సీఎం రేవంత్ రెడ్డి పదవిపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిలో మరో నాలుగేళ్లపాటు రేవంత్ రెడ్డే ఉంటారని చెప్పారు. రాష్ట్రంలో సీఎం మార్పు అనేది ఉండదని, మరో నాలుగు సంవత్సరాల ఒక నెల రోజుల వరకు రేవంత్‌రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని పొంగులేటి చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి శనివారం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతిపక్షం కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతోందన్నారు. ఆర్ధికంగా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా తల తాకట్టు పెట్టయినా సరే ఇందిరమ్మ ఇండ్లను పూర్తిచేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తమ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకమని, రాష్ట్రంలో ఈనెల 5, 6 తేదీల నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. పదిహేను రోజుల్లొ గ్రామ కమిటీల ద్వారా ఎంపిక పూర్తి చేసి ఆ వెంటనే జాబితాలు ఖరారవుతాయని, ఇది నిరంతర ప్రక్రియగా చెబుతూ, గ్రామాలలో ఇందిరమ్మ కమిటీల ఎంపికే ఫైనల్ గా మంత్రి పేర్కొన్నారు.