మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ త్వరలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. త్వరలోనే కేటీఆర్ తో కలిసి హుజురాబాద్ లో పర్యటిస్తామని గంగుల కమలాకర్ గురువారం ప్రకటించారు. హుజురాబాద్ లోని 11 మంది మున్సిపల్ కౌన్సిలర్లతో మంత్రి గంగుల కరీంనగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ స్థితి గతులు, పెండింగ్ పనుల గురించి గంగుల తెలుసుకున్నారు. త్వరలోనే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి అవసరమైన పనులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్ తో కలిసి త్వరలోనే హుజురాబాద్ లో పర్యటిస్తామని ఈ సందర్భంగా చెప్పారు.
హుజురాబాద్ లో అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామన్నారు. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులు జాబితా ఇవ్వాల్సిందిగా అధికారులను మంత్రి ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్, ఏఈలకు ఫోన్ చేసి పెండింగులో గల పనులు జాబితాపై మంత్రి గంగుల అరా తీశారు. కార్యకర్తలు, నాయకులు కేసీఆర్ వెంట ఉండాలని, పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. హుజురాబాద్ టీఆర్ఎస్ కేడర్ కు తాను ఉన్నానని, ఎటువంటి సమయంలోనైనా తనకు ఫోన్ చేయవచ్చని చెప్పారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చూసుకుంటుందని, రాబోయే రోజుల్లో పార్టీకోసం పని చేసిన వారికి న్యాయం జరుగుతుందన్నారు. పార్టీ వైపు క్యాడర్ మొత్తం ఉంటుందని తమకు ఫోన్ లు వస్తున్నట్లు తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని, పార్టీని చీల్చే శక్తి ఎవరికీ లేదన్నారు.
టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గేల్లు శ్రీనివాస్, సామల రాజిరెడ్డి, శ్రీ రాం, ఆకుల వెంకటేష్, హుజురాబాద్ కు చెందిన పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు తోట రాజేంద్రప్రసాద్, వైఎస్ చైర్మన్ కొలిపాక నిర్మల, తొగరు సదానందం, తాళ్లపల్లి రమేష్, కొండల్ రెడ్డి, ఆర్ కె రమేష్, ఇమ్రాన్, కుమార్, అనిల్, కేసిరెడ్డి లావణ్య, మొల్గు పూర్ణ చందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు