ముంపు బాధితులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని, ఎవ్వరూ అధైర్య పడొద్దని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మంత్రి ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి, జలగం నగర్, పెద్దతాండ వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి భరోసా కల్పించారు. ఇంటింటికి తిరిగి వరద ప్రభావం, ఇండ్ల పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో ఇండ్లలోని బురద శుభ్రం చేయాలన్నారు. వీధులు, తక్షణ సహాయం, బాధితుల వివరాల సేకరణ పై అధికారులకు తగు సూచనలు చేశారు. నష్టపోయిన ప్రతి ఇంటికి సహాయం అందిస్తామన్నారు. అధికారులు సర్వే ప్రక్రియ వెంటనే చేపట్టి, నష్ట అంచనా పూర్తి చేయాలన్నారు. సర్టిఫికెట్లు, పుస్తకాలు నష్టపోయిన వారికి తగు న్యాయం చేస్తామన్నారు. తడిసిన బియ్యం స్థానే సన్న బియ్యం అందిస్తామన్నారు. విద్యుత్ స్తంభాలు, తీగల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి అన్నారు. మోటార్ సైకిల్ పై మంత్రి కాలనీల్లో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.