని కూడా సంజయ్ వ్యాఖ్యానించారు. ఇదే దశలో ఈ ఉదంతంలో పోలీసుల తప్పేమీ లేదని, ఎంపీ బండి సంజయ్ పై అనుచితంగా ప్రవర్తించినట్లు వస్తున్న ఆరోపణలు నిరాధారమని, ఆందోళన సందర్భంగా నాయకులను రక్షించడానికి పోలీసులు ఎంతో శ్రమించినట్లు ఇంచార్జి పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. అయితే తమ పార్టీ ఎంపీ సంజయ్ పై దురుసుగా ప్రవర్తించారని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ ఫిర్యాదు చేశారు. దీన్ని తాము డీజీకి పంపామని, ఆయన ఆదేశం మేరకు ఐపీఎస్ అధికారితో మొత్తం ఘటనపై విచారణ జరిపిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు.
అయితే ఆర్టీసీ సమ్మె, డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్ర నేపథ్యంలో కరీంనగర్ పోలీసులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఐపీఎస్ అధికారితో విచారణ జరపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నదే ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీసింది. పోలీసు అధికారులు కరీంనగర్ ఎంపీ సంజయ్ పై చేయి చేసుకున్నారా? బీజేపీ కార్యకర్తలపై పిడిగుద్దుల వర్షం కురిపించారా? అవుననే అంటున్నారు ఎంపీ సంజయ్. శాంతియుతంగా డ్రైవర్ అంతిమయాత్రలో పాల్గొన్న తనను ఎంపీ అని చూడకుండా కాలర్ పట్టుకుని, తనపై చేయి చేసుకున్నారని ఆయన ఆరోపించారు. మీడియా కెమెరాలకు చిక్కిన అనేక దృశ్యాలు ఎంపీ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
ఎవరా ఇద్దరు పోలీసు అధికారులు?
కరీంనగర్లో డ్రైవర్ నగునూరి బాబు అంతిమయాత్ర సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల్లో ఇద్దరు పోలీసు అధికారులు అతిగా ప్రవర్తించారా? పెద్దపల్లి జిల్లా పోలీసులను కరీంనగర్ లో మోహరింపజేయడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? ఢ్రైవర్ బాబు స్వగ్రామమైన ఆరెపల్లిలో విద్యుత్ సరఫరా నిలిపివేతకు గల కారణాలు ఏమిటి? నిజంగానే ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతుకు వచ్చి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందా? ఇటువంటి అనేక ప్రశ్నలకు ఐపీఎస్ అధికారి విచారణలో సమాధానం లభించే అవకాశం ఉంది.
ఇదే సందర్భంగా సున్నితమైన ఆర్టీసీ సమ్మె విషయంలో కొందరు పోలీసు అధికారులు ప్రవర్తిస్తున్న తీరు కూడా ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాన్ని బద్నాం చేసే దిశగా వీరి చర్యలు ఉంటున్నాయన్ననే విమర్శలు వస్తున్నాయి. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆందోళన చేస్తున్న కార్మికులపై ఖమ్మంలో రమాకాంత్ అనే ఓ పోలీసు అధికారి పిడిగుద్దులు కురిపించిన వీడియో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం కలిగించాయి. కరీంనగర్ ఉదంతంలోనూ ఇద్దరు పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తించారన్నది ఎంపీ సంజయ్ ఆరోఫణ. దురుసు ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కుంటున్న ఈ ఇద్దరు అధికారులు కూడా ఉన్నతస్థాయి అధికారులే కావడం గమనార్హం. ఈ ఇద్దరిలో ఒకరు తీవ్ర వివాదాస్పద అధికారిగా గతంలోనూ ఆరోపణలు ఎదుర్కున్నారు. బల్వీందర్ సింగ్ అనే ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఎన్కౌంటర్ ఘటనలో ఈ అధికారి తీరుపై అప్పట్లో తీవ్ర దుమారం చెలరేగింది. సాలీనా రూ. 18.00 లక్షల ప్యాకేజీని వేతనంగా తీసుకునే బల్వీందర్ సింగ్ 2015 డిసెంబర్ లో తల్వార్ చేబూని కొందరిని గాయపర్చిన సందర్భంగా ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ ఉదంతంలో అప్పడు విధుల్లో గల ఓ పోలీసు అధికారిని సస్పెండ్ చేయాలని సిక్కులు కరీంనగర్ లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే అతన్ని ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం ఎంపీ సంజయ్ ఆరోపణలు చేస్తున్న ఇద్దరు పోలీసు అధికారుల్లో అప్పటి బల్వీందర్ సింగ్ ఎన్కౌంటర్లో పాల్గొన్న అధికారి కూడా ఉన్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి కరీంనగర్ ఎంపీ సంజయ్, పోలీసుల మధ్య నెలకొన్న ఈ వివాదం ఎటువంటి మలుపులకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.