తెలుగు వెండితెర మీద నర్సింగ్ యాదవ్ కథానాయకుడు కాదు… ప్రతి నాయకుడు కాదు… తెలుగు ప్రేక్షకుల మదిని దోచే విధంగానే అతడి పాత్ర పోషణ ఉంటుంది. అచ్చ తెలంగాణ యాసలో ఆకట్టుకునే డైలాగులు పలికిన తొలితరం నటుడు. నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ నుంచి ఎదిగి వచ్చిన తొలి నటుడు కూడా నర్సింగ్ యాదవే. మెయిన్ విలన్ కాకపోయినా, నటించిన ప్రతి పాత్రకు ఒక గుర్తింపును తీసుకొచ్చిన నటుడు అని మాత్రం చెప్పవచ్చు. ఆయనది అతి సహజమైన బాడీ లాంగ్వేజ్ కూడా. ఇతర నటులకు ఏమాత్రం తీసిపోని నటనా నైపుణ్యాలు నర్సింగ్ యాదవ్ సొంతం. అయినా తనకు తగిన అవకాశాలు రాలేదనేది కూడా సుస్పష్టం. వచ్చిన ప్రతి పాత్రను ఇది నర్సింగ్ యాదవ్ మాత్రమే చేయగలడు అన్నట్టుగా నటించి మెప్పించిన కళాకారుడు. నేను యాదృచ్చికంగా రెండుసార్లు నర్సింగ్ యాదవ్ ను కలవడం తటస్థించింది. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో ఎస్సై జాన్ విల్సన్, సీఐ యాదగిరి స్మారక సభ ఒకటి జరిగింది. అప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉన్న మల్లయ్య సార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆ సందర్భంగా హుస్నాబాద్ వెంకటలక్ష్మి థియేటర్ లో ఓ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అందులో ప్రదర్శన ఇవ్వడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన కొందరు జూనియర్ ఆర్టిస్టులలో నర్సింగ్ యాదవ్ కూడా ఉన్నారు. హుస్నాబాద్ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో నేనే వారిని రిసీవ్ చేసుకున్నాను. మెటాడోర్ వ్యాన్ లో హైదరాబాద్ నుంచి రావడంతో వారు అలసటకు గురయ్యారు. దాన్ని ఎక్స్ ప్రెస్ చేసి, తమకు వసతి కల్పించలేదని కొందరు ఆర్టిస్టులు అసహనం వ్యక్తం చేశారు. నర్సింగ్ యాదవ్ వారించిన తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ‘‘విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల స్మారక సభ కు వచ్చాం మనం. ప్రజల కోసం వారు త్యాగం చేశారు. మనం కొద్దిగా ఓపిక పట్టలేమా” అంటూ సహచరులకు నచ్చజెప్పారు. అది నర్సింగ్ యాదవ్ లో ఉన్న సుగుణం. ఇంకొకసారి, బహుశా దీని కంటే ముందే కావచ్చు.
మేం హైదరాబాదుకు ఎప్పుడు వెళ్లినా కోఠిలో ఉన్న జయ లాడ్జిలో ఉండేవాళ్లం. ఒకరోజు ఉదయాన్నే లేచి ఏదో పని మీద బయటకు వస్తే ఎదురుగా చేతక్ బండి మీద నర్సింగ్ యాదవ్ కనిపించారు. బహుశా అయ్యప్ప దీక్షలో ఉన్నట్టున్నారు నలుపు రంగు అంగి, కాషాయం రంగు చొక్కా కట్టుకుని ఉన్నారు. ఏం నర్పింగన్నా బాగున్నారా? అంటూ పలకరించాను. ‘‘బాగున్నాను తమ్మీ.. మీరు ఎలా ఉన్నారు” అంటూ ఆప్యాయంగా మాట్లాడారు. చాలా మంది సినీ నటులు దర్పం చూపిస్తారు. అది ఆయనలో అది ఏ కోశానా కనిపించలేదు. సినిమా నటుడు కాబట్టి సహజంగా క్రేజ్ ఉంటుంది. నర్సింగ్ యాదవ్ లో నాకు కనిపించలేదు. ఆయన వెళ్లిపోయిన తర్వాత పక్కన ఉన్నవారు మాతో మాట్లాడుతూ, నర్పింగన్న తాను నటుడని ఎటువంటి అహం ఎప్పుడూ చూపెట్ట లేదండి. మా అందరితో కలిసిమెలిసి ఉంటారు అని చెప్పారు. 52 సంవత్సరాలు అంటే చాలా చిన్న వయసు. అనారోగ్యం చుట్టుముట్టి చిన్న వయసులోనే మన అందరికీ దూరం కావడం విచారకరం. బహుశా సినీ ఫీల్డ్ కు చెందినవారు యాదవ్ బాగా సేవ చేశారని కీర్తిస్తారు కావచ్చు నిజానికి నర్సింగ్ యాదవ్ కు సినీ పరిశ్రమ అన్యాయం చేసిందనే చెప్పాలి. తెలంగాణా నటుడిగా నర్సింగ్ యాదవ్ వివక్షను ఎదుర్కొన్నారు అనేది మాత్రం వాస్తవం. ఒక ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా ఈ విషయం చెప్పారు. ఫైటర్స్ ను మద్రాసు నుంచి తెప్పించుకునే నిర్మాతలు హైదరాబాద్ వారిని నిర్లక్ష్యం చేశారని వాపోయారు. తెలుగు సినీ పరిశ్రమ ఇక్కడే ఉంది. తెలుగు నటీనటులంతా హైదరాబాదులో మకాం ఏర్పరుచుకున్నారు. ఇప్పటికీ సినిమాలలో ఫైటర్స్ లేదా మెయిన్ విలన్ కింద ఉండే అసిస్టెంట్ విలన్స్ అంతా మద్రాసు నుంచి దిగుమతి అవుతారు మరి తెలంగాణవారికి ఏ మాత్రం అవకాశాలు వచ్చాయి? ఇక్కడి ప్రభుత్వం గానీ.. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పెద్దలు గానీ ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రాంత నటీనటులకు సరైన అవకాశాలు లభిస్తే మనం తెలంగాణ గర్వించదగిన నటుడు నర్సింగ్ యాదవ్ కు ఘనమైన నివాళి అర్పించిన వారిని అవుతాం.
✍️ మహ్మద్ ఫజుల్ రహ్మాన్