అనగనగా ఒక ఊరు…ఆ ఊరిలో ఓ మోతుబరి రైతు… పొలంలో పనిచేస్తున్న తమను సరిగ్గా చూసుకోవడం లేదని పటేలుగా వ్యవహరించే మోతుబరికి చెందిన జీతగాళ్లు కొందరు నియోజకవర్గ ఎమ్మెల్యేను ఆశ్రయించారు. మోతుబరి సంగతేమిటో చూడాలని, తమ కష్టానికి తగ్గ సొమ్ము ఇప్పించాలని వారు ఎమ్మెల్యేను ప్రాథేయపడ్డారు. విషయం విన్న ఎమ్మెల్యే మోతుబరి వద్ద ఉండే ముఖ్య జీతగాళ్లను పిలిపించి ఇదేం పద్ధతి…వాళ్లు కష్టపడడం వల్లే మీ పటేల్ పొలంలో పంటలు పండుతున్నాయ్… మీలాంటి వాళ్లకు పది మందికి పట్టెడన్నం దొరుకుతోంది కదా? వాళ్లను మంచిగా చూసుకునే బాధ్యత మీ పటేలుకు లేదా? అని ప్రశ్నించాడు.
‘అది కాదు సార్…ఇది కాదు సార్…ఆ జీతగాళ్లు పొలంలో పని సరిగ్గా చేయడం లేదు…చెప్పినట్లు అసలే వినడం లేదు. పైగా ఎదురు తిరుగుతున్నారు. పంటకు గిట్టుబాటు ధరల్లేవు..జీతగాళ్లు సరిగ్గా పని చేయకపోవడం వల్ల పంట దిగుబడి కూడా అంతంత మాత్రమే. పెట్టుబడి కూడా రావడం లేదు… నష్టాలు వస్తున్నాయి… అని మోతుబరి వద్ద పనిచేసే పెద్ద జీతగాళ్లు ఎమ్మెల్యేతో వాదనకు దిగారు. ‘అయినా సరే…వారి ఆలనా, పాలనా మీ పటేలు బాధ్యత కాదా? లేదంటే నేను నా పవర్ ఏమిటో చూపించాల్సి ఉంటుంది’ అని పెద్ద జీతగాళ్ల తీరుపై ఎమ్మెల్యే అగ్గిలం మీద గుగ్గిలమయ్యాడు. ఎమ్మెల్యే ఆగ్రహించిన తీరు చూసి చిన్న జీతగాళ్లు మహా ఆనందపడ్డారు. ఎమ్మెల్యే తీరు తమకే మద్ధతుగా ఉందని, తమ పోరాటం ఫలిస్తుందని వారు ఆశించారు. అయినా మోతుబరి తీరులో ఎటువంటి మార్పు రాలేదు. గ్రామంలో పెద్ద మనుషులుగా పేరు గాంచిన అనేక మంది చెప్పినా మోతుబరి తన మొండితనాన్ని వీడలేదు. చిన్న జీతగాళ్ల గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. తనను ఈ గ్రామంలో ఎదురించే మొనగాడెవడు? తరహాలో భీష్మించాడు. చేసేది లేక చిన్న జీతగాళ్లు మళ్లీ ఎమ్మెల్యే వద్దకు వెళ్లి అయ్యా…మా పరిస్థితి ఏమిటి? మీరే దయ చూపాలి…అని వేడుకున్నారు. అంతా విన్నాక… మోతుబరి రైతు తీరుపై ఆ ఎమ్మెల్యే ఏం తేల్చాడో తెలుసా…?
‘ఇది నా వద్ద తేలేది కాదు…మీ గ్రామ సర్పంచ్ వద్ద తేల్చుకోండి’ అని మోతుబరి రైతుకు చెందిన చిన్న జీతగాళ్లతో ఎమ్మెల్యే స్పష్టం చేశాడు. ఇప్పడు చెప్పండి… ఆ చిన్న జీతగాళ్లు…ఏం చేయాలి? ఎమ్మెల్యే వద్ద లభించని న్యాయం గ్రామ సర్పంచ్ వద్ద లభిస్తుందా? మోతుబరికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే కూడా నిలబడని పరిస్థితుల్లో సర్పంచ్ మాత్రం నిలబడతాడా? మరి ఆ జీతగాళ్లు ఏం చేయాలి? న్యాయం మీరే చెప్పండి?
(ఈ కథనం కేవలం కల్పితం. ఎవరినీ ఉద్ధేశించింది కాదు)