వాయుగుండం, క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఇటీవల నగరంలో భారీపాతం నమోదైందని మంత్రి తలసాని పేర్కొన్నారు. వరదలకు పేదలకు చెందిన చాలా ఇండ్లు దెబ్బతిన్నాయని, దీంతో బాధితులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు ప్రాంతాల్లో 5 నుంచి 6 అడుగుల మేర వరద నీరు నిలిచింది.
చెరువులకు సమీపంలో నిర్మించిన చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి. 2014 ముందు నిర్మించిన ప్రాంతాల్లోనే వరదలు సంభవించినట్లు తెలిపారు. గత పాలకులు వ్యవహరించిన తీరు వల్లే హైదరాబాద్కు ఈ దుస్థితి దాపురించిందని అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు దేవుడులాంటి సీఎం కేసీఆర్ ఉన్నారని, ఎవ్వరూ అధైర్యపడొద్దని చెప్పారు.
చదివారు కదా రెండు పేరాల వార్తా కథనాన్ని…? మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఏమంటున్నారు? ఓ రకంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, అంటే 2014 తర్వాత నిర్మాణాలు జరిగిన ప్రాంతాల్లో వరదలు రాలేదని చెప్పకనే చెప్పారు. అంతకు ముందు… అంటే 2014 సంవత్సరానికన్నా ముందు నిర్మించిన ప్రాంతాలలోనే వరదలు వచ్చాయని మంత్రి స్పష్టంగానే చెప్పారు. దీనికంతటికీ కారణం గత పాలకుల వ్యవహార తీరేనని వేలెత్తి చూపారు.
హైదరాబాద్ లో కురిసిన వర్షాల ధాటికి ప్రవహించిన వరద నీరు ఏయే నిర్మాణాలు ఏ సంవత్సరంలో కట్టారో తెలుసుకుని మరీ ప్రవహించిందన్నమాట. వరుణుడు కూడా 2014కు ముందు కట్టిన నిర్మాణ ప్రాంతాలపైనే పగబట్టినట్లుంది కదూ తలసాని వ్యాఖ్యల భాష్యం! ఆయా వ్యాఖ్యల వార్తా కథనం ఏ అడ్రస్ లేని ‘వెబ్ సైట్’లో వస్తే ఎవరైనా తేలిగ్గా తీసుకునే అవకాశం ఉంది. మంత్రి అలా మాట్లాడినట్లు వీడియో ఉందా? అని ప్రశ్నించవచ్చు. మంత్రి శ్రీనివాసయాదవ్ ను బద్నాం చేస్తున్నారని ఎదురుదాడికి దిగవచ్చు.
కానీ ఈ విషయంలో అందుకు అస్కారం లేకపోవడమే అసలు విశేషం. ఎందుకంటే ఈ వార్తా కథనం అడ్రస్ లేని వెబ్ సైట్ రాసింది కానేకాదు. తెలంగాణాలో అధికార పార్టీ కరదీపిగా భావిస్తున్న ‘నమస్తే తెలంగాణా’ వెబ్ సైట్ లో ఈ సాయంత్రం 5.45 గంటలకు ఈ వార్తను పోస్ట్ చేశారు. అందుకే తలసాని శీనన్న వ్యాఖ్యలు నిజమేనని భావించక తప్పదు. చివరికి వరుణుడు కూడా గత పాలకుల హయాంలో నిర్మించిన ప్రాంతాల్లో మాత్రమే తన ‘పెతాపం’ చూపాడని, వరద ‘సోయి’లోనే ప్రవహించిందని నమ్మాల్సిందే. ఇంకా ఏదేని డౌటుంటే ‘నమస్తే తెలంగాణా’ వెబ్ సైట్ లోని టాప్ స్టోరీల్లో గల ఈ కథనాన్ని చదవవచ్చు.