రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నగరంలో ఇప్పుడు ఓ ఉద్యమం నడుస్తోంది. ఖమ్మం బైపాస్ రోడ్డులో నిర్మించిన కొత్త బస్ స్టేషన్ నుంచి మార్చి 1వ తేదీ నుంచి బస్సుల రాకపోకలు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్దేశిత ప్లాన్ ప్రకారం నిర్మాణపు పనులు సంపూర్ణంగా పూర్తి కాకపోయినా, ఆఘమేఘాల మీద బస్సుల రాకపోకలను ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించారు. అయితే నగరం నడిబొడ్డున మయూరి సెంటర్ లో గల ‘పాత బస్ స్టేషన్’ను ఏం చేస్తారన్నదే అసలు ప్రశ్న.

దాదాపు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో గల పాత బస్ స్టేషన్ ను మూసివేస్తున్నట్లు ఖమ్మం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ ప్రకటించారు. అయితే పాత బస్ స్టేషన్ మూసివేత అనే అంశంపైనే అఖిలపక్ష నాయకులు ప్రధానంగా పోరాడుతున్నారు. పాత బస్ స్టేషన్ ను సిటీ బస్ స్టాండ్ గా కొనసాగిస్తామని, కొత్త బస్ స్టేషన్ ను హైటెక్ బస్టాండ్ గా వ్యవహరిస్తామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. పక్కనే గల సూర్యాపేట పట్ణణంలో రెండు బస్ స్టేషన్లు కొనసాగుతున్న పరిస్థితుల్లో, అంతకన్నా పెద్ద నగరమైన ఖమ్మంలో ప్రస్తుత బస్ స్టేషన్ ను మూసివేయడమేంటనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇదే దశలో పాత బస్ స్టేషన్ స్థలాన్ని ప్రయివేట్ వ్యక్తులకు, లేదా సంస్థలకు లీజుకు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుత బస్ స్టేషన్ మూసివేతపై సోషల్ మీడియాలో పలు ప్రశ్నల పరంపరతో పోస్టులు వైరల్ గా మారుతున్నాయి. ఉదాహరణకు ఓ పోస్టును ఉన్నది ఉన్నట్లుగానే దిగువన ఓసారి చూడండి.

BREAKING NEWS….
….సామాజిక మాధ్యమాల్లో వైరల్ పోస్ట్….

? ఖమ్మంలో సర్వత్రా చర్చకు దారి తీస్తున్న పాత బస్టాండ్ ఎత్తివేత బ్యానర్ గురించి….

? బోనకల్లు, చింతకాని, కొణిజర్ల… ఇలా చుట్టూ పక్కల మండలాలు నుంచి.. ప్రభుత్వ వుమెన్స్ కాలేజీలో చదువుకోవడానికి వచ్చే తెలంగాణ ఆడబిడ్డలపై ఆర్థిక భారం వేయాలని “మీరు” భావిస్తున్నారా..?

? నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ ఇలా ఇతర మండలాలు నుంచి వచ్చే పేద, మధ్యతరగతి విద్యార్థిని, విద్యార్థులపై ఆర్థిక భారం వేయాలని “మీరు” భావిస్తున్నారా…?

? బోనకల్లు, చింతకాని, కొణిజర్ల, నేలకొండపల్లి, కుసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ నుంచి హాస్పిటల్ కోసం వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం వేయాలని “మీరు” భావిస్తున్నారా…?

? బోనకల్లు, చింతకాని, కొణిజర్ల, నేలకొండపల్లి, కుసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ నుంచి వచ్చి వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేయాడానికి వచ్చే పేద మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం వేయాలని “మీరు” భావిస్తున్నారా..?

? దక్షిణాది, ఉత్తారాది రాష్ట్రల నుంచి రైలు మార్గం ద్వారా వచ్చి భద్రాచలం రామాలయం దగ్గరకు వెళ్ళాటానికి వచ్చే భక్తులపై ఆర్థిక భారం వేయాలని “మీరు” భావిస్తున్నారా..?

? రైల్వే స్టేషన్ నుంచి వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం వేయాలని “మీరు” భావిస్తున్నారా..?

? రోజూ పాత బస్టాండ్ వద్ద ఇడ్లీ, అరటి పండ్లు అమ్మకోనే పేద కుటుంబాల “పొట్ట” కొట్టాలని మీరు భావిస్తున్నారా…?

? పాత బస్టాండ్ పై ఆధారపడిన చిన్న, చిన్న వ్యాపారుల జీవితాలను రోడ్ మీద పడివేయాలని “మీరు” భావిస్తున్నారా…?

? బొమ్మనా సెంటర్, కమాన్ బజార్, గాంధీ చౌక్ తదితర ఏరియాల్లో వివిధ రకాల సెక్షన్ వారీగా వున్న వ్యాపారాలను ఆర్థికంగా దెబ్బ తీయాలని “మీరు” భావిస్తున్నారా..?

? మెత్తం మీద ప్రజలను ఇబ్బంది పెట్టి
బస్టాండ్ సెంటర్ ఏరియాను అన్ని రకాలుగా దివాళా తీయంచాలని “మీరు” ప్లాన్ వేశారా..?

? ( పాత బస్టాండ్ తీసివేస్తే ప్రజలకు జరగబోయే ఆర్థిక నష్టాలు గురించి మరిన్ని వివరాలు త్వరలో…)

మంత్రి అజయ్ చేసిన వాట్సప్ పోస్ట్ ఇదే

ప్రస్తుత బస్ స్టేషన్ మూసివేతపై వివిధ రాజకీయ పక్షాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్న ఆయా పరిస్థితుల్లో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం రాత్రి సోషల్ మీడియా వేదికగా స్వయంగా చేసిన ఓ పోస్ట్ చర్చకు దారి తీసింది. తన అధికారిక వాట్సప్ గ్రూపులో మంత్రి అజయ్ చేసిన ఇమేజ్ పోస్ట్ సారాంశమేమిటంటే…. ‘నువ్వు ఏమనుకుంటున్నావనే విషయాన్ని ఇతరులకు చెప్పడంకంటే, కొన్ని సార్లు మౌనంగా ఉండడమే మంచిది’. ప్రస్తుత బస్ స్టేషన్ ను సిటీ అవసరాలకు వినియోగించాలని పోరాటం జరుగుతున్న నేపథ్యంలోనే మంత్రి ఈ ‘సైలెంట్’ పోస్టును చేశారా? లేక ఇతరత్రా ఏవేని రాజకీయ సమీకరణాల్లో మార్పులు జరుగుతున్నాయా? మంత్రి చేసిన ‘సైలెంట్’ పోస్టులోని అసలు మర్మమేంటి? అనే ప్రశ్నలపై భిన్న కోణాల్లో చర్చ జరుగుతోంది.

Comments are closed.

Exit mobile version