రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానులకు శుభవార్త చెప్పారు. పార్టీ కేడర్ ఎటువంటి ఉద్వేగాలకు, భావావేశాలకు లోనుకాకుండా, వారిలో ఘర్షణ వైఖరికి తావు లేకుండా దిశా, నిర్దేశం చేశారు. వాస్తవానికి పువ్వాడ అజయ్ చాలా విషయాల్లో స్పష్టంగా ఉంటారు. తాను చెప్పదల్చుకున్న విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా, ఇంకా విపులంగా చెప్పాలంటే సరళమైన భాషలోనే చెబుతారు. ఓ రకంగా చెప్పాలంటే అనేక అంశాలపై మాట్లాడే సందర్భాల్లో ఆయన వాడుక భాషనే వినియోగిస్తారు. గ్రాంథికం జోలికి అస్సలు వెళ్లరు. రాజకీయాల్లోకి రాకముందు, మంత్రి అయ్యాక కూడా ఆయన వ్యవహార తీరులోగాని, మాటల్లోగాని పెద్దగా తేడా కనిపించదు. ఆయనను దగ్గరగా చూసినవారికి ఇది క్లియర్ గా అర్థమవుతుంది కూడా. దూరంగా చూసేవారికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు… అది వేరే విషయం. దాదాపు ఎనిమిదేళ్ల క్రియాశీల రాజకీయ పయనంలో పువ్వాడ మంత్రి స్థాయికి ఎదిగారంటే ఆయన విజన్ ను అవగతం చేసుకోవచ్చు. పువ్వాడ అజయ్ కు ఇదేమీ ఆయాచితంగా వచ్చిన పవర్ కాకపోవచ్చు. తన కష్ట ఫలాలుగానే ఆయన అభిమానులు, అనుయాయులు భావిస్తుంటారు. అజయ్ పేరు చెప్పుకుని పబ్బం గడుపుకునేవారి ప్రస్తావన ఇక్కడ అప్రస్తుతం కూడా.
విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పగలిగే కొద్ది మంది రాజకీయ నేతల జాబితాలో అజయ్ కూడా ఉంటారని చెప్పవచ్చు. ఇప్పుడీ ప్రస్తావన దేనికంటే… వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపుకోసం ఖమ్మం జిల్లాలోని వైరా, కొణిజర్ల మండలాల స్థాయి సమావేశాన్ని స్థానిక కమ్మవారి కళ్యాణ మంటపంలో నిర్వహించారు. ఇదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. ఆయన సమావేశ స్థలికి కాస్త ఆలస్యంగా వచ్చారు. పొంగులేటి వచ్చీ రాగానే ఆయన నాయకత్వం వర్థిల్లాలంటూ గులాబీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనూ పార్టీ కార్యకర్తలు అదే పనిగా నినదిస్తుండగా మంత్రి పువ్వాడ మాట్లాడారు. ఈ సమయంలోనే గులాబీ శ్రేణులకు మంత్రి పువ్వాడ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఇంతకీ పువ్వాడ ఏమన్నారంటే…?
‘మేమిద్దరం బాగానే ఉన్నాం. శీనన్న, నేను మంత్రి కేటీఆర్ కు రెండు కళ్లలాంటి వారం. మేం ఐక్యంగా పార్టీ కోసం పనిచేస్తుంటే వ్యక్తిగత నినాదాలు ఎందుకు చేస్తున్నారు? త్వరలోనే అందరికీ ప్రాధాన్యత వస్తుంది’ అని మంత్రి పువ్వాడ అన్నారు. వాస్తవానికి ఈ సభలో మంత్రి చెప్పిన మాటలు టీఆర్ఎస్ పార్టీకి శుభవార్తలాంటివే. ఎందుకంటే మంత్రి పువ్వాడ అజయ్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు మాత్రమే కాదు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నేతలు కూడా ‘పల్లా’ గెలుపు కోసం ఐక్యంగా పనిచేస్తుంటే, ‘మా నాయకుడి బర్త్ డే ఫ్లెక్సీలు’ తొలగించారంటూ సిల్లీ విషయాలను పదే పదే వల్లించుకుంటూ, మననం చేసుకుంటూ, గతం తలుస్తూ వగచడం ‘పొంగులేటి’ అభిమానులకు,అనుయాయులకు సబబేనా? అని రాజకీయ పరిశీలకులు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు.