తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ నేత రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నియోజకవర్గ ప్రజల నుంచి తనకు ఒత్తిడి వస్తోందన్నారు. అయితే సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన వెంటనే స్పీకర్ ను కలిసి తన రాజీనామా పత్రం సమర్పిస్తానని చెప్పారు.
ఏదేని నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్ కు రైతులపై, పేద ప్రజలపై ప్రేమ వస్తోందని వ్యాఖ్యానించారు. గోషామహల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీలకు కూడా రూ. 10.00 లక్షల చొప్పున ఇవ్వాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎం నిధులు ఇస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు.
కాగా తన నియోజకవర్గ అభివృద్ధికి రూ. 2,000 కోట్లు మంజూరు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గానికి సర్కారు నిధుల వరద పారిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల రాజీనామాకు డిమాండ్లు వస్తున్నాయి. ఇందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా మినహాయింపు కాకపోవడమే ఆసక్తికరం.