తెలంగాణా రాష్ట్రంలో కొనసాగుతున్నది రైతు ప్రభుత్వమని, రైతు రాజ్యమని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి లోని తన నివాసంలో జరిగిన రైతు సమన్వయ సమితిల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, నూతన రెవెన్యూ చట్టం చారిత్రాత్మకమన్నారు. గ్రామాల్లో అశాంతికి కారణం భూ సమస్యలేనని, నూతన రెవెన్యూ చట్టంతో రైతులు గుండె మీద చేయి వేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చన్నారు. కుటుంబాలతో పాటు, ఇతర లావాదేవీలలో గొడవలకు భూ సమస్యలే కారణమని కూడా చెప్పారు. గ్రామాలు ప్రశాంతంగా ఉండాలన్నదే కేసీఆర్ ఆకాంక్షగా చెబుతూ, ఉచిత కరంటు ముఖ్యమంత్రి ఘనతగా పేర్కొన్నారు.
రైతుబంధు, రైతుభీమా పథకాలు విజయవంతంగా అమలుచేస్తున్నామని, ఎరువులు, విత్తనాల కొరత లేదన్నారు. రైతుల భూరికార్డుల ప్రక్షాళన విజయవంతంగా పూర్తి చేశామని, రైతు కష్టం చేసి స్వేచ్ఛగా ఉండడంతో పాటు తన భూమి తనదే అన్న విషయంలో ఎలాంటి ఆందోళన ఉండొద్దన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, కరోనా ఇబ్బందుల్లో కూడా అన్ని రంగాలు అతలాకుతలమైనా, సీఎం కేసీఆర్ వంద శాతం పంటలు తెలంగాణలో మద్దతు ధరకు కొనుగోలు చేసి వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చారని మంత్రి నిరజంన్ రెడ్డి చెప్పారు. యాసంగిలో ఎఫ్సీఐ దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో ఒక్క తెలంగాణ నుండే 55 శాతం సేకరించిందని, ఆకలిదప్పుల తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో అన్నపూర్ణగా నిలిచి పదిమందికి అన్నం పెట్టే స్థాయికి చేరిందన్నారు. తెలంగాణ రైతు ఈ స్థాయికి చేరడం గర్వకారణమని, నియంత్రిత సాగుతో లాభదాయక పంటలు పండించి రైతులు మరిన్ని లాభాలు గడించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశంగా చెప్పారు.
ఫొటో: వనపర్తిలో నిర్వహించిన రైతు సమన్వయ సమితిల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి