దుప్పులు, జింకలు, కృష్ణ జింకలు, మనుబోతులు… ఈ వన్యప్రాణుల శరీరాకృతిలో వ్యత్యాసమున్నప్పటికీ పోలికలు మాత్రం కొన్ని ఉంటాయి. ఈ జాబితాలో లేని మూషికం (ఎలుక) ముఖంతో కనిపించే జింకలు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని కిన్నెరసాని డీర్ పార్కులో కనువిందు చేస్తున్నాయి. మూషిక జింక సంతతి పెంపునకు అటవీ శాఖ వన్యప్రాణి విభాగాపు అధికారుల ప్రయోగం ఫలించింది. రెండేళ్ల క్రితం నాలుగు మూషిక జింకలను ఇక్కడ వదిలారు. ఇందులోని ఆడ జింక ఆదివారం మూషిక బుల్లి మూషి జింకకు జన్మనిచ్చింది. దీంతో కిన్నెరసాని డీర్ పార్కులో వీటి సంఖ్య ఐదుకు చేరింది.
ఏమిటీ మూషిక జింక ప్రత్యేకత?
జింక, మూషికం (ఎలుక) లక్షణాలు, శరీరాకృతి కలిగిన జింక జాతిలో అతి చిన్న ప్రాణి ఇది. అందుకే దీన్ని మూషిక జింక అంటారు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం సుమారు 25 నుంచి 30 లక్షల సంవత్సరాల నుంచి మౌస్ డీర్ శరీర అమరికలో ఎటువంటి మార్పులు లేవట. అందుకే దీనిని సజీవ శిలాజంగా కూడా పరిగణిస్తారు. ఇది నిషాచర జీవన విధానాన్ని అవలంబిస్తుందని, జింకల జాతిలో చిన్నగా ఉండే దీనికి బిడియం కూడా కాస్త ఎక్కువేనని అటవీశాఖ వన్యప్రాణి విభాగపు అధికారులు చెబుతున్నారు. మొక్కలు, పిలకలు, ఆకులు, పూలు, పండ్లను మూషిక జింక తన ఆహారంగా తీసుకుంటుంది. విశేషమేమిటంటే మూషిక జింకలకు ఒకప్పడు కిన్నెరసాని అభయారణ్యమే ఆలవాలంగా ఉండేదట. దేశంలోని సూరత్ రాజ్‌కోట్ జూ పార్కు, చెన్నయ్, మంగళూరు జంతు ప్రదర్శన శాలలు, చత్తీస్ ఘడ్లోని బిలాస్పూర్, కోల్ కతాలోని అలీపూర్ జూపార్కుల్లో కిన్నెరసాని డీర్ పార్కులో పురుడు పోసుకున్న మూషిక జింకలే పరుగుతు పెడుతున్నట్లు అటవీ అధికార వర్గాలు చెబుతున్నాయి. నల్లమల అడవుల్లోనూ మూషిక జింకలు ఉన్నాయి. కర్నూలు జిల్లా రుద్రవరం నల్లమల అటవీ రేంజ్ లో మూషిక జింకలు ఉన్నట్లు గత ఆగస్టులో అధికారులు గుర్తించారు. అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో వీటి ఉనికి కనిపించింది. హైదరాబాద్ సమీపంలోని చిల్కూరు మృగవాణి నేషనల్ పార్కులో మూషిక జింకల పునరుత్పత్తి కోసం ఇటీవల ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. రెండు మగ, ఆరు ఆడ మూషిక జింకలను పార్కులో వదిలారు. వాటి కోసం ప్రత్యేకంగా ఎన్క్లోజర్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2010 మార్చిలో నెహ్రూ జూపార్క్‌లో మూషిక జింకల పునరుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీలోని సెంట్రల్ జూ అథారిటీ రెండు మగ, నాలుగు ఆడ మూషిక జింకలను పార్కులో వదిలారు. అనరంతరం వాటి పునరుత్పత్తికి అనుకూల పరిస్థితులను కల్పించారు. అంతరించిపోతున్న మూషిక జింకలు మళ్లీ కనిపిస్తూ సందర్శకులకు కనువిందు చేస్తుండడం మంచి పరిణామంగా వన్యప్రాణి సంరక్షణ విభాగాపు అధికారులు అభివర్ణించారు.