ఔను… బెంగళూరు నగరంలో మూడు వేల మంది కరోనా పేషెంట్ల జాడ తెలియడం లేదు. ఈ విషయాన్ని సాక్షాత్తూ కర్నాటక ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. కరోనా పాజిటివ్ గా తేలిన తర్వాతే వైరస్ బాధితుల్లో ఎక్కువ మంది తమ సెల్ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మిస్సయినవారి వల్లే రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి మరింతగా పెరుగుతున్నదని కర్ణాటక రెవెన్యూశాఖ మంత్రి అశోక వెల్లడించారు. మిస్సయిన వారందరి ఆచూకీ కనిపెట్టాలని ఇప్పటికే పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ సోకిన చాలా మంది బాధితులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకుంటున్నారని, సుమారు 2 నుంచి 3వేల మంది కరోనా బాధితులు స్విచాఫ్‌ చేసుకోవడమే కాకుండా వారి ఇళ్లలోనూ లేరని మంత్రి చెప్పారు. ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదని, వారి ఆచూకి తెలుసుకోలేకపోతున్నామని, పరిస్థితులు మరింత ఇబ్బందిగా మారుతున్నాయని మంత్రి అశోక వెల్లడించారు. కొందరు బాధితులు ఇలా సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసుకుని, ఆరోగ్యం విషమించి చివరి క్షణంలో ఆసుపత్రులకు వస్తున్నారని, ఐసీయూ పడకలు కావాలని అడుగుతున్నారని, ఇది ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిగా మంత్రి వివరించారు.

Comments are closed.

Exit mobile version