పెళ్లంటే నూరేళ్ల పంట అంటుంటారు. ఆ పెళ్లి నూరేళ్లకుపైగా గుర్తుండిపోయే విధంగా చేస్తే ఎలా ఉంటుంది..? సామాన్యులకు ఇది సాధ్యం కాకపోవచ్చు. బాగా డబ్బున్నోళ్లు మాత్రమే చేసే పెళ్లిళ్లు నూరేళ్లపాటు గుర్తుండిపోయేలా ఉంటాయనేది సహజ వాదన. ఇలాంటి పెళ్లిళ్లలో సామాన్యులకు చోటు ఉండదని కూడా అంటుంటారు. అంతేకాదు ఇటువంటి పెళ్లిళ్లు చేసేవాళ్లు తమ స్థాయికి తగినవారిని మాత్రమే ఆహ్వానిస్తుంటారని చెబుతుంటారు. కానీ డబ్బుంటే మాత్రమే సరిపోదు. ఎంత డబ్బు ఉన్నప్పటికీ, సామాన్య ప్రజలను కూడా సంబరాల్లో మమేకం చేస్తూ, వీవీఐపీల నుంచి తనను అభిమానించే ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ పెళ్లిళ్లు జరిపేవారు కొందరు ఉంటుంటారు. ఈ కోవలోకే వస్తారు తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
పొంగులేటి కుటుంబంలో జరుగుతున్న మరో పెళ్లి కూడా ఎప్పటిలాగే ఈసారి కూడా చర్చనీయాంశ వార్తల్లోకి వచ్చింది. లక్షలాది మంది ప్రజల నోళ్లలో తాజా పెళ్లి ఏర్పాట్ల అంశం నానుతోంది కూడా. మంత్రి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి తెలుసు కదా..? అన్నచాటు తమ్ముడిలా కనిపించే ప్రసాదరెడ్డి రాజకీయంగానే కాదు, పొంగులేటి కుటుంబ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా తన కనుసన్నల్లో విజయవంతంగా నడిపిస్తుంటారనే పేరుంది. ప్రసాదరెడ్డి రాజపుష్ఫ రియల్ ఎస్టేట్ వ్యవస్థకు చెందిన కుటుంబంతో వియ్యమందుతున్న సంగతి తెలిసిందే. మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి సోదరుడు పారుపాటి మహేందర్ రెడ్డి కుమార్తెను ప్రసాదరెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డికి ఇచ్చి వివాహం జరిపిస్తున్నారు. మరో రెండు రోజుల్లో అంటే ఈనెల 14న గల్ఫ్ లోని బహ్రెయిన్ లో వివాహం చేస్తున్నారు.
ఈ పెళ్లికి ఇటు మంత్రి పొంగులేటి కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, అటు రాజపుష్ప వ్యాపార సామ్రాజ్యపు అధినేతల కుటుంబాలు సహా దాదాపు 500 మంది వరకు బహ్రెయిన్ కు తరలివెళ్లారు. మూడు ప్రత్యేక విమానాల్లో రెండు కుటుంబాలకు చెందినవారు పెళ్లికి హాజరయ్యేందుకు ఇప్పటికే బహ్రెయిన్ చేరుకున్నారు. బహ్రెయిన్ లో పెళ్లి.. అందుకయ్యే ఖర్చు ఎంత అని మాత్రం అడక్కండి. ఎందుకంటే ఆ వివరాలేవీ అందుబాటులో లేవు. కానీ.. పెళ్లి తర్వాత ఈనెల 18న పొంగులేటి కుటుంబం ఏర్పాటు చేస్తున్న రిసెప్షన్ మాత్రం అబ్బురపరుస్తుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని తమ స్వగ్రామమైన నారాయణపురంలో పెద్ద ఎత్తున రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నారు.
‘పీఎస్ఆర్’ ప్యాలెస్ గా నామకరణం చేసిన రిసెప్షన్ ను మొత్తం 70 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. సినిమా ఫీల్డ్ కు చెందిన 250 మంది నిపుణులతో ఏర్పాటు చేస్తున్న పీఎస్ఆర్ ప్యాలెస్ లో భారీ సెట్టింగులను నిర్మిస్తున్నారు. మొత్తం 70 ఎకరాల్లో 40 ఎకరాలను వాహనాల పార్కింగ్ కోసం కేటాయించగా, ఐదెకరాల్లో రిసెప్షన్ వేదిక సెట్టింగ్ కోసం కేటాయించారు. మిగతా 25 ఎకరాల్లో 12 భోజన స్టాళ్లను నిర్మిస్తున్నారు. ఇందులో 11 స్టాళ్లు నార్మల్ గా, ఒకటి వీవీఐపీల కోసం నిర్మిస్తున్నారు. ఒక్కో స్టాల్ లో 10 వేల మందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. పది స్టాళ్లను నాన్ వెజ్ ప్రియుల కోసం, మిగతా రెండు వెజిటేరియన్ల కోసం ఏర్పాటు చేస్తున్నారు.
జిల్లా నలుమూలల నుంచేగాక రాష్ట్ర స్థాయిలో వచ్చే వీవీఐపీలు సహా మొత్తం 1.20 లక్షల మందికి ఖరీదైన, రుచికరమైన భోజన ఏర్పాట్లు చేస్తున్నారు ఇంతకీ ఇక్కడ చేస్తున్న ఏర్పాట్లకు అవుతున్న ఖర్చు ఎంత అంటారా? అనధికార సమాచారాన్ని బట్టి మొత్తం రూ. 10 కోట్లను రిసెప్షన్ కోసం వ్యయం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో రూ. 4 కోట్లు కేవలం రిసెప్షన్ కోసం నిర్మిస్తున్న వేదిక సెట్టింగులకే ఖర్చు చేస్తున్నారట. బహ్రెయిన్ కు తరలించిన బంధువుల ప్రత్యేక విమానాలకే కోటిన్నర వరకు వ్యయం చేసినట్లు తెలుస్తోంది.
ఇదంతా సరే ఇంతకీ బహ్రెయిన్ లో పెళ్లి ఖర్చు ఎంత అంటారా? ఈ సంగతేమోగాని హైదరాబాద్ లో ఇటీవల జరిపిన ఎంగేజ్ మెంట్ ఏర్పాట్లు ఎలా ఉండాలి? అనే అంశంపై సలహా ఇచ్చినందుకే ఓ విదేశీ ఈవెంట్ సంస్థకు రూ. 5 కోట్లు చెల్లించారనే చర్చ జరుగుతోంది. దీన్ని బట్టి బహ్రెయిన్ పెళ్లి ఖర్చులను అంచనా వేసుకోవచ్చు. మాజీ ఎంపీగా ఉన్నపుడు తన కూతురు వివాహాన్ని ఇండోనేషియాలోని బాలిలో జరిపించిన పొంగులేటి ప్రస్తుతం మంత్రి హోదాలో తన సోదరుని కుమారుడి పెళ్లిని కూడా విదేశాల్లోనే అట్టహాసంగా జరిపిస్తుండడం విశేషం. పొంగులేటి ఇంట పెళ్ళిళ్లంటే మామూలు కాదు మరి.. తన అభిమానుల, అనుయాయుల మధ్య అత్యంత అట్టహాసంగా జరిపే రిసెప్షన్ సంబురం అంబరాన్ని అంటుతోంది.