మనుషులకన్నా జంతువులే గ్రాహక శక్తిని కలిగి ఉంటాయనే విషయం మరోసారి రుజువైనట్లేనా? అంటే ఔననే అంటున్నారు వన్యప్రాణి సంరక్షణాధికారులు. కావాలంటే మేడారం అడవుల్లో 18 రోజుల క్రితం జరిగిన ఘటనను ఓసారి విశ్లేషించుకోవచ్చని కూడా చెబుతున్నారు. ఏఐ సాంకేతికను అందిపుచ్చుకున్న మానవుల మెదడుకన్నా జంతువుల ‘గ్రాస్పింగ్’ కెపాసిటీ ఎక్కువని చెప్పకనే చెబుతున్నారు. అసలు సంగతిలోకి వెడితే..
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో గత నెల 31వ తేదీన భారీ విధ్వంసం జరిగింది. దాదాపు 500 ఎకరాల్లోని 50 వేలకు పైగా వివిధ రకాల చెట్లు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. టోర్నటో లాంటి ఉపద్రవం ఏదో ఇక్కడ చోటు చేసుకుందని, ఫలితంగానే వేలాది చెట్లు కుప్పకూలినట్లు అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. చెట్లు ధ్వంసమైన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఈ నేపథ్యంలోనే అటవీ అధికారులు నేలకూలిన చెట్ల సంఖ్యను లెక్కిస్తున్నారు. ఈనెల 5వ తేదీ నుంచి ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది కూడా. విరిగిన చెట్ల కొలతలు సేకరిస్తూ, వాటికి నెంబర్లు వేస్తూ ధ్వంసమైన అటవీ విస్తీర్ణాన్ని సర్వే చేస్తున్నారు. ఈ సందర్భంగా అడవుల్లో సంచరిస్తున్న అధికారులకు, సిబ్బందికి ఆశ్చర్యకరమైన దృశ్యాలు సాక్షాత్కరిస్తున్నాయట. పెను ఉపద్రవం వల్ల విలవిలలాడినట్లు కనిపిస్తున్న అడవుల్లో ఇదే అసలైన, అశ్యర్యకరమైన అంశంగా అటవీ అధికారులు చెబుతున్నారు.
ఏటూరునాగారం అభయారణ్యం పరిధిలోనే మేడారం అడవులు కూడా మిళితమై ఉంటాయి. ఈ అడవుల్లో దుప్పులు, జింకలు, మనుబోతులు, నీల్ గాయిలు, సాంబార్లు, గుడ్డేలుగులు (ఎలుగుబంట్లు), అడవి దున్నపోతులు, అడవి పందులు, కొండగొర్రెలు, కుందేళ్లు, కోతులు తదితర వన్యప్రాణులు భారీగానే ఉంటాయి. ఇక పక్షులు, ఉడుతల వంటి చిన్న తరహా జీవరాశులు అనేకంగా జీవిస్తుంటాయి.
కానీ వేలాదిగా నేలకూలిన అటవీ ప్రాంతంలో కనీసం తొండ చనిపోయిన దాఖలాలు కూడా అటవీ అధికారులకు కనిపించడం లేదట. ఇక్కడ జీవించే వన్యప్రాణులకుగాని, ఇతరత్రా జీవరాశులకుగాని ఎటువంటి హాని జరిగినట్లు సర్వే సందర్భంగా తమకు కనిపించలేదని అటవీ సిబ్బంది చెబుతున్నారు. వన్యప్రాణులకు ప్రకృతిలో చోటు చేసుకునే ఉపద్రవాలను, విపత్తులను ముందే గ్రహించే శక్తి ఉంటుందని అటవీ అధికారులు చెబుతున్నారు. వాసన, శబ్దాలను పసిగట్టి ప్రమాదకర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లి ఉంటాయని రిటైర్డ్ అటవీ అధికారులు చెబుతున్నారు.