పత్రికల్లో పతాక శీర్షికల వార్తా కథనాలు (బ్యానర్ స్టోరీ) ఆయా పత్రికల ఇష్టం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆ పత్రిక ఎడిటర్ విచక్షణాధికారం, ఎడిటోరియల్ బోర్డు (ఉంటే..) నిర్ణయం, లేదంటే యాజమాన్య ప్రయోజనం.. సంస్థ వ్యాపార లబ్ధి, అరుదుగా ప్రజా ప్రయోజనం వంటి అంశాల ప్రాతిపదికగానే పత్రికల్లో బ్యానర్ గా స్టోరీలను, లేదా ఘటనలను వార్తలుగా ఖరారు చేస్తుంటాయనే పేరును కొన్ని మీడియా సంస్థలు సంపాదించుకున్నాయి. ఈ విషయంలో రాజకీయ పార్టీల కనుసన్నల్లో నడిచే పత్రికలది ఓ దారి కాగా, పార్టీలకు అంటకాగే కొన్ని పత్రికలది మరోదారిగా పేరు గాంచాయి. ఏ పత్రిక ఏ దారిన నడుస్తున్నదనే అంశం పాఠకులకు, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పాఠకులకు, ప్రజలకు తెలియని కొత్త విషయమేమీ కాదు. పత్రికలు వార్తలకు ఇచ్చే ప్రాధాన్యతపై ప్రజలకు ఫుల్ క్లారిటీ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఈ అంశంలో మీడియా సంస్థల నేపథ్యం ఎందుకంటే…? మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం, బంధువుల నివాసాల్లోనేగాక ఆయనకు చెందిన వ్యాపార సంస్థ కార్యాలయాల్లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతంపై గులాబీ పార్టీ అధికార పత్రికగా ప్రాచుర్యం పొందిన నమస్తే తెలంగాణా పత్రిక శనివారం నాటి సంచికలో ప్రచురించిన వార్తా కథనాలు జర్నలిస్టు సర్కిళ్లలో భారీ చర్చకు దారి తీశాయి.
నమస్తే తెలంగాణా పత్రిక బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మానస పుత్రిక… అనే విషయం పాఠకులకు తెలియనిదేమీ కాదు. అధికారంలో ఉన్నపుడు, ప్రస్తుతం ఆ పత్రిక పంథాపై కొత్తగా చర్చించాల్సిందేమీ లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే శుక్రవారం పొంగులేటి సంస్థల్లో ఈడీ సోదాల అంశాన్ని ‘పండుగ’ చేసుకున్న తరహాలో ఆ పత్రిక వార్తా కథనాలను తన పాఠకులకు అందించిందనే వ్యాఖ్యలు జర్నలిస్టు సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. ‘మంత్రి పొంగులేటిపై ఈడీ రెయిడ్.. అనే హెడింగ్ తో సోదాల ఘటనను బ్యానర్ స్టోరీగా చేసింది. తీవ్ర ఆర్థిక నేరాల్లో పొంగులేటి కుటుంబం!, రూ.. 600-800 కోట్ల అక్రమాల గుర్తింపు?, నివాసాలు, ఆఫీసులపై ఏకకాలంలో దాడులు అనే సబ్ హెడింగులతో, పధ్నాలుగు బుల్లెట్ పాయింట్లతో భారీగా తన పాఠకుల ముందుంచింది. ఈడీ సోదాలకంటే ముందు..? అంటూ.. సోదాలకు ముందు ఏం జరిగిందో నాలుగు స్టెప్పులను ప్రస్తావించింది. పొంగులేటితోపాటు ఆయన కుమారుడు హర్షరెడ్డి ఫొటోను కూడా ప్రముఖంగా ప్రచురించింది.
మెయిన్ ఎడిషన్ మొదటి పేజీలో సగం వరకు ఈ అంశంపై బ్యానర్ స్టోరీని ప్రచురించిన ఈ ప్రత్రిక తరువాయిని రెండో పేజీలోనూ కొనసాగించింది. ‘వివాదాల ఎగ్జిమ్ బ్యాంక్, కీలక ఫైళ్లు మాయం, తెల్లవారు జామునే ఇంటి నుంచి వెళ్లిన పొంగులేటి, ఫెమా ఉల్లంఘన కేసులు కూడా, పొంగులేటి నివాసంలో భారీగా నగదు?, ఏమిటీ వాచీల స్మగ్లింగ్ కేసు? తీవ్రమైన ఆర్థిక నేరాల్లో పొంగులేటి కుటుంబం! అనే శీర్షికలతో మరికొన్ని వార్తలను అందిస్తూ రెండో పేజీ మొత్తాన్ని పొంగులేటి సంస్థలపై ఈడీ దాడుల వార్తలకే ఈ పత్రిక కేటాయించడం విశేషం. ఈడీ దాడులపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందనకు కూడా స్థలం కేటాయిస్తూ సింగిల్ కాలమ్ వార్తను ఇదే పేజీలో ప్రచురించింది. తనకు పార్లమెంట్ టికెట్ నిరాకరించి, ఐదేళ్లపాటు ఖాళీగా ఉంచిన కేసీఆర్ పై యుద్ధం ప్రకటిస్తూ రాజకీయ పోరాటం చేసిన పొంగులేటిపై బీఆర్ఎస్ అధికార పత్రిక ఈడీ సోదాల అంశంపై ప్రచురించిన ఆయా వార్తా కథనాలు సహజంగానే చర్చకు దారి తీశాయి. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించుతానని, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏ ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ గేట్ దాటనీయనని ప్రతినబూనిన పొంగులేటి సంస్థలపై ఈడీ సోదాల అంశాన్ని ‘పండుగ’ చేసుకున్న తరహాలో వార్తా కథనాలను తన పాఠకులకు అందించందనే వ్యాఖ్యలు జర్నలిస్టు సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. అయితే ఆయా వార్తల్లో, కథనాల్లో మరే పత్రికా అందించని కొన్ని ఆసక్తికర పాయింట్లు ఉండడం కూడా ఈ సందర్భంగా గమనార్హం.
అయితే ఇదే ఘటనకు రాష్ట్రంలోని ప్రముఖ పత్రికలు కొన్ని పెద్దగా ప్రాధాన్యతనివ్వకపోవడం గమనార్హం. మరికొన్ని పత్రికలు ఈ అంశాన్ని భిన్నంగా అందించడం విశేషం. పొరుగున గల ఆంధ్రప్రదేశ్ లో మంత్రి పొంగులేటి ఫొటోతో వార్తను అందించిన ఓ పత్రిక తెలంగాణాలో ఆయన ఫొటో లేకుండా వార్తను ప్రచురించింది. ఇక టీవీల విషయానికి వస్తే కొన్ని యూ ట్యూబ్ ఛానళ్లు పొంగులేటి టార్గెట్ గా అనేక వార్తా కథనాలు అందిస్తూ గొంతు చించుకోగా, ఓ ప్రముఖ తెలుగు ఛానల్ మంత్రి పేరు కూడా లేకుండా వార్తలను అందించడం మరో విశేషం. మొత్తంగా పొంగులేటి సంస్థలపై ఈడీ దాడుల అంశానికి తెలుగు మీడియాలో ‘నమస్తే తెలంగాణా’ ఇచ్చిన ప్రాధాన్యతపై రాజకీయ కోణంలోనూ చర్చ జరుగుతుండడం విశేషం.