తెలంగాణా మంత్రి ధనసరి అనసూయ అలియస్ సీతక్క సరికొత్త సవాల్ ను ఎదుర్కుంటున్నారు. విప్లవోద్యమం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన సీతక్క చారిత్రక నేపథ్యమే ఆమె ఎదుర్కుంటున్న సవాల్ కు కారణంగా మారిందనే చెప్పాలి.
తెలంగాణా మంత్రివర్గంలో అర్బన్ నక్సలైట్లు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపైనే సీతక్క తాజా పోరాటం చేస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ లో తాను మాత్రమే నక్సల్ నేపథ్యం గల వ్యక్తినని, తనను ఉద్దేశించే బండి సంజయ్ అర్బన్ నక్సల్స్ అనే కామెంట్లు చేశారనేది సీతక్క భావన, వాదన కూడా.
తాను నక్సల్ జీవితం నుంచే పొలిటికల్ లైఫ్ లోకి వచ్చానని, అడ్డదారిలో, దొడ్డిదారిలో రాలేదని సీతక్క వెల్లడించారు. అనదల్చుకుంటే తననే నేరుగా అనాలని, మొత్తం మంత్రి వర్గాన్ని అంటే సహించేది లేదని సీతక్క కూడా బండి సంజయ్ కు స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కూడా సీతక్క డిమాండ్ చేస్తూ, బీజేపీ నాయకుల వైఖరిపై విమర్శలు చేశారు.
ఈ నేపథ్యంలోనే సీతక్కను ‘మావోయిస్టుగా’ మీడియా తన వార్తల్లో నివేదిస్తోంది. ఇంతకీ సీతక్క మావోయిస్టా? మావోయిస్టు పార్టీలోనే ఆమె పని చేశారా? ఆమె మావోయిస్టు నక్సలైటేనా? మావోయిస్టు పార్టీకి ఆమెకు ఏం సంబంధం? అనే అంశాలు కూడా ఈ సందర్భంగా చర్చకు దారి తీస్తున్నాయి.
సీతక్క జీవితాన్ని క్లుప్తంగా పరిశీలిస్తే.. ఓ సాధారణ కోయజాతి ఆదివాసీ గిరిజన కుటుంబంలో జన్మించారు అమె. చిరుప్రాయంలోనే తీవ్రవాద ఉద్యమబాట పట్టారు. సీపీఐ ఎంఎల్ జనశక్తి పార్టీలో సీతక్క పని చేశారు. దాదాపు పదిహేనేళ్లపాటు విప్లవోద్యమంలో పనిచేసిన సీతక్క తన సహచర నక్సల్ లీడర్ రామును పెళ్లి చేసుకున్నారు. అజ్ఞాత జీవితానికి స్వస్తి చెప్పి జనజీవన స్రవంతిలో కలిశారు. ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత న్యాయశాస్త్రం చదివి పట్టాను పొందారు. ఆ తర్వాత అప్పటి టీడీపీ, ఇప్పటి బీజేపీ నాయకుడు గరికపాటి మోహన్ రావు ద్వారా టీడీపీలో చేరారు. తర్వాత రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ములుగు నుంచి 2009, 2018, 2023 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
నిజానికి అడవిబాట నుంచి జనంబాట పట్టిన విప్లవ నాయకులు రాజకీయాల్లో మనగలగడం అంత సులభమేమీ కాదు. కానీ సీతక్క నిలదొక్కుకున్నారు. విప్లవోద్యమంలో సీతక్క భీతావహ నిర్ణయాలకు, చర్యలకు, తాజా రాజకీయాల్లో ఆమె సహనానికి మధ్య గల వ్యత్యాసాన్ని పరిశీలించినపుడు అచ్చెరువొందక తప్పదు.
కొందరు మాజీ నక్సల్స్ కథనం ప్రకారం.. కొత్తగూడ-గూడూరు ఏరియా ప్రాంతానికి సీతక్క జనశక్తి పార్టీ దళ కమాండర్ గా పనిచేస్తోంది. ఓ వ్యక్తి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే అభియోగాలు దళం దృష్టికి వచ్చాయి. దీంతో ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తిని సీతక్క నాయకత్వంలోని నక్సల్ దళం పట్టుకుని, విచారించి షాకింగ్ చర్య తీసుకుంది. ఇందులో భాగంగానే అతని వృషణాలను తొలగించే బాధ్యతను దళం డిప్యూటీ కమాండర్ ప్రభాకర్ కు సీతక్క అప్పగించారు. అన్యాయాలపై, అక్రమాలపై పోరాడే అంశంలో సీతక్క తత్వానికి ఈ ఘటనను ఉదాహరణగా ఆమె గురించి తెలిసిన వారు ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారు.
సీతక్క ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత ఆమె భర్త రాము జనశక్తి పార్టీ నుంచి వైదొలగి మారోజు వీరన్న నాయకత్వంలోని సీపీయూఎస్ఐ అనే సరికొత్త విప్లవ పార్టీకి సిద్ధార్థ పేరుతో రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. డీబీఎస్వీ అంటే దళిత బహుజన శ్రామిక విముక్తి అనే అక్షరాలను కూడా సీపీయూఎస్ఐ పార్టీ కలిగి ఉండేది. కాలక్రమంలో రాము ఎఎల్టీ పేరుతో ఆదివాసీ లిబరేషన్ టైగర్స్ అనే మరో విప్లవ సంస్థను స్థాపించారు. నాలుగైదు సాయుధ దళాలతో పార్టీని నిర్వహిస్తున్న క్రమంలోనే రాము ఉమ్మడి ఖమ్మం జిల్లా అడవుల్లోనే జరిగిన ఎన్కౌంటర్ లో మరణించారు.
అయితే జనశక్తి పార్టీలో మాత్రమే పనిచేసిన సీతక్క ఆ తర్వాత తన భర్త నాయకత్వంలో నడిచిన సీపీయూఎస్ఐ పార్టీలోగాని, ఏఎల్టీ పార్టీలోగాని పనిచేయలేదు. అంటే సీతక్క ఒకప్పటి పీపుల్స్ వార్ ప్రస్తుత మావోయిస్టు పార్టీలో పని చేయలేదు. కానీ జనశక్తి పార్టీ పేరుకు ముందు సీపీఐ ఎంఎల్ అనే అక్షరాలు ఉండేవి. చండ్ర పుల్లారెడ్డి పేరుతో నడిచిన విప్లవ సంస్థలకూ ఎంఎల్ అనే అక్షరాలు దాదాపుగా ఉంటాయి. ఎంఎల్ అంటే మార్క్సిస్టు, లెనినిస్టు అని అర్థం. ఇదే దశలో మావో ఆలోచనా విధానాన్ని అంగీకరించే ప్రతి విప్లవకారున్నీ మావోయిస్టుగానే విప్లవోద్యమకారులు అభివర్ణిస్తుంటారు. ఈ నిర్వచనం ప్రకారం జనశక్తి పార్టీలో పనిచేసిన సీతక్క మావో ఆలోచనా విధానాన్ని అంగీకరించే నక్సల్ పార్టీలో పనిచేసి ఉండవచ్చు. ఈ నేపథ్యంలో ఆమె ‘మావోయిస్ట్’ అయితే కావచ్చు.
కానీ సీతక్క ‘మావోయిస్టు పార్టీ లీడర్’ మాత్రం కాదు. విప్లవోద్యమం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన సీతక్క తన బాటలో చవిచూసిన ఘటనలు అనేకం. వాటన్నంటినీ దాటుకుంటూ కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగిన సీతక్క ఇప్పుడు అర్బన్ నక్సల్ అనే తాజా సవాల్ ను ఎదుర్కుంటున్న తీరుపై తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఈ పరిణామాన్ని ఆమె మున్ముందు ఏ విధంగా అధిగమిస్తారనేది వేచి చూడాల్సిందే.
– ఎడమ సమ్మిరెడ్డి